కల్లల్లోనే తడిసిన సోయ దిగుబడులు ..
ఆందోళన రైతులు ..
ముధోల్ లో రాళ్లచెరువు గండి..
నవతెలంగాణ -ముధోల్
ముధోల్ మండలంలో సోమ వారం భారీ వర్షం కురిసింది. దీనితో రైతులు కల్లల్లో ఆర బెట్టిన సోయా దిగుబడులు వానకు తడిసిపోయి మొలకలు వచ్చాయి. దీంతో రైతన్నలు కలవర పడుతున్నారు చేతికొచ్చిన సోయపంట కళ్ళముందే నష్టపోతే అప్పులు తీర్చేది ఎలా అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సోమవారం రాత్రి కురిసిన భారీ వర్షం రైతులను తీవ్రంగా ఇబ్బందులకు గురి చేసింది. ఇటీవలే సోయా పంటలను కోసి కళ్ళల్లో ఆరబెట్టిన రైతులు, వాన కారణంగా ఆ దిగుబడులు పూర్తిగా తడిసి పోవడంతో తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వర్షం తుఫాను మాదిరిగా కురవడంతో పలు గ్రామాల్లో కల్లల్లో నీరు చేరి సోయా గింజలు తడిసి కుళ్లిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నష్టంతో పంటను తిరిగి ఎండబెట్టడం కూడా కష్టంగా మారింది.రైతులు ఆర్థికంగా నష్టపోనున్నారు.సోయా ధరలు ఇప్పటికే తక్కువగా ఉండగా, ఇప్పుడు వర్షంతో దిగుబడులు కూడా నష్టపోవడంతో రైతుల పరిస్థితి ముందు నెయ్యి వెనుక గొయ్యి గా మారింది . ప్రతి ఎకరాకు సుమారు రూ.10–15 వేల వరకు నష్టం వాటిల్లిందని రైతులు చెబుతున్నారు.
ఈ పరిస్థితిని గమనించి ప్రభుత్వం తక్షణమే వ్యవసాయ శాఖ అధికారులు, రెవెన్యూ సిబ్బందిని గ్రామాల వారీగా పంట నష్టాన్ని అంచనా వేసి తగిన పరిహారం అందించాలంటూ రైతులు డిమాండ్ చేస్తున్నారు. మండల కేంద్రం తోపాటు మండలంలోని వెంకటాపూర్, చించాల ,తరోడా, ఆష్ట ,రాం టెక్, ముద్గల్ ,విట్టోలి ,బోరిగం, కారేగాం, ఎడ్ బిడ్ ,చింతకుంట తదితర గ్రామాలలో సోమవారం భారీ వర్షం కురిసింది . అయితే ముదోల్ ల్లోని రాళ్లచెరువుకు పెద్ద గండి పడింది. ఈ చెరువును మంగళవారం రెవెన్యూ శాఖ అధికారులు పరిశీలించి సంబంధిత విషయాన్ని ఇరిగేషన్ అధికారులకు తెలియజేసినట్లు తెలిపారు అంతేకాకుండా మండలంలోని ఆయగ్రామలలో రైతులు కేవలం 30 శాతం మాత్రమే సోయపంటను కోశారు. మిగతా 70% సోయపంట కోతకు సిద్ధంగా ఉన్నప్పటికీ వర్షం కారణంగా కోయలేకపోతున్నామని రైతులు పేర్కొంటున్నారు. ఈ వర్షాల కారణంగా చేను లోనే సోయపంట మొలకలు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ రైతులు ఆదుకోవాలని కోరుతున్నారు.