పాఠ్యపుస్తకాల్లో చరిత్ర పాఠ్యాంశాల మార్పు దారుణం
తెలంగాణ విద్యాకమిషన్ చైర్మెన్ ఆకునూరి మురళి
ఆల్ ఇండియా ప్రొఫెషనల్స్ కాంగ్రెస్(ఏఐపీసీ) ఆధ్వర్యంలో ‘పాఠ్యపుస్తకాల్లో చరిత్ర వక్రీకరణ.. దాని చిక్కులు’ అంశంపై సెమినార్
నవతెలంగాణ -సుల్తాన్ బజార్
పాఠ్య పుస్తకాల్లో భారతదేశ లౌకిక, సమగ్ర చారిత్రక వారసత్వాన్ని వక్రీకరిస్తూ విద్యార్ధుల్లో ఆలోచనా శక్తిని బలహీనపరిచే ప్రయత్నిం కేంద్ర ప్రభుత్వం చేస్తున్నదని తెలంగాణ విద్యా కమిషన్ చైర్మెన్ ఆకునూరి మురళి అన్నారు. హైదరాబాద్ నాంపల్లిలోని మదీనా ఎడ్యుకేషన్ సెంటర్‌లో ఆల్ ఇండియా ప్రొఫెషనల్స్ కాంగ్రెస్ (ఎఐపీసీ) ఆధ్వర్యంలో ‘పాఠ్యపుస్తకాల్లో చరిత్ర వక్రీకరణ.. దాని చిక్కులు’ అనే అంశంపై ఆదివారం సెమినార్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజకీయ ఎజెండాలకు ఉపయోగపడేలా చారిత్రక వాస్తవాలను తారు మారు చేయడం దారుణమాన్నరు. విద్యా విధానంలో విభజన భావజాలాలపై, ఐక్యత, వాస్తవ ఖచ్చితత్వాన్ని ప్రోత్సహించే పాఠ్యాంశాలు అవసరమని తెలిపారు.
ఇటువంటి వక్రీకరణల వల్ల యువతలో విమర్శనాత్మక ఆలోచనాశక్తి బలహీన పడుతుందని హెచ్చరించారు. ప్రొఫెసర్ రామ్ పునియాని, డాక్టర్ కాంచన్ మాట్లాడుతూ.. పాఠ్య పుస్త కాలలోని బహువచన కథనాలు, విద్యా, స్వేచ్ఛ, ప్రజాస్వామ్య విలువలపై నొక్కి చెప్పారు. సైద్ధాంతిక పక్షపాతాల నుంచి చరిత్ర, విద్యను కాపాడటానికి విద్యావేత్తలు, విధాన రూపకర్తల నుంచి సమిష్టి కృషి అవసరమని పిలుపునిచ్చారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం రిటైర్డ్ జర్నలిజం ప్రొఫెసర్ పద్మజా షా మాట్లాడుతూ.. చరిత్ర మూలాలను విమర్శనాత్మకంగా అంచనా వేయడానికి, విద్యలో పొందుపరిచిన ప్రచారాన్ని నిరోధించడానికి, విద్యార్థులకు బోధించే ప్రాముఖ్యతను చెప్పారు.