– వైర్, న్యూస్‌లాండ్రీల బ్లాక్
– దేశవ్యాప్త నిరసనలతో వెనక్కి తగ్గిన కేంద్రం
న్యూఢిల్లీ: ప్రస్తుతం భారతావని యుద్ధం అనే పొగమంచుతో కప్పి ఉంది. సరిహద్దులో ఏం జరుగుతోందో తెలియని పరిస్థితి. అధికారిక సమాచారం వచ్చే వరకూ ఓపికగా వేచి ఉండడం తప్పనిసరి. కానీ కొన్ని మీడియా సంస్థలు హద్దులు మీరుతున్నాయి. పాకిస్తాన్‌లోని ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకొని భారతదళాలు దాడులు నిర్వహించి నప్పటి నుంచి భారతీయ మీడియా సంస్థలు చాలా వరకూ గీత దాటేశాయి. టీవీ ఛానల్స్ అయితే ఓ అడుగు ముందుకేసి సొంతంగా ‘ఆపరేషన్’ మొదలు పెట్టాయి. పహల్గాంలో ఉగ్రదాడి జరిగిన మరుక్షణం నుంచే టీవీ యాంకర్లు పాక్‌తో యుద్ధం చేయాల్సిందేనంటూ కథనాలు వండి వార్చారు. ఆ యుద్ధాన్ని ఎలా నిర్వహించాలో కూడా నిపుణుల మాదిరిగా చెప్పేస్తున్నారు. భారత్, పాకిస్తాన్ మధ్య అధికారికంగా ఘర్షణలు ప్రారంభం కావడంతో ఇక టీవీ ఛానల్స్ పంట పండింది. రాత్రింబవళ్లూ విసుగూ విరామం లేకుండా యుద్ధ వార్తలు ప్రసారం చేస్తున్నాయి. ఈ పిచ్చి ఇప్పుడు పతాకస్థాయికి చేరింది. తప్పుడు సమాచారం అందిస్తూ, నాటకీయత జోడిస్తూ చెవులు చిల్లులు పడేలా శబ్దాలు వినిపిస్తూ వీక్షకుల సహనాన్ని పరీక్షిస్తున్నాయి. పొరుగుదేశంతో యుద్ధమో లేక ఘర్షణో జరుగుతున్నప్పుడు ప్రభుత్వం అధికారికంగా సమాచారం అందజేసే వరకూ ఆగే ఓపిక కూడా వాటికి ఉండడం లేదు. మిడిమిడి జ్ఞానంతో ప్రజలను భయభ్రాంతులకు గురిచేసేలా కథనాలు అందిస్తున్నాయి. వాటిలో ఎక్కువగా అవాస్తవాలు, అతిశయోక్తులే ఉంటున్నాయి.
ప్రభుత్వం, అధికారులు మీడియా సంస్థలకు అడ్వైజరీలు ఇచ్చి ఊరుకుంటున్నారే తప్ప తప్పుడు వార్తలు ప్రసారం చేస్తున్నందుకు చర్యలు తీసుకుంటున్న దాఖలాలు కన్పించడం లేదు. ఆ సంస్థలపై చర్యలు తీసుకునే అధికారం చట్ట ప్రకారం ప్రభుత్వానికి ఉంది. కానీ సున్నితంగా మందలించడం కూడా జరగడం లేదు. ప్రభుత్వం తన అధికారిక బ్రీఫింగ్‌కు భిన్నంగా వస్తున్న వార్తలపై దృష్టి సారించడం ఎంతో అవసరం. ఆపరేషన్ సిందూర్ తర్వాత అన్ని ప్రధాన వార్తా పత్రికలలో కవరేజీ దాదాపు ఒకేలా ఉంటోంది. నియంత్రణ రేఖకు సమీపంలో నివసిస్తున్న కాశ్మీరీలు పడుతున్న ఇబ్బందులపై ఎవరూ కథనాలు ఇవ్వడం లేదు. ఒక్క ‘ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ మాత్రమే దీనికి మినహాయింపు. సరిహద్దు వెంబడి జరుగుతున్న కాల్పులలో మరణించిన వారి వివరాలను ఆ పత్రిక తన మొదటి పేజీలో అందిస్తోంది. కాశ్మీర్ టైమ్స్ పత్రిక కూడా నియంత్రణ రేఖ వెంబడి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై రోజువారీ కథనాలు ప్రచురిస్తోంది. ది వైర్ పోర్టర్‌ను నిలిపివేయటంపై మద్రాస్ జర్నలిస్టు సంఘాలు ఖండించాయి. వాస్తవాలను వెలుగులోకి తెచ్చే మీడియాపై కేంద్రం ఆంక్షలు విధించటం తగదని, తక్షణమే మోడీ సర్కార్ తీసుకున్న వెనక్కి తీసుకోకపోతే ఆందోళనలు చేస్తామని హెచ్చరించాయి. దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తడంతో..కేంద్రం వెనక్కి తగ్గింది. ది వైర్, న్యూస్ లాండ్రీ పోర్టల్స్‌పై విధించిన బ్యాన్‌ను తొలగించింది.
ఎనిమిది వేల ఖాతాలు బ్లాక్ చేసిన ఎక్స్
దేశంలోని ఎనిమిది వేల ఖాతాలను బ్లాక్ చేయాల్సిందిగా కేంద్ర ప్రభుత్వం నుంచి సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్‌కు ఆదేశాలు అందాయి. వీటిని అనుసరించి ఆ సంస్థ ఆయా ఖాతాలను బ్లాక్ చేసింది. వీటిలో మక్తూర్ మీడియా, బీబీసీ ఉర్దూ, ఫ్రీ ప్రెస్ కాశ్మీర్, ది కాశ్మీరియత్‌తో పాటు పాత్రికేయులు ముజామిల్ జలీల్, అనురాధా బాసిన్ ఖాతాలు ఉన్నాయి. అయితే ఎక్స్‌కు చెందిన గ్లోబల్ గవర్నమెంట్ అఫైర్స్ హ్యాండిల్ ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పు పట్టింది. ఇది భావ ప్రకటనా స్వేచ్ఛకు విఘాతం కలిగిస్తోందని విమర్శించింది. అయితే ఈ హ్యాండిల్‌ను కూడా శనివారం ఉదయం కొద్దిసేపు నిలిపివేశారు. ప్రభుత్వం అందించే సలహాలను పదే పదే ఉల్లంఘిస్తే వినియోగదారులపై చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని, దేశ ప్రయోజనాలు, సార్వభౌమాధికారాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నదని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ అధికారి ఒకరు ఎక్స్‌కు తెలియజేశారు. కాగా రక్షణ మంత్రిత్వ శాఖ కూడా ఓ ట్వీట్ చేసింది. రక్షణ కార్యకలాపాలు, భద్రతా దళాల కదలికలను ప్రత్యక్ష ప్రసారం చేయడం, లేదా నివేదికలు అందించడం వంటి పనులు చేయకూడదని స్పష్టం చేసింది. ‘యుద్ధ పరిస్థితులలో భావ ప్రకటనా స్వేచ్ఛ అనేది పూర్తి స్థాయిలో ఉండదు. పాత్రికేయులు, మీడియా సంస్థలు దేశ ప్రయోజనాలను, ఐక్యతను దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంటుంది. దేశం ఇప్పుడు అసాధారణ పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఇలాంటప్పుడు తక్షణ చర్యలు అవసరం’ అని ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ అధికారి తెలిపారు. ఎక్స్ హ్యాండిల్ పదే పదే ప్రభుత్వ సలహాను ఉల్లంఘిస్తే చర్యలు తప్పనిసరని ఆయన స్పష్టం చేశారు. ఏదైనా వెబ్‌సైట్ ప్రజలను తప్పుదోవ పట్టిస్తే ప్రభుత్వం చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటుందని చెప్పారు. మంత్రిత్వ శాఖకు చెందిన ఉన్నతాధికారులు మీడియా సంస్థలతో మాట్లాడుతున్నారని ఆ అధికారి తెలిపారు. ‘ది హిందూ’ పత్రిక తప్పుడు వార్తను ప్రచురించిందని, ఆ తర్వాత అది దేశానికి హాని కలిగించిందని అంగీకరించిందని చెప్పారు.
యథేచ్ఛగా గోడీ మీడియా
- Advertisement -
- Advertisement -