Monday, October 6, 2025
E-PAPER
Homeఆటలుఐదోసారి ఉతికేశారు

ఐదోసారి ఉతికేశారు

- Advertisement -

పాకిస్తాన్‌పై భారత్‌ ఘన విజయం
వన్డే వరల్డ్‌కప్‌లో 5-0తో అజేయ రికార్డు
భారత్‌ 247/10, పాకిస్తాన్‌ 159/10

అమ్మాయిలూ అదరగొట్టారు. పొరుగు దేశం పాకిస్తాన్‌పై అజేయ రికార్డు కొనసాగించారు. పాకిస్తాన్‌పై వరుసగా 12వ మ్యాచ్‌లో విజయభేరి మోగించిన టీమ్‌ ఇండియా.. ఐసీసీ మహిళల వన్డే వరల్డ్‌కప్‌లో ఐదోసారి జైత్రయాత్ర సాగించింది. ఆదివారం కొలంబోలో జరిగిన వన్డే వరల్డ్‌కప్‌ మ్యాచ్‌లో పాకిస్తాన్‌పై భారత్‌ 88 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ప్రపంచకప్‌ గ్రూప్‌ దశలో భారత్‌కు ఇది వరుసగా రెండో విజయం కాగా.. పాకిస్తాన్‌కు ఇది వరుసగా రెండో పరాజయం.

నవతెలంగాణ-కొలంబో
ఐసీసీ మహిళల 2025 వన్డే వరల్డ్‌కప్‌లో భారత్‌ జోరు కొనసాగుతుంది. గువహటిలో శ్రీలంకపై సూపర్‌ విక్టరీ సాధించిన టీమ్‌ ఇండియా..కొలంబోలో పాకిస్తాన్‌ను చిత్తు చేసింది. 248 పరుగుల ఛేదనలో పాకిస్తాన్‌ అమ్మాయిలు 43 ఓవర్లలో 159 పరుగులకే చేతులెత్తేశారు. భారత బౌలర్లు క్రాంతి గౌడ్‌ (3/20), దీప్తి శర్మ (3/45), స్నేహ్ రానా (2/38)లు వికెట్ల వేటలో విజృంభించారు. పాక్‌ బ్యాటర్‌ సిద్రా ఆమిన్‌ (81, 106 బంతుల్లో 9 ఫోర్లు, 1 సిక్స్‌) అర్థ సెంచరీతో ఒంటరి పోరాటం చేసింది. కానీ సహచర బ్యాటర్ల నుంచి సహకారం దక్కలేదు. ఓపెనర్లు మునీబా అలీ (2), సదాఫ్‌ (6) సహా అలియా రియాజ్‌ (2), ఫాతిమా సనా (2), సిద్రా నవాజ్‌ (14)లు తేలిపోయారు. నటాలీ పర్వేజ్‌ (33, 46 బంతుల్లో 4 ఫోర్లు) మాత్రమే ఆమిన్‌కు కాసింత సహకారం అందించింది.

అయినా, ఆ జట్టు 159 పరుగులకే ఆలౌటై 88 పరుగుల తేడాతో దారుణ పరాజయం చవిచూసింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన టీమ్‌ ఇండియా నిర్ణీత 50 ఓవర్లలో 247/10 పరుగులు చేసింది. భారత బ్యాటర్లలో ఎవరూ అర్థ సెంచరీ సాధించలేదు, కానీ బ్యాటర్లూ సమిష్టిగా పరుగులు రాబట్టారు. హర్లీన్‌ డియోల్‌ (46, 65 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్‌), జెమీమా రొడ్రిగస్‌ (32, 37 బంతుల్లో 5 ఫోర్లు), రిచా ఘోష్‌ (35 నాటౌట్‌, 20 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), దీప్తి శర్మ (25, 33 బంతుల్లో 1 ఫోర్‌), స్నేహ్ రానా (20, 33 బంతుల్లో 2 ఫోర్లు) రాణించారు. ఓపెనర్లు ప్రతీకా రావల్‌ (31), స్మతీ మంధాన (23), హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (19) సైతం మెరిశారు. పాకిస్తాన్‌ బౌలర్లలో డయాన్‌ బేగ్‌ (4/69) నాలుగు వికెట్ల ప్రదర్శనతో ఆకట్టుకుంది. భారత్‌ తన తర్వాతి మ్యాచ్‌లో గురువారం విశాఖపట్నంలో దక్షిణాఫ్రికాతో తలపడనుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -