ఆర్థికశాఖలో ఓ ఐఏఎస్ ఆధిపత్యం
సర్కారుకు చెడ్డపేరు తేవడమే
లక్ష్యంగా వ్యవహారాలు
పెండింగ్ బిల్లులకు టోకెన్లు ఇచ్చి…పైసలు ఇవ్వని వైనం
అదేంటంటే…వెటకార వ్యాఖ్యలు
సెక్రటేరియట్ చుట్టూ చక్కర్లు కొడుతున్న బాధితులు
తోటి ఐఏఎస్‌లపై దురుసు వ్యాఖ్యలు
ఆ అధికారి వైఖరితో తలబాదుకుంటున్న మంత్రులు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
గత ప్రభుత్వ అప్పులు, వడ్డీలతో సతమతమవుతూ.. ‘ఎలాగో’ బండిని లాగించేస్తోన్న రాష్ట్ర ప్రభుత్వానికి ఓ ఉన్నతాధికారి పక్కలో బల్లెంలా మారారు. ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు, వ్యవహారశైలి సర్కారుకు తలనొప్పిగా మారాయి. గత ప్రభుత్వంలోని పెద్దలతో అంటకాగిన సదరు ఐఏఎస్ అధికారి…సాధ్యమైనంత వరకు రేవంత్ సర్కారుకు చెడ్డపేరు తేవడమే లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆయన తీరుతో స్వయానా మంత్రులే నోరెళ్లబెడుతున్నారు. ప్రభుత్వానికి అత్యంత ప్రధానమైన ఆర్థికశాఖలో ‘కీ’లక పోస్టులో ఉన్న ఆ ఉన్నతాధికారి… అటు ముఖ్యమంత్రి కార్యాలయాన్నిగానీ, ఇటు మంత్రుల ఆఫీసుల్ని గానీ లెక్క చేయట్లేదనే ప్రచారం జరుగుతోంది. వివిధ పథకాలు, స్కీములకు సంబంధించి ఆయా ప్రభుత్వ కార్యాలయాల నుంచి వచ్చే సిఫారసులను సైతం ఆయన తొక్కిపెడుతుండటంతో క్షేత్రస్థాయిలో ప్రతికూల పరిస్థితులు ఏర్పడుతున్నాయని వివిధ శాఖలకు చెందిన సహచర ఐఏఎస్ అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్న పలు బకాయిలు సర్కారుకు గుదిబండగా మారాయి. మాజీ సర్పంచుల బిల్లులు, వివిధ విభాగాల్లోని కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు, ఫీల్ట్ అసిస్టెంట్ల వేతనాలు, గ్రామ కార్యదర్శులకు ఇవ్వాల్సిన రూ.104 కోట్లు ఇందులో కీలకంగా ఉన్నాయి. అయితే వీటిని నూటికి నూరు శాతం కాకపోయినా ఎంతోకొంత నిధులు విడుదల చేయాలంటూ ఆయా శాఖల మంత్రులు, ముఖ్య కార్యదర్శులు ఉప ముఖ్యమంత్రి, ఆర్థికశాఖ మంత్రి భట్టి విక్రమార్కకు పలుమార్లు విజ్ఞప్తి చేశారు. ‘పెండింగ్ బిల్లుల గురించి ఆలోచించండి, సాధ్యమైనంత త్వరగా వాటిని క్లియర్ చేయండి…’ అంటూ ఆయన ప్రస్తుతమున్న ‘కీ’లక ఉన్నతాధికారికి కొన్ని నెలల క్రితమే ఆదేశాలిచ్చారు. డిప్యూటీ సీఎం ఆదేశాలతో తమ డిపార్టుమెంట్లకు ఎంతో కొంత నిధులు విడుదలవుతాయని మంత్రులు, ముఖ్య కార్యదర్శులు, కమిషనర్లు, డైరెక్టర్లు ఆశించారు. కానీ వారి ఆశలపై నీళ్లు చల్లుతూ సదరు ఆర్ధికశాఖ ఐఏఎస్ ఉన్నతాధికారి నెలల తరబడి వారందరినీ తమను ఛాంబర్ చుట్టూ తిప్పుకుంటున్నారని వాపోతున్నారు. ఈ ప్రదక్షిణాలు చేయలేక కొంతమంది ఐఏఎస్‌లు…’నిధులు వచ్చినప్పుడే వస్తాయి…ఆర్థికశాఖ చుట్టూ ఎన్నిసార్లు తిరుగుతాం.. అలసిపోయాం…’ అంటూ చేతులె త్తేస్తున్నారు. డబ్బులు విడుదల కాకపోవటంతో కిందిస్థాయి నుంచి వచ్చే ఒత్తిడి తట్టుకోలేని ఓ సీనియర్ మంత్రి…’కార్యదర్శిగారూ.. మీరు ఆర్థికశాఖ వద్దకు వెళ్లి, కాస్త మన శాఖకు చెందిన పెండింగ్ బిల్లులు విడుదలయ్యేలా చూడండి…’ అంటూ ఆదేశించారని సమాచారం. దానికి ఆ కార్యదర్శి…’మినిష్టర్ గారూ.. నాకూ ఆత్మాభిమానం ఉంటుందిగా..ఎన్నిసార్లని ఆర్థికశాఖ గడప తొక్కమంటారు, అక్కడ సాటి ఐఏఎస్ అని కూడా చూడటం లేదు. కనీస మర్యాద కూడా లేకుండా.. చూద్దాంలే, చేద్దాంలే… అని అంటున్నారు, అందుకని నేను అక్కడికి వెళ్లలేను…’ అంటూ తన అశక్తతను వ్యక్తం చేశారని తెలిసింది.
టోకెన్లు టోకెన్లే.. పెండింగ్ పెండింగే
గ్రామ పంచాయతీ సర్పంచులు, కార్యదర్శుల నుంచి చోటా మోటా కాంట్రాక్టర్ల వరకు పెండింగ్ బిల్లుల కోసం సచివాలయం చుట్టూ చెప్పులరిగేలా తిరుగుతున్నారు. ప్రభుత్వ నియమ నిబంధనలకు అనుగుణంగా వారికి ఎప్పటికప్పుడు బిల్లులకు సంబంధించిన టోకెన్లు వస్తున్నాయి. కానీ నెలల తరబడి అవి టోకెన్లుగానే ఉంటున్నాయి తప్ప, నగదుగా మారట్లేదు. దీని గురించి అడిగితే సదరు ఆర్థికశాఖ ‘కీ’లక ఉన్నతాధికారి స్పందించటం లేదని ఓ జిల్లాకు చెందిన పంచాయతీ కార్యదర్శి వాపోయారు. ఇలాంటి చర్యల వల్ల ప్రజల్లో తమ ప్రభుత్వం అప్రతిష్టపాల వుతోందని అధికార పార్టీకి చెందిన నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ‘గతంలో ఆర్థికశాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శిగా ఉన్న రామకృష్ణారావు (ప్రస్తుత సీఎస్) దగ్గర అదే శాఖలో పని చేసిన అనుభవం ఉండటంతో ఆయన్ని అక్కడి నుంచి కదిలించే ధైర్యం చేయట్లేదని అదే శాఖకు చెందిన ఓ సీనియర్ ఆఫీసర్ వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రభుత్వం స్థానిక ఎన్నికలకు సమాయత్తమవుతున్న సమయంలో సదరు ‘కీ’లక ఐఏఎస్ వ్యవహారం సచివాలయంలో హాట్‌టాపిక్‌గా మారింది. ఆయన వ్యవహారాలు పరోక్షంగా ప్రత్యర్థులకు మేలు చేసేలా ఉంటున్నాయనే ప్రచారం జరుగుతోంది. మరి సీఎం, డిప్యూటీ సీఎంలు ఏం నిర్ణయం తీసుకుంటారో వేచిచూడాలి!
డోంట్ కేర్!
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES