Monday, October 6, 2025
E-PAPER
Homeమానవిరుతుక్రమం మొదలయిందా..?

రుతుక్రమం మొదలయిందా..?

- Advertisement -

రుతు క్రమం అనేది ఆడపిల్లల జీవితంలో ఒక పెద్ద మైలు రాయి వంటిది. బాల్య దశనుండి స్త్రీదశకు చేరడానికి సూచిక. దీనిని రజస్వల, సమర్త, పుష్పవతి అవ్వడం ఇలా పలువిధాలుగా పేర్కొంటారు. సాధారణంగా ఈ దశ ఆరోగ్యంగా ఉన్న ఆడపిల్లల్లో పదకొండు నుండి పద్నాలుగేండ్ల వయసులో మొదలౌతుంది. రుతు క్రమ ఆరంభానికి రెండు-మూడు ఏండ్ల ముందుగానే సంబంధించిన శారీరిక మార్పులు ప్రారంభమౌతాయి. ఈ మార్పులు సహజంగా జరిగేవి, జీవసంబంధిత మైనవి. మరి అలాంటప్పుడు సమస్యలేంటి అంటున్నారా..?

సమస్యలు చాలా ఉన్నాయి. చాలావరకు ఇంట్లో తల్లి-తదితర స్త్రీలు, బడిలో టీచర్లు, సహాధ్యాయినులు, స్నేహితురాళ్ళు, స్నేహపూర్వక వాతావరణం, సంభాషణలు, అంతర్జాల సహకారం.. ఇలా ఎన్నో మాధ్యమాల ద్వారా తీర్చగలిగేవే. తీర్చలేని వాటికీ వైద్యసహకారం ఉండనే ఉంది. ముందస్తుగా తుళ్ళుతూ, ఆడుతూ, తిరుగుతున్న చిన్నారి పాప కాళ్లకు టక్కున సంకెళ్లు బిగించినట్టుగా అయిపోతుంది. బాల్య వ్యవస్థ నుండి కౌమార్యంలోనికి అడుగుపెడుతున్న తరుణంలో ఆ బాలికకు ఈ మార్పుపట్ల మానసిక సంసిద్ధత లేకపోవచ్చు. ఈ స్థితి నిర్ణీత వయసు కంటే ముందుగా రుతు క్రమం జరిగితే ఇంకా కష్టమవుతుంది.

శారీరిక మార్పుల పట్ల విముఖత
అమ్మాయికి తన శరీరంలో ఉత్పన్నమౌతున్న మార్పుల పట్ల అంతవరకూ లేని కుతూహలం మొదలవ్వటంతో, ఆమె సందేహాలకు సమాధానాలు అప్పుడప్పుడు దొరకక ఒక విధమైన అయోమయస్థితి ఏర్పడవచ్చు. శారీరిక మార్పులకు హార్మోన్ల వలన కలిగే చికాకు తోడౌతుంది. ఆర్థికంగా, సామాజికంగా దిగువ స్థాయి ఆడపిల్లలకు పరిశుభ్రత పరంగా, తగిన శౌచాలయ సదుపాయాలు ఇంటి దగ్గర/ బడిలో లేకపోవచ్చు. ఉన్నప్పటికీ నీటి వ్యవస్థ లేక ఏమీ చేయలేని అగమ్యగోచర పరిస్థితిలో పడతారు. గోప్యత, సహానుభూతి లోపించడం వంటివి తోడైతే ఆ స్థితి తమకొక చేయని నేరానికి, ఆడపిల్లై పుట్టినందుకు అనుభవించాల్సివస్తున్న శిక్షగా పరిగణించడం మొదలవ్వచ్చు. ఈ వైఖరి వారిలో మానసిక సమస్యలుకు దారితీయొచ్చు.

సౌకర్యాల లేమితో…
నెలసరి రక్తస్రావం ఆమెకు భయాందోళనలు కలిగించవచ్చు. తనను తాను ఎలా శుభ్రంగా ఉంచుకోవాలో తెలియక అయోమయస్థితి ఎదుర్కోవాల్సి రావచ్చు. ముఖ్యంగా బీద మధ్యతరగతి కుటుంబాల పిల్లల్లో ఇటువంటివి జరగవచ్చు. ఇంట్లో తల్లి/ఆడవారు లేని ఆడపిల్లలు ఇంకెన్నో ఇబ్బందులు పడాల్సి వస్తుంది. రుతుక్రమం మొదలైన తర్వాత కొన్ని నెలల వరకు నెలసరి స్రావం అనుకున్న తేదీల్లో కాకుండా ముందుగా జరగడం, దానికి సంసిద్ధత లేనందున ముఖ్యంగా మగపిల్లలు సహవిద్యార్థులుగా ఉన్న బడిలో అభాసుపాలు కావడం వంటి అవమానకరమైన సాంఘిక పరిస్థితులను కొన్నిటిని సహించవల్సివస్తుంది. ప్రభుత్వం ఆడపిల్లలు చదువుతున్న బళ్ళకి సానిటరీ ప్యాడ్లు సరఫరా చేస్తున్నప్పటికీ, అవసరానికి కొందరికి అందుబాటులో ఉండకపోవచ్చు. కొందరు రుతుస్రావమప్పుడు బట్టను ఉపయోగిస్తుంటారు. వాడినదాన్ని ఉతుక్కొని తిరిగి వాడుతుంటారు. దీనివల్ల ఏమాత్రం పరిశుభ్రత లోపించినా, అంటువ్యాధులు వచ్చే ఆస్కారముంటుంది.

పదకొండేండ్లలోపే రుతుక్రమానికి కారణం?
పదకొండేండ్లలోపు అమ్మాయిలో రుతుక్రమం మొదలైందంటే అది అకాలమైనదిగా పరిగణించవచ్చు. ఆలా జరగడానికి చాలా కారణాలున్నాయి. ఇది తరచుగా ఉన్నత సామజిక-ఆర్థిక స్థితి ఉన్న కుటుంబాల్లో జరుగుతుంటుంది. పసిబిడ్డగా ఉన్నప్పుడు పోతపాలు తాగినవారు, చర్మం కింద ఎక్కువ కొవ్వు ఉన్న వారు, బాడీ మాస్‌ ఇండెక్స్‌ (బీఎంఐ) ఎక్కువగా ఉండటం, మాంసం, చక్కర పూరితమైన నిత్యాహారం, ఊబకాయం, శారీరిక వ్యయామం లేకపోవడం, దీర్ఘ కాల ఒత్తిడి, హార్మోన్ల అసాధారణతలు, అరుదుగా చిన్నతనపు మధుమేహం, మెదడు, థైరాయిడ్‌ సంబంధిత వ్యాధులు ఉన్న పిల్లల్లో అకాల రుతుక్రమం వచ్చే ఆస్కారముంటుంది. జన్యుపరమైన కారణాలు కూడా దీనికి దోహదపడతాయి.

పర్యవసానాలు?
అకాల రుతుక్రమం మొదలైన ఆడపిల్లల్లో యుక్త వయసుకు వచ్చిన తర్వాత ఊబకాయం, డయాబెటిస్‌, పీసీఓడి, ఎండో మెట్రియోసిస్‌ వంటి గర్భకోశానికి సంబంధించిన జబ్బులు, రొమ్ము, ఓవరీ ఎండోమెట్రియల్‌ క్యాన్సర్లు, గుండె జబ్బులు, కాలక్రమేణా ఎక్కువగా తలెత్తే అవకాశముంది. అంతే కాకుండా ఈ అమ్మాయిలు వయసుకు తగ్గట్టుగా పొడవు ఎదగలేరు. పొట్టిగా ఉండిపోవచ్చు. అకారణంగా ఆదుర్దా, ఒత్తిడి, డిప్రషన్‌ వంటి మానసిక రుగ్మతలకు ఎక్కువగా లోనౌతుంటారు. పొత్తి కడుపులో నొప్పి తీవ్రంగా ఉండొచ్చు. వెన్ను నొప్పితో కూడి రావొచ్చు. వికారం, వాంతులు, విరేచనాల కూడా మొదటి మూడు రోజులు ఉండవచ్చు. నొప్పి నెల మధ్యలో (అండోత్సర్గం నొప్పి, ఓవులేషన్‌ పెయిన్‌) మొదలయ్యి రుతు స్రావం మొదటి మూడు రోజులవరకు కొనసాగవచ్చు. సాధారణంగా రుతుక్రమం మొదలైన తర్వాత కొన్నినెలల నుండి ఏండ్ల వరకు అండోత్సర్గం (ఓవులేషన్‌) జరగపోవచ్చు. అప్పుడు నొప్పి రుతు స్రావం మొదటి మూడు రోజుల వరకే పరిమితం కావొచ్చు. వెన్నుపోటు, కాళ్ళు గుంజటం వంటివి దీనికి తోడవ్వచ్చు. కొన్నిసార్లు రుతు స్రావం తీవ్రంగా జరగవచ్చు. నాలుగైదు నుండి పది రోజులు వరకు జరగవచ్చు. అటువంటి స్థితిలో తీవ్రమైన నీరసం, క్రమేణా చర్మం పాలిపోయి, రక్తహీనతతో కూడిన అనారోగ్య పరిస్థితులు ఏర్పడవచ్చు.

పలు రకాల సమస్యలు
అరుదుగా రుతు స్రావం కొంతకాలం ఆగిపోవచ్చు. క్రమబద్దీకరణ జరగకపోవచ్చు. రుతు చక్రం కాల నిర్దిష్టత లోపించటంతో అనేక రకాల సామాజిక ఇబ్బందులు ఎదుర్కొనవలసి రావచ్చు. మాములుగా నాలుగు నుండి ఐదు వారాల కాలాన్ని రుతుచక్ర సమయంగా పరిగణింపబడుతుంది. రుతుస్రావం సమయం నిర్ణీత తేదీలకు రెండు మూడు రోజులు అటు ఇటుగా గుర్తుపెట్టుకుంటాం. అలా కాకుండా రుతుక్రమం జరిగిన తర్వాత కొందరిలో మూడు వారాలకే రుతుస్రావం మొదలవ్వడం, పది పన్నెండు రోజులు జరగడం లేదా అసలు రాకపోవడం, వచ్చినా కొంత మరకలా కనిపించడం ఇలా పలు రకాల సమస్యలు తెచ్చిపెడుతుంది. ఈ రకమైన సమస్యలు మాములుగా అమ్మాయికి పద్దెనిమిదేండ్లు వచ్చే సరికి ఋతుచక్రం క్రమబద్దీకరమౌతుంది. అలా జరగని పక్షంలో వెంటనే వైద్య నిపుణులను తప్పక సంప్రదించాలి.

డా|| మీరా, ఎం.డి. రిటైర్డ్‌ ప్రొఫెసర్‌, ఉస్మానియా మెడికల్‌ కాలేజ్‌

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -