పాపం బీఆర్‌ఎస్‌దే అయినా ప్రభావం కాంగ్రెస్ పైనే
కేంద్రం తీరుతో వచ్చిపడిన యూరియా గండం
మరోవైపు ఎన్నికల హామీల గుబులు
ఫ్రీ కరెంట్, వడ్డీలేని రుణాలు, ఉచిత బస్సుపైనే ఆశలు
‘స్థానికం’లో అనుకూలమెంతో..ప్రతికూలమూ అంతే
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
కాంగ్రెస్ సర్కార్‌కు స్థానిక పోరు సవాల్‌గా మారింది. క్షేత్రస్థాయిలో అనుకూల అంశాలెన్ని ఉన్నాయో…ప్రతి కూల అంశాలూ అంతే స్థాయిలో కనిపిస్తున్నాయి. ముఖ్యంగా పంచాయతీరాజ్ శాఖతో నేరుగా సంబంధమున్న అంశాలు, స్థానిక సమస్యలు ఎక్కువగా కలవరపెడుతున్నాయి. బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలోని పథకాలకు సంబంధించిన పెండింగ్ బిల్లులు, మాజీ సర్పంచుల పెండింగ్ బిల్లుల ప్రభావం కాంగ్రెస్ సర్కారుపై పడుతున్నది. కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చే నిధుల్లో వాటా తగ్గడం, ఏ అవసరానికి నిధులు కావాలన్నా కేంద్రంలోని బీజేపీ సర్కారు సవాలక్ష ఆంక్షలు విధించడం రేవంత్‌రెడ్డి సర్కారుకు ఇబ్బందికరంగా మారింది. ఓవైపు గత ప్రభుత్వ తీరుతో ఆర్థిక వ్యవస్థ గాడితప్పడం, మరోవైపు కేంద్రం ఆంక్షలతో నిధుల కొరత రాష్ట్ర సర్కాను వెన్నాడుతున్నది. ఏకకాలంలో రైతులకు రూ.2 లక్షల లోపు రుణమాఫీ చేయడం, పంట బోనస్ చెల్లించడం వంటి మంచి కార్యక్రమాలు కాంగ్రెస్ సర్కారుకు ప్లస్‌పాయింట్‌గా మారాయి.
అయితే, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు యూరియా కోటాను కుదించడం… ఇస్తామన్నదాంట్లోనూ కోత పెట్టడం…ఇచ్చినదీ సకాలంలో ఇవ్వకపోవడం వంటి పరిణామాలతో యూరియా గండం కాంగ్రెస్ సర్కారుకు చుట్టుకున్నది. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతిపక్షాలకు ఒక ఆయుధంగా మారింది. అయితే, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ రాజకీయ ఎత్తుగడను, తెలంగాణకు చేస్తున్న అన్యాయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కాంగ్రెస్ పార్టీ విఫలమైంది. అదే సమయంలో యూరియా కొరత అంశాన్ని రాజకీయం చేయడంలో బీఆర్‌ఎస్, బీజేపీ పార్టీలు సక్సెస్ అయ్యాయి. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం మాజీ సర్పంచులకు పెట్టిపోయిన పెండింగ్ బిల్లుల వ్యవహారం కూడా కాంగ్రెస్ సర్కారు మెడకు చుట్టుకున్నది. ప్రభుత్వమనేది నిరంతరాయ ప్రక్రియ. పెండింగ్ బిల్లులను కాంగ్రెస్ ప్రభుత్వం క్లియర్ చేయాల్సి ఉండే. అలా చేయలేదు. గత ప్రభుత్వం పెట్టిపోయిన బిల్లులు కాబట్టి విడతల వారీగా చెల్లిస్తామంటూ మెలిక పెట్టి కూర్చున్నది. రూ.400 కోట్లకుపైగా మాజీ సర్పంచులకు రాష్ట్ర సర్కారు బాకీ పడింది. దీనిపై మాజీ సర్పంచులు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి పోరాడుతూనే ఉన్నారు.
ప్రతి గ్రామంలోనూ తాజా మాజీలు ఎంతో కొంత ప్రభావం చూపేవారే. ఆ బిల్లులను క్లియర్ చేస్తే కాంగ్రెస్‌కు కాస్త ప్లస్‌పాయింట్‌గా మారే అవకాశముండేదనే చర్చ నడుస్తున్నది. కోడ్ నేపథ్యంలో ఇప్పుడు క్లియర్ చేయలేని పరిస్థితి. మిషన్‌భగీరథ పథకంలో భాగంగా పనిచేస్తున్న కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు సరిగా ఇవ్వట్లేదు. ఇంకా మూడు నెలల బిల్లులు పెండింగ్‌లో ఉన్నట్టు సమాచారం. రాష్ట్ర ప్రభుత్వం బిల్లులు ఇవ్వడం లేదు కాబట్టి చేతుల్లోంచి జీతాలివ్వలేమంటూ మిషన్‌భగీరథ కాంట్రాక్టర్లు చేతులెత్తేశారు. గ్రీన్‌ఛానల్ ద్వారా ప్రతి నెలా వేతనాలు ఎప్పటికప్పుడు విడుదల చేస్తామనీ, మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేస్తామని గ్రామపంచాయతీ కార్మికులకు కాంగ్రెస్ సర్కారు హామీనిచ్చింది. ఇవి రెండూ పట్టాలెక్కలేదు. రెండు,మూడు నెలలకోసారి జీతాలు విడుదల చేస్తున్న పరిస్థితి కనిపిస్తున్నది. ప్రస్తుతం వారికి రెండు నెలల వేతనాలు రావాల్సి ఉంది. ఇటీవల గ్రామ కార్యదర్శులకు రూ.104 కోట్లు విడుదల చేసినట్టు రాష్ట్ర సర్కారు ప్రకటించింది. అయితే, ఆ నిధులు కరెంటు బిల్లులు, రోజువారీ ఖర్చులకు, బుక్ అడ్జెస్ట్‌మెంట్లకు సంబంధించినవే.
పంచాయతీ కార్యదర్శులు తమ చేతుల్లోంచి, అప్పు చేసి పెట్టిన పనులకు సంబంధించి పెండింగ్ బిల్లులను ఇంకా క్లియర్ చేయలేదు. ఆ 104 కోట్ల రూపాయలు కూడా వారి ఖాతాల్లో ఇంకా జమకాలేదని విశ్వసనీయ సమాచారం. రెండు నెలలుగా ఫీల్డు అసిస్టెంట్లకు వేతనాలు ఇవ్వలేదు. పైన ప్రస్తావించిన మాజీ సర్పంచులు, ఉద్యోగులు, కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు క్షేత్రస్థాయిలో నిరంతరం ప్రజలతో సత్సంబంధాలు కలిగినవారే. ఈ అంశం అధికార పార్టీకి ప్రతి కూలంగా మారే అవకాశముంది. ఎట్లాగూ ఎన్నికలకు పోయే ఆలోచన ఉంది కాబట్టి ముందే బిల్లులను, జీతాలను క్లియర్ చేస్తే కాంగ్రెస్ సర్కారు పట్ల కొంత సానుకూలంగా మారేదని చర్చనడుస్తున్నది. వంద యూనిట్ల లోపు ఉచిత విద్యుత్ పథకంతో గ్రామీణ పేదలు పెద్ద ఎత్తున లబ్దిపొందుతున్నారు. ఈ అంశం స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్లస్‌పాయింట్‌గా మారే అవకాశముంది. గ్యాస్ సబ్సిడీ పథకం కూడా కాంగ్రెస్‌కు లబ్ది చేకూర్చనున్నది.
స్వయం సహాయక బృందాల సభ్యులకు వడ్డీలేని రుణాలు అందించి అదే సమయంలో వడ్డీ బకాయిలను విడుదల చేసింది. ఇది కూడా అధికార పార్టీకి పెద్ద సానుకూల అంశం. అన్నింటి కంటే ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు పెద్ద ఎత్తున ఆర్థిక భరోసానిస్తున్నది. పనులు, ఉద్యోగాల నిమిత్తం ఒక ఊరి నుంచి మరో ఊరికి ప్రయాణంలో చేయడంలో ఈ పథకం ఎంతో ఉపయుక్తంగా మారింది. మహిళలకు ఆర్థిక వెసులుబాటునూ కల్పిస్తున్నది. అది అంతిమంగా కుటుంబానికి ఉపయోగకరంగా మారుతున్నది. మహిళలు సొంతంగా వ్యాపారులుగా ఎదగడంలో తోడ్పాటును అందిస్తున్నది. ఈ పథకాలతో మహిళల్లో కాంగ్రెస్ సర్కార్ పట్ల సింపతీ పెరిగింది. అయితే, గ్రామీణ ప్రాంతాల్లో భూమిలేని పేదలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కింద ఏటా రూ.12 వేలు ఇస్తామని కాంగ్రెస్ సర్కారు మాటిచ్చింది. ఇప్పటివరకూ రాష్ట్రంలో 50 వేల మందికే అవి అందాయి.
ప్రభుత్వం గుర్తించిన వారిలో ఇంకా 2.5 లక్షల మంది ఎదురుచూస్తున్నారు. వీరే కాకుండా భూమిలేని పేదలు పెద్ద ఎత్తున ఉన్నారనే చర్చ ఉంది. ఈ పథకం ద్వారా ప్రభుత్వం నుంచి లబ్ది పొందిన వారి కంటే పొందని వారి సంఖ్య నాలుగు రెట్లు ఎక్కువగా ఉంది. వీరి ప్రభావం స్థానిక సంస్థల ఎన్నికల్లో స్పష్టంగా కనిపించే అవకాశముంది. ఇందిరమ్మ ఇండ్లదీ ఇదే పరిస్థితి. ఊర్లో ఇండ్లు వచ్చిన వారి సంఖ్య పదిలోపే ఉంటే రాని వారి సంఖ్య వందల్లో ఉంది. రానివారిలో సహజంగానే అసంతృప్తి ఉంటుంది. పింఛన్ల కోసం ఎంతో మంది ఎదురుచూస్తున్నారు. వీటన్నింటినీ కాంగ్రెస్ సర్కారు ఏవిధంగా ఓవర్‌కమ్ చేస్తుంది? స్థానిక ఎన్నికల్లో సాధారంగా ప్రజలు అధికార పార్టీ వైపు మొగ్గుచూపే అవకాశాన్ని ఏవిధంగా సద్వినియోగం చేసుకుంటుంది? అనేది వేచిచూడాలి.