Sunday, October 5, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంభూ సర్వే రోవర్లు వస్తున్నాయ్..!

భూ సర్వే రోవర్లు వస్తున్నాయ్..!

- Advertisement -

భూధార్‌ మ్యాప్‌ల తయారీలో ఇవే కీలకం
ముందు ప్రభుత్వం.. తర్వాత ప్రయివేటు భూములకు జారీ
ప్రభుత్వ భూములకు ప్రత్యేక సర్వే నంబర్లు
ఇక మీదట బైనంబర్లకు గుడ్‌ బై..!


నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
సంప్రదాయ భూసర్వే పద్ధతుల స్థానాల్లో అధునాతన సాంకేతికతతో కూడిన రోవర్లు, డ్రోన్‌లు అందుబాటులోకి వచ్చాయి. ఇప్పటి వరకు దాదాపు 200 ఏండ్ల కిందటి గొలుసు కొలతలపై ఆధారపడి సర్వే చేస్తున్నారు. దీనివల్ల సర్వేయర్లకు అధిక శ్రమ ఉండేది. సంప్రదాయ విధానంలో సర్వే చేయడానికి 70 నిమిషాలు, మ్యాప్‌ తయారీకి మూడు గంటలు పట్టేది. కానీ రోవర్లతో ఈ ప్రక్రియంతా కేవలం పది నిమిషాల్లో పూర్తవుతుంది. భూమి పైనుంచి రోవర్‌ సహాయంతో.. ఆకాశం నుంచి డ్రోన్‌తో సర్వే చేస్తారు. ఈ సర్వే విధానం ద్వారా రెండేసి రిజిస్ట్రేషన్ల వివాదాలు, తక్కువ భూమి ఉండి ఎక్కువ విస్తీర్ణానికి రిజిస్ట్రేషన్‌, దస్త్రాల్లో భూమి ఉండి క్షేత్రస్థాయిలో లేకున్నా రిజిస్ట్రేషన్‌.. ఇలా రిజి స్ట్రేషన్‌, మ్యుటేషన్‌ చిక్కులేవీ లేకుండా స్పష్టమైన హక్కులు కల్పించేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. దీనిలో భాగంగా డ్రోన్‌లు, రోవర్లను అందుబాటులోకి తీసుకొస్తోంది. వీటి ఆధారంగా భూముల సమగ్ర వివరాలను ఇట్టే తెలుసుకొని రాష్ట్రవ్యాప్తంగా భూధార్‌ కార్డుల జారీకి ప్రభుత్వం సమాయత్తం అవుతోంది.

బై నంబర్లకు బదులు ప్రత్యేక నంబర్లు
ప్రభుత్వ స్థలాలు, అసైన్డ్‌, భూదాన్‌, మాన్యం, చెరువు శిఖాలు.. ఇలా రకరకాల భూములు కబ్జాకు గురవుతు న్నాయి. నకిలీ పాస్‌పుస్తకాల ద్వారా వివాదాలు సృష్టిస్తున్నారు. ఆయా భూములతోపాటు రహదారులు, ఎన్నెస్పీ కాల్వల కోసం సేకరించిన స్థలాలు అన్యాక్రాంతం కాకుండా రెవెన్యూ అధికారులు చర్యలు చేపడుతున్నారు. బై సర్వే నంబర్ల బదులు ప్రత్యేక నంబర్లు కేటాయించి భూధార్‌ కార్డులు ఇవ్వనున్నారు. గొలుసులు, టేపుల కొలతలతో తప్పులకు అవకాశాలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో అత్యాధునిక పరికరాల ద్వారా క్షేత్రస్థాయిలో సర్వే చేయడానికి సమాయత్తం అవుతున్నారు. దీనిలో భాగంగా రోవర్లను ఉపయోగించనున్నారు. సర్వే కోసం ప్రభుత్వం ఖమ్మం జిల్లాకు పది రోవర్లను కేటాయించింది. వీటికి తోడు మరికొన్ని రోవర్లు కావాలని జిల్లా అధికారులు భావించి ఐదు రోవర్లను కొనేందుకు టెండర్లు పిలిచారు.

భూధార్‌ కార్డుల జారీకి తొలి అడుగు
భూధార్‌ కార్డుల జారీ కి తొలి అడుగులో భాగంగా భూముల సమగ్ర వివరాలను తెలుసుకునేందుకు ప్రభుత్వం పూనుకుంది. ఇందుకోసం ఐదు జిల్లాల్లో ఐదు గ్రామాలను పైలెట్‌ ప్రాజెక్టు కింద ఎంపిక చేసింది. దీనిలో ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం ములుగుమాడు ఒకటి. ఈ ఏడాది మే నెలలో ఈ గ్రామంలో 103 సర్వే నంబర్లలోని 845.32 ఎకరాల భూములను అధికారులు డ్రోన్లతోపాటు డిఫరెన్షి యల్‌ గ్లోబల్‌ పొజిషనింగ్‌ సిస్టమ్‌(డీజీపీఎస్‌) ద్వారా సర్వే చేశారు. నక్షా రూపొందించి, అక్షాంశాలు, రేఖాంశాల ఆధారంగా మ్యాపులతో హద్దులు గుర్తించారు. ఇక్కడి అనుభవాలు, లోటుపాట్లపై అధ్యయనం చేస్తున్నారు. వివాదాలకు తావులేకుండా చేసి తొలుత ప్రభుత్వ, ఆ తర్వాత ప్రయివేటు భూములకు భూధార్‌ కార్డులు జారీ చేస్తారు. ఆధార్‌ కార్డు మాదిరిగా భూకమతానికి 14 అంకెలతో కూడిన యూనిక్‌ కోడ్‌ను కేటాయిస్తారు.

ఈ యూనిక్‌ కోడ్‌ పొందేందుకు ఆధార్‌ కార్డుతోపాటు దానికి అనుసంధానిం చిన మొబైల్‌ నంబర్‌ తప్పనిసరి. వీటి ఆధారంగా వ్యవసాయ విస్తర్ణాధికారులు రైతులకు గుర్తింపు సంఖ్యలు కేటయిస్తారు. యూనిక్‌ కోడ్‌ కేటాయింపుతో భూమికి గుర్తింపు వచ్చినట్టు అవుతుంది. ప్రతి రైతు భూముల వివరాల సమాచారం ఫార్మర్‌ రిజిస్ట్రిలో నమోదవుతుంది. ఇది భూ యజమాని, స్థానం, విస్తీర్ణం తదితర వివరాలను సులభంగా గుర్తిేంందుకు దోహదపడుతుంది. భూమి ఉపయోగం నిర్ధారణ, ఆక్రమణలు, అక్రమ కట్టడాలనూ నియంత్రించొచ్చు. బ్యాంకింగ్‌, బీమా వ్యవస్థలతోనూ భూముల అనుసంధానం ఎంతో సులభమని అధికారులు అంటున్నారు. ధరణి ద్వారా భూముల వివరాల్లో దొర్లిన అనేక తప్పిదాలను భూభారతి ద్వారా పరిష్కరిస్తామని ప్రభుత్వం చెబుతున్న నేపథ్యంలో కీలకమైన భూధార్‌ కార్డుల జారీలో సర్వే రోవర్ల పాత్ర ప్రధానమైనది.

ముందుగా ప్రభుత్వ భూముల సర్వే..
రోవర్ల ద్వారా ముందుగా ప్రభుత్వ భూములను సర్వే చేస్తారు. ఒక్క ఖమ్మం జిల్లాలోనే 1.84 లక్షల ఎకరాల ప్రభుత్వ స్థలం ఉంది. వీటిలో 47,442 ఎకరాల్లో అసైన్డ్‌ భూములు ఉన్నాయి. ఎర్రుపాలెం, వైరా, నేలకొండపల్లి, సింగరేణి, ముదిగొండ, ఖమ్మం అర్బన్‌, తిరుమలాయ పాలెం, కల్లూరు, ఏన్కూరు మండలాల్లో 1,258 ఎకరాల్లో భూదాన్‌ భూములు ఉన్నాయని అంచనా. వీటిలో 101 ఎకరాలపై కోర్టు కేసులు ఉండగా 20 ఎకరాలపై నమోదైన ఫిర్యాదులను అధికారులు పరిష్కరించారు. 726.27 ఎకరాలను ప్రజలకు అసైన్‌ చేశారు.

రోవర్లు రాగానే మ్యాప్‌ల రూపకల్పన
ప్రభుత్వం పది రోవర్లు ఇస్తుంది. దీనికితోడు మరో ఐదు రోవర్లకు టెండర్లు పిలిచాం. ఇవి రాగానే భూసర్వే మొదలు పెట్టి భూధార్‌ కార్డుల జారీకి మ్యాప్‌లు రూపొందిస్తాం.
పినిరెడ్డి శ్రీనివాసరెడ్డి, ఖమ్మం జిల్లా అదనపు కలెక్టర్‌

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -