Tuesday, October 7, 2025
E-PAPER
Homeఎడిట్ పేజిరా'బంధు'లతో జాగ్రత్త!

రా’బంధు’లతో జాగ్రత్త!

- Advertisement -

సొంత పెదనాన్న లైంగిక వేధింపులు భరించలేక ఇటీవల ఓ ఇంటర్‌ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్నది. హైదరాబాద్‌లో జరిగిన ఈ ఘటన.. పరిచయస్తులు, దగ్గరి బంధువుల నుంచి కూడా మహిళలకు రక్షణ లేదనే విషయాన్ని మరోసారి రుజువు చేసింది. బయటివారికంటే పరిచయస్తులు, బంధువుల నుంచే బాలికలకు ఎక్కువగా ముప్పు పొంచి ఉన్నట్టు ఈ ఘటన నిరూపిస్తున్నది. పాఠశాలలు, కాలేజీలు, ఆఫీసుల్లోనే కాదు.. సొంత ఇండ్లలో సైతం బాలికలు, మహిళలు లైంగిక వేధింపులకు గురవుతుండడం తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నది. లైంగిక వేధింపులపై నమోదవుతున్న కేసుల్లో.. ఎనభైశాతానికి పైగా కేసులు ఇలాంటివే ఉండటం సమాజంలో పేరుకుపోయిన మానసిక రుగ్మతను తెలియజేస్తున్నది.
నేషనల్‌ క్రైమ్‌ రికార్డ్స్‌ బ్యూరో (ఎన్‌సిఆర్‌బి) నివేదిక ప్రకారం భారతదేశంలో లైంగిక వేధింపుల కేసుల్లో చాలావరకు నిందితులు బాధితులకు తెలిసినవారే అయి ఉంటున్నారు. దేశవ్యాప్తంగా ప్రతి ఏడాది లైంగిక వేధింపులకు సంబంధించి సుమారు ముప్ఫయి వేల కేసులు నమోదవుతుంటే.. ఇందులో ఎనభై శాతానికి పైగా కేసుల్లో పరిచయస్తులు, బంధువులే నిందితులుగా ఉండడం గమనార్హం. బాలికలపై జరిగే లైంగిక వేధింపుల్లోనైతే తొంభై శాతానికి కంటే ఎక్కువ మంది నిందితులు వారికి తెలిసిన, నమ్మకమున్న వ్యక్తులే. అందులోనూ 30-40 శాతం మంది కుటుంబసభ్యులే (తండ్రులు, సోదరులు, మామలు, పెదనాన్నలు, కజిన్స్‌) ఉంటున్నారు. ఈ గణాం కాలు బాలికలకు ఆప్తుల నుంచి పొంచి ఉన్న ప్రమాదతీవ్రతను తెలియజేస్తున్నాయి. లైంగిక వేధింపుల నుంచి పిల్లలను రక్షించడానికి తల్లిదండ్రులు అనేక జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరమున్నది. ముందుగా గుడ్‌ టచ్‌, బ్యాడ్‌ టచ్‌ గురించి వారికి నేర్పించాలి. ఎవరైనా అసభ్యకరంగా ప్రవర్తిస్తే భయం లేకుండా తల్లి దండ్రుల వద్ద చెప్పు కునే స్వేచ్ఛావాతావరణం కల్పించాలి. అపరిచితులతో మాట్లాడ డం, వారి నుంచి బహుమతులు తీసుకునే విషయాలపై వారికి స్పష్టమైన అవగాహన కల్పించాలి. సోషల్‌ మీడియా, ఇంటర్నెట్‌ వినియోగంలో జాగ్రత్తలు, ఆన్‌లైన్‌ వేధింపుల గురించీ తెలియజేయాలి.
లైంగిక వేధింపుల నివారణకు ప్రభుత్వాలు నిర్భయ వంటి అనేక కఠిన చట్టాలు అమలు చేస్తున్నాయి. బాలికలపై లైంగిక వేధింపులు జరగకుండా.. పోక్సో వంటి చట్టాలు ఉన్నాయి. అయితే గత కొన్నేండ్ల డేటా చూస్తే మాత్రం కేసుల నమోదులో ఎలాంటి తగ్గుదల కనిపించడం లేదు. 2020లో 28,046 లైంగిక వేధింపుల కేసులు నమోదైతే, 2021లో ఇది 31,677 కేసులకు పెరిగింది. 2022లో 31,982 కేసులు నమోదయ్యాయి. 2023తో పోల్చుకుంటే 2024లో కేసుల్లో 4.8 శాతం పెరుగుదల కనిపించింది. 2025 జనవరి డేటా ఇంకా విడుదల కాకపోయినా.. ఇప్పటికే 25 వేలకు పైగా కేసులు నమోదైనట్టు ఒక అంచనా. తెలంగాణలోనూ 2023లో 817 లైంగిక వేధిం పుల కేసులు నమోదు కాగా, 2024, 2025ల్లోనూ ఈ కేసుల్లో పెరుగుదల కనిపించింది. మరోవైపు దేశవ్యాప్తంగా ఇదే స్థాయిలో లైంగిక వేధిం పుల ఘటనలు వెలుగుచూడడం లేదనే చర్చ జరుగుతున్నది. వేధింపులకు గురైన బాధితురాలినే తప్పుపట్టే ధోరణిలో సమాజం వ్యవహరి స్తుండడంతో.. పరువు పోతుందనే భయంతో చాలామంది ఫిర్యాదు చేయడానికే వెనుకాడుతున్నారు. ముఖ్యంగా దగ్గరి బంధువులే వేధింపులకు పాల్పడినప్పుడు కుటుంబ పరువు పోతుందని, బంధుత్వాలు చెడిపోతాయనే భయంతో చాలా మంది ఫిర్యాదు చేయకుండా మౌనం వహిస్తున్నారు. కేసుల విచారణలో జాప్యం, నేర నిరూపణ తక్కువ స్థాయిలో ఉండడంతో చట్టాల పట్ల నేరస్తుల్లోనూ భయం కనిపించడం లేదు. 2024లో లైంగిక దాడుల్లో కేసుల్లో కన్విక్షన్‌ రేటు 28 శాతం మాత్రమే. ఎక్కువ కేసులు పెండింగులో ఉన్నాయి. మరోవైపు పోర్న్‌ వీడియోలు ఆన్‌లైన్‌లో విచ్ఛలవిడిగా అందుబాటులో ఉండడం కూడా లైంగిక వేధింపుల ఘటనలు పెరగడానికి పరోక్షంగా దోహదపడుతున్నాయని అనేక అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి.
లైంగిక వేధింపులను కేవలం చట్టపరమైన సమస్యగా మాత్రమే చూడొద్దు. ఇది సమాజంలో పాతుకుపోయిన ఒక మానసిక రుగ్మత. లైంగిక వేధింపుల కేసులను నివారించాలంటే ఒకవైపు కఠిన చట్టాలను అమలుచేస్తూనే.. బాధితులకు సకాలంలో న్యాయం జరిగేలా చూడాలి. అంతేకాకుండా సమాజంలోనూ మార్పు తీసుకురావాల్సిన చర్యలు చేప ట్టాల్సి ఉన్నది. బాధితుల ఆత్మహత్యలు నివారించాలంటే.. మానసిక, న్యాయ సహాయం అందించే వ్యవస్థలను కూడా బలోపేతం చేయాలి.
మహమ్మద్‌ ఆరిఫ్‌
7013147990

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -