విడుదలకాని ప్రత్యేక గ్రాంట్
నవతెలంగాణ – మల్హర్ రావు
స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు నిధుల సమస్య వచ్చి పడింది. మండలంలో ఎన్నికల ఏర్పాట్లు చకాచకా జరుగుతున్నా.. ప్రభు త్వం నుంచి ప్రత్యేక గ్రాంట్ ఇంకా విడుదల కాలేదు. మరో మూడు రోజుల్లోనే ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలు నిర్వహించడం ఎలా అన్న సందిగ్ధం అధికారుల్లో నెలకొంది. ఇప్పటికే ఓటర్ల జాబితాల రూపకల్పన నుంచి పోలింగ్ సామగ్రి,రవాణా ఖర్చులు చాలా అయ్యాయని అధికారులు వాపోతున్నారు. ఈ క్రమంలో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడగా గ్రాంట్ రాకుంటే ఎలా అని తల పట్టు కుంటున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో అప్పు తెచ్చి మరీ ఖర్చు చేయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రూ.3 లక్షల దాకా ఖర్చయ్యే అవకాశం..
మండలంలోని 15 గ్రామపంచాయతీలకు ఎన్నికల సామగ్రిని రాష్ట్ర ఎన్నికల కమిషన్ సమకూర్చినా.. మిగిలిన స్టేషనరీ, ఎన్నికల సామగ్రి రవాణా, సమావేశ బ్యానర్లు, బ్యాలెట్ బాక్సుల మరమ్మతులు, జిరాక్స్ లు, హమాలీ ఖర్చులు, సిబ్బందికి శిక్షణ, స్నాక్స్, భోజనాలు తదితర ఖర్చుల భారమంతా మండల అధికారులపైనే పడుతోంది. ఈ అవసరాల కోసం నిధు లు లేకపోవడంతో స్థానికంగా ఉన్న స్టేషనరీ దుకాణాల్లో అప్పు చేయాల్సిన పరిస్థితి నెలకొంది.ఒక మండలంలో ఎన్నికల ఖర్చు సుమారుగా రూ.3 లక్షల వరకు అవుతోందని తెలుస్తోంది.
ఇప్పటికే తడిసిమోపెడు .. గ్రామ పంచాయతి
గతేడాది ఫిబ్రవరి 2 నుంచి పంచాయతీల్లో ప్రత్యేక పాలన కొనసాగుతోంది. ఇదే తర హాలో గతేడాది ఆగస్టు నుంచి జిల్లా, మండల పరిషతుల్లో స్పెషలాఫీసర్లు పాలన నడుస్తోం ది. అటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి రావాల్సిన ఆర్థిక సంఘం నిధులు సైతం సక్ర మంగా విడుదల కావడం లేదు. దీంతో పం చాయతీలు, మండల పరిషత్ ప్రత్యేక అధికారులకు ఆర్ధిక ఇబ్బందులు తప్పడం లేదు. విధిలేని పరిస్థితుల్లో స్పెషలాఫీసర్లు, కార్యదర్శులు సొంత నిధులతో పల్లెల్లో అభి వృద్ధి పనులు చేపడుతున్నారు. ఈ తరుణం లో స్థానిక సంస్థల ఎన్నికలు రావడంతో ఆ సమస్య మరింత తీవ్రమైంది. ప్రభుత్వం స్పందించి నోటిఫికేషన్ వచ్చే నాటికైనా ప్రత్యేక ఎన్నికల గ్రాంట్ విడుదల చేయాలని అధికారులు కోరుతున్నారు.