Tuesday, October 7, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంవైద్యశాస్త్రంలో ముగ్గురికి నోబెల్‌

వైద్యశాస్త్రంలో ముగ్గురికి నోబెల్‌

- Advertisement -

రోగ నిరోధక వ్యవస్థలో
కొత్త ఆవిష్కరణలకు పురస్కారం
స్టాకహేోం :
రోగ నిరోధక వ్యవస్థకు సంబంధించిన కొత్త ఆవిష్కరణలకు ఈ ఏడాది వైద్య శాస్త్రంలో నోబెల్‌ బహుమతి ముగ్గురిని వరించింది. జపాన్‌కు చెందిన షిమోన్‌ సకాగుచి, అమెరికాకు చెందిన మేరీ ఇ.బ్రుంకొవ్‌, ఫ్రెడ్‌ రామ్స్‌డెల్‌లు ఈ బహుమతిని పంచుకోనున్నారు. రోగ నిరోధక వ్యవస్థలో సెక్యూరిటీ గార్డులుగా పిలిచే రెగ్యులేటరీ టి కణాలను వీరు గుర్తించారు. రోగ నిరోధక కణాలు మన శరీరంపైనే దాడి చేయకుండా ఈ టి కణాలు అడ్డుకుంటాయని వారు గుర్తించారు. రోగ నిరోధక వ్యవస్థ ఎలా పని చేస్తుంది, మనందరిలోనూ తీవ్రమైన ఆటో ఇమ్యూన్‌ వ్యాధులు ఎందుకు వృద్ధి చెందవో అర్ధం చేసుకోవడానికి ఈ ఆవిష్కరణలు బాగా ఉపయోగపడతాయని నోబెల్‌ కమిటీ ఛైర్మన్‌ ఓలె కాంపె వ్యాఖ్యానించారు. ఆటో ఇమ్యూన్‌ వ్యాధులు, క్యాన్సర్లకు కొత్త చికిత్సలను అభివృద్ధిపరచడానికి ఈ ఆవిష్కరణలు ఉపయోగపడతాయని భావిస్తున్నారు. ఆటో ఇమ్యూన్‌ వ్యాధుల నుంచి శరీరాన్ని రక్షించే రోగ నిరోధక కణాలను షిమోన్‌ సకగుచి తొలుత 1995లో కనుగొన్నారు. ఆ తర్వాత 2011లో ఆ కణాలు పనిచేయడానికి కీలకమైన జన్యువును అమెరికన్‌ పరిశోధకులు మేరీ, ఫ్రెడ్‌లు కనుగొన్నారు. రెండేళ్ళ తర్వాత సకగుచి ఈ ఆవిష్కరణలన్నింటినీ అనుసంథానిస్తూ తాను గుర్తించిన ఈ టి కణాల అభివృద్ధికి ఫాక్స్‌ పి3 జన్యువు కారణమవుతోందని రుజువు చేశారు.ముందుగా వైద్య శాస్త్రంలో నోబెల్‌ బహుమతిని ప్రకటించడంతో ఇక వరుసగా ఈ వారమంతా వివిధ విభాగాల్లో నోబెల్‌ బహుమతులు ప్రకటిస్తారు. చివరిగా నోబెల్‌ శాంతి బహుమతి ప్రకటన వెలువడుతుంది. వీరందరికీ డిసెంబరు 10న బహుమతి ప్రదానం వుంటుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -