Monday, October 6, 2025
E-PAPER
Homeరాష్ట్రీయందసరా సెలవులు ముగిశాయ్

దసరా సెలవులు ముగిశాయ్

- Advertisement -

పల్లె వదిలి పట్నానికి..
ప్రయాణికుల రాకతో కిక్కిరిసిన బస్టాండ్లు
విజయవాడ-హైదరాబాద్‌ హైవేపై వాహనాల రద్దీ

చౌటుప్పల్‌ : దసరా పండగకు సొంతూళ్లకు వెళ్లిన ప్రజలు సెలవులు ముగియడంతో రాజధాని హైదరాబాద్‌కు తిరుగుపయనమయ్యారు. దీంతో ఆదివారం జంటనగరాల్లో రద్దీ కనిపించింది. ఎంజీబీఎస్‌,జేబీఎస్‌తో సహా పలు ప్రాంతాల్లో బస్సుల్లో నుంచి ప్రయాణికులు కిటకిటలాడారు. తమ కుటుంబసభ్యులతో కలిసి లగేజీలను మోసుకుంటూ గమ్యానికి చేరుకున్నారు. ఆటోలు, సిటీబస్సులకోసం అవస్థలు పడకతప్పలేదు.ఇక హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారిపై వాహనాలు బారులు తీరాయి. దారి పొడవునా రద్దీ కొనసాగడంతో వాహనాలు ఆగుతూ.. నెమ్మదిగా కదిలాయి. నార్కట్‌పల్లి కామినేని జంక్షన్‌, చిట్యాల, పెద్దకాపర్తి, పంతంగి టోల్‌ప్లాజా, చౌటుప్పల్‌ వద్ద వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. వాహనాల రద్దీని దృష్టిలో పెట్టుకుని పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు.

కేతేపల్లి మండలం కొర్లపహాడ్‌ టోల్‌ప్లాజా వద్ద రోజుకు 25వేల వాహనాలు వెళ్తుండగా.. శనివారం ఒక్క రోజే 34వేలు, ఆదివారం సాయంత్రం ఐదు గంటల వరకు 27వేలు వెళ్లాయి. పంతంగి టోల్‌ప్లాజా వద్ద రోజుకు 40వేల వరకు వాహనాలు వెళ్తుండగా.. శనివారం ఒక్క రోజే 51వేల వరకు వెళ్లాయి. ఆదివారం సాయంత్రం ఐదు గంటల వరకు 49వేల వాహనాలు వెళ్లినట్టు టోల్‌ప్లాజా అధికారులు వెల్లడించారు.రద్దీ నేపథ్యంలో పంతంగి టోల్‌ప్లాజా వద్ద హైదరాబాద్‌ మార్గంలోనే 12 టోల్‌ బూత్‌లను తెరిచారు. మొత్తం ఇక్కడ 16 టోల్‌ బూత్‌లు ఉండగా.. విజయవాడ మార్గంలో కేవలం నాలుగు బూత్‌లను మాత్రమే తెరిచి వాహనాలను పంపించారు. టోల్‌ప్లాజా అధికారులు, రాచకొండ ట్రాఫిక్‌ పోలీసులు సమన్వయం చేసుకొని వాహనాల రాకపోకలను క్రమబద్ధీకరించారు. భువనగిరి ట్రాఫిక్‌ ఏసీపీ ప్రభాకర్‌రెడ్డి, చౌటుప్పల్‌ ట్రాఫిక్‌ ఇన్‌స్పెక్టర్‌ విజయ్ మోహన్‌ ఆధ్వర్యంలో రాచకొండ పోలీసులు బందోబస్తు నిర్వహించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -