ఎంపీటీసీ, సర్పంచ్ అన్ని స్థానాలలో ” సీపీఐ(ఎం)” పోటీ చేసేందుకు సిద్ధం..
ప్రలోభ పెట్టే నాయకులను ఓడించి .. పేద ప్రజల పక్షాన పోరాడే సీపీఐ(ఎం) నాయకులను గెలిపించండి..
సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు బండ శ్రీశైలం..
నవతెలంగాణ – మునుగోడు
పేద ప్రజలకు ఎక్కడ సమస్య వచ్చినా ప్రజల పక్షాన ప్రశ్నించే గొంతుగా ప్రజల పక్షాన పోరాటాలు నిర్వహించేది సీపీఐ(ఎం) అని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు బండ శ్రీశైలం అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని సీపీఐ(ఎం) కార్యాలయంలో ఏర్పాటుచేసిన మండల కమిటీ సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మునుగోడు నియోజకవర్గం లోని ఎంపీటీసీ , సర్పంచ్ అన్ని స్థానాలలో సీపీఐ(ఎం) పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నదని తెలిపారు. సీపీఐ(ఎం) పోటీ చేసే స్థానాలలో గెలిపించేందుకు పేద ప్రజలు సిద్ధంగా ఉన్నారని అభిప్రాయపడ్డారు.
ప్రజలను మోసం చేసేందుకు వచ్చే ప్రజాప్రతినిధులు డబ్బులతో ప్రజల్ని ప్రలోభ పెట్టి ఓట్లు వేయించుకునేందుకు వచ్చిన వారికి ప్రజలు ఓటు వేసేందుకు సిద్ధంగా లేరని అన్నారు. ఎన్నో సమస్యల పరిష్కారం కోసం ఎర్రజెండా నెత్తి పోరాటం చేసిన నాయకులకు ప్రజలలో మంచి ఆదరణ ఉన్నదని అన్నారు. మునుగోడు నియోజకవర్గంలో ఎర్ర జెండా కున్న పోరాట చరిత్ర ప్రజలలో చెదరని ముద్రగ నిలిచి ఉంటుందని అన్నారు. మునుగోడు నియోజకవర్గ ప్రజలు చాలా చైతన్యమైన ప్రజలని అన్నారు. డబ్బు, మద్యంతో ప్రలోభ పెట్టే బరిలో నిలిచే నాయకులను ఓడించి , పేద ప్రజలకు ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ ప్రజల పక్షాన నిలిచి పోరాటం చేసే సీపీఐ(ఎం) నాయకులను గెలిపించాలని కోరారు. నియోజకవర్గంలో నెలకొన్న అనేక సమస్యలను పరిష్కారం చేసుకునేందుకు పోరాటం చేసే ఎర్రజెండాను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల కమిటీ సభ్యులు మిర్యాల భరత్, వరికుప్పల ముత్యాలు,యాస రాణి శ్రీను , వడ్లమూడి హనుమయ్య , కట్ట లింగస్వామి తదితరులున్నారు.