– ప్రవేశాల టార్గెట్లు..టీచర్లపై యాజమాన్యాల కత్తి
– లక్ష్యాలు విధించి.. వీధుల్లో ప్రచారం
– వేతన చెల్లింపునకు కొలమానం
– పక్షం రోజులుగా ప్రవేశాల వేటలో ప్రయివేటు బడులు, కాలేజీలు
– తీవ్ర మనోవేదనలో ఉపాధ్యాయ, అధ్యాపకులు
– ఇంటింటికీ యాచన చేయడం కష్టంగా ఉందంటూ ఆవేదన
నవతెలంగాణ – కరీంనగర్ ప్రాంతీయ ప్రతినిధి
వచ్చే విద్యా సంవత్సరం కోసం ప్రయివేట్, కార్పొరేట్ విద్యా సంస్థలు అడ్మిషన్ల వేట ప్రారంభించాయి. ప్రయివేటు పాఠశాలలు, కళాశాలల యాజమాన్యాలు ఉపాధ్యాయులు, అధ్యాపకులకు టార్గెట్లు విధించి వీధుల్లో ప్రచారానికి దింపాయి. ఇది ఎన్నికల ప్రచారాన్ని తలపిస్తోంది. ఉపాధ్యాయులను ఇంటింటికీ పంపుతూ తమ పాఠశాలల్లో ఉన్న సౌకర్యాలను వివరిస్తున్నారు. మొదటి తరగతి నుంచే ఇంగ్లీష్ మీడియం, డిజిటల్ క్లాసులు, క్రీడా సౌకర్యాలు ఉన్నాయని ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. గత విద్యా సంవత్సరంలో తమ పాఠశాల విద్యార్థులు సాధించిన మార్కులను చూపిస్తూ, టాపర్లు తమ నుండే ఉన్నారని గొప్పగా చెప్పుకుంటున్నారు. హైదరాబాద్, కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం తదితర పట్టణాల్లో ఎక్కడ చూసినా ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆయా విద్యాసంస్థల తరపున కరపత్రాలు పంచుతూ విద్యార్థుల పేర్లు రాసుకుంటున్నారు.
ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా యాజమాన్యాలు ఉపాధ్యాయులపై తీవ్ర ఒత్తిడి తెస్తున్నాయి. చాలా పాఠశాలల్లో టీచర్లకు అడ్మిషన్ల టార్గెట్లు విధించాయి. ఈ టార్గెట్‌లను పూర్తి చేస్తేనే ఇంక్రిమెంట్లు ఉంటాయని షరతులు విధిస్తున్నాయి. దీంతో తీవ్ర ఎండలోనూ ఉపాధ్యాయులు కాలనీల వెంట తిరుగుతూ విద్యార్థులను చేర్పించాలని వేడుకుంటున్నారు. మరికొన్ని పాఠశాలల్లో అడ్మిషన్లపై కమీషన్ ఇస్తూ ఉపాధ్యాయులను ప్రచారంలోకి దించుతున్నారు. ఈ క్రమంలో పాఠశాలల సిబ్బంది కాలనీల్లో సేకరించిన సమాచారంతో విద్యార్థుల తల్లిదండ్రులకు ఫోన్లు చేసి, అడ్మిషన్ల గురించి ఒత్తిడి చేస్తున్నారు. ఫీజుల విషయంలో మాట్లాడేందుకు ప్రత్యేకంగా పీఆర్‌ఓలను నియమించుకుంటున్నారు. కొత్తగా వివిధ పేర్లతో వస్తున్న విద్యాసంస్థలతో బడ్జెట్ స్కూల్స్ పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. గ్లోబల్ వరల్డ్, ఇంటర్నేషనల్ స్కూల్స్‌తో చిన్న చిన్న స్కూల్స్‌కు ఇబ్బందిగా పరిణమించింది.
ప్రయివేటు కాలేజీల్లోనూ ఇదే పరిస్థితి..
ప్రయివేటు కళాశాలల పరిస్థితి కూడా ఇందుకు భిన్నంగా లేదు. టెన్త్ ఫలితాలు రాకముందు నుంచే ప్రయివేటు స్కూళ్ల వద్ద విద్యార్థుల తల్లిదండ్రుల కాంటాక్ట్ నంబర్లు సేకరించి ఫోన్లు చేస్తున్నారు. తమ కళాశాలలోని సౌకర్యాలు, ర్యాంకుల గురించి బల్క్ మెసేజ్‌లు పంపుతూ విద్యార్థులను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. టెన్త్ ఫలితాలు విడుదలైననాటి నుంచి ప్రచారాన్ని మరింత ముమ్మరం చేశారు. చట్ట ప్రకారం ఇలాంటి ప్రచారాలు చేస్తే చర్యలు తీసుకుంటామని విద్యాశాఖ అధికారులు చెబుతున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో మాత్రం పట్టించుకోవడం లేదు.
టార్గెట్ రీచ్ అయితేనే జీతం పెంపు
కొన్ని కార్పొరేట్ పాఠశాలలు అయితే అడ్మిషన్ల టార్గెట్ పూర్తి చేస్తేనే వేసవి సెలవుల్లో జీతం ఇస్తామని నిబంధనలు పెట్టాయి. ఒక్కో ఉపాధ్యాయుడు కనీసం 10 నుంచి 15 మంది విద్యార్థులను చేర్పించాలని ఆదేశాలు జారీ చేశారు. ఉదయం నుంచి రాత్రి వరకు ప్రచారంలో తిరుగుతున్న ఉపాధ్యాయులు.. అడ్మిషన్లు చేయకపోతే ఉద్యోగం పోతుందనే భయంతో తీవ్ర ఆందోళన చెందుతున్నారు. చాలీచాలని జీతాలతో, పని ఒత్తిడితో ప్రయివేట్ ఉపాధ్యాయుల జీవితాలు దుర్భరంగా మారుతున్నాయి.
పలువురు ఉపాధ్యాయుల ఆవేదన ఇదీ..
‘సార్ నమస్తే అంటూ ప్రతి ఇంటి తలుపు తట్టాలంటే చాలా ఇబ్బందిగా ఉంది. మేం టీచర్లం కదా.. ఇలా యాచన చేసేలా తిరగడం ఎంత బాధాకరమో చెప్పలేను. మా కష్టాలు ఎవరికీ అర్థం కావు. టార్గెట్ పూర్తి చేయకపోతే జీతం కట్ చేస్తామంటున్నారు. పిల్లల్ని ఎలా చేర్పించాలో అర్థం కావడం లేదు.’
– రాధిక, ప్రయివేటు పాఠశాల ఉపాధ్యాయురాలు
‘మాకు బోధనే ప్రధానం. కానీ ఇప్పుడు అడ్మిషన్లు తేవడమే ముఖ్యమైన పనిగా మారింది. టెన్త్ రిజల్ట్స్ రాక ముందు నుంచే విద్యార్థుల తల్లిదండ్రులకు ఫోన్లు చేసి మాట్లాడుతున్నాం. మా కాలేజీలో చేరితే మంచి భవిష్యత్ ఉంటుందని చెప్పాల్సి వస్తోంది. ఇది మాకు అసౌకర్యంగా ఉంది కానీ తప్పదు.’
– సురేష్, ప్రయివేటు కళాశాల అధ్యాపకులు
‘ఇక్కడ టార్గెట్ చాలా ఎక్కువగా పెట్టారు. కనీసం పది మంది పిల్లలనైనా చేర్పించాలంటున్నారు. వేసవి సెలవుల్లో కూడా మాకు విశ్రాంతి లేదు. రోజంతా తిరిగినా ఒక్క అడ్మిషన్ కూడా రావడం లేదు. ఉద్యోగం ఉంటుందో పోతుందో తెలియక భయంగా ఉంది. కుటుంబం ఎలా గడుస్తుందో అని దిగులుగా ఉంది.’
– లక్ష్మి, కార్పొరేట్ పాఠశాల ఉపాధ్యాయురాలు
అడ్మిషన్ల వేట
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES