నవతెలంగాణ – బంజారా హిల్స్
యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని రవాణా, బీసీ సంక్షేమ మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు. అపోలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ ఆధ్వర్యంలో బంజారాహిల్స్లోని కేబీఆర్ పార్క్ వద్ద జరిగిన ‘స్టాప్ సబ్స్టెన్స్ అబ్యూస్’ రన్ను మంత్రి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ .. యువతలో మాదకద్రవ్యాల వినియోగం పెరుగుతుందన్నారు. ఇది అతిపెద్ద ముప్పు అన్నారు. ఇది వారి ప్రతిభను నాశనం చేస్తుందన్నారు. విద్యను దెబ్బతీస్తుందని చెప్పారు. ఉజ్వల భవిష్యత్తు నాశనం అవుతుందన్నారు. ప్రతి యువకుడు తాను మాత్రమే కాకుండా, తన చుట్టూ ఉన్న వారిని కూడా ఈ మాదకద్రవ్యాలకు దూరంగా ఉంచేందుకు ప్రయత్నించాలని పిలుపునిచ్చారు.
ఈ రన్ లో అపోలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ డీన్ డాక్టర్ కే మనోహర్, సీఓఓ అపర్ణా రెడ్డి పాల్గొన్నారు. అనాస్టమోజ్ 2025 సాంస్కృతిక, క్రీడా, సాహిత్య మహోత్సవం అపోలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ వార్షిక ప్రతిష్టాత్మక ఉత్సవం. ఈ ఏడాది ఈ వేడుకలు అక్టోబర్ 5 నుంచి 11వ తేదీ వరకు జరుగనున్నాయి. తెలంగాణలోని వివిధ మెడికల్ కాలేజీల విద్యార్థులు ఇందులో పోటీ పడతారు. విభిన్న విభాగాల విద్యార్థులు తమ ప్రతిభను,బృంద స్ఫూర్తిని, సృజనాత్మకతను వివిధ రకాల పోటీలు,వినోద కార్యక్రమాల ద్వారా ప్రదర్శించనున్నారు.
ఈ ఏడాది ఉత్సవం థీమ్ ‘డైవ్ ఇన్టు ది మెడివర్స్ ఆఫ్ మ్యాడ్నెస్’.ఈ ఉత్సవంలో ఇండోర్,అవుట్డోర్ క్రీడా, సాంస్కృతిక కార్యక్రమాలు, సాహిత్య పోటీలు, అకడమిక్ ఈవెంట్లు కలవు. క్రీడా విభాగంలో క్రికెట్, ఫుట్బాల్, చెస్ వంటి పోటీలు నిర్వహించనున్నారు. సాంస్కృతిక ప్రదర్శనల్లో నృత్యాలు, గానం, నాటకాలు, షార్ట్ఫిల్మ్స్ మరెన్నో కళారూపాలు ఉండనున్నాయి. సాహిత్య విభాగంలో క్విజ్,కవితా రచన, సృజనాత్మక రచన వంటి పోటీలు ఉంటాయి. అకడమిక్ విభాగంలో కేస్ స్టడీస్, పోస్టర్, పేపర్ ప్రెజెంటేషన్లు, మెడికల్ క్విజ్లు నిర్వహించబడతాయి. ఇంటరాక్టివ్ వర్క్షాప్స్, వినోదభరిత కార్యక్రమాలు అతిథులను అలరించనున్నాయి. ఈ కార్యక్రమంలో నాలుగు వందల మంది వైద్య విద్యార్థులతో పాటు వైద్యతర సిబ్బంది పాల్గొన్నారు.