Wednesday, October 8, 2025
E-PAPER
Homeఎడిట్ పేజిఓవైపు కార్మికవర్గంపై దాడి, మరోవైపు రష్యాతో లడాయి!

ఓవైపు కార్మికవర్గంపై దాడి, మరోవైపు రష్యాతో లడాయి!

- Advertisement -

నాటో కూటమితో చేతులు కలిపి తమ మీద చేస్తున్న కుట్రకు ప్రతిక్రియగా ఉక్రెయిన్‌ మీద రష్యా ప్రారంభించిన సైనికచర్య బుధవారం నాడు 1,322వ రోజులో ప్రవేశించింది. పరస్పర దాడులు కొనసాగుతున్నాయి. ఐరోపా అంతటా దోపిడీకి గురౌతున్న కార్మికుల సమ్మెలు ఒకవైపు, మరోవైపు రష్యాను దెబ్బతీసేందుకు అమెరికాతో కలసి పాలకవర్గాల కుట్రలు కనిపిస్తున్నాయి. తమ మీద దాడులు చేసేందుకు అమెరికా గనుక తోమహాక్‌ క్షిపణులను ఉక్రెయిన్‌కు ఇస్తే సంబంధాలు నాశనమవుతాయని రష్యన్‌ అధినేత వ్లదిమిర్‌ పుతిన్‌ అమెరికానుద్దేశించి చెప్పాడు. నిజానికి ఇది ట్రంప్‌కే కాదు, కయ్యానికి ఎగదోస్తున్న యావత్‌ ఐరోపా ధనిక దేశాలకు చేసిన హెచ్చరిక. ఆ ప్రకటన మరుసటి రోజు డోనాల్డ్‌ ట్రంప్‌ విలేకర్లు అడిగిన ప్రశ్నలపై స్పందించాడు.

” నేనూ కొన్ని ప్రశ్నలు అడగదలచుకున్నాను, ఆ పోరు మరింతగా పెరగాలని కోరుకోవటం లేదు” అన్నాడు. పశ్చిమదేశాలతో మరో ప్రచ్చన్న యుద్ధం చేస్తున్నట్లు తమమీద చేస్తున్న ఆరోపణను రష్యా తోసిపుచ్చింది. తమ మీద దాడులు చేసేందుకు, మిలటరీ ఖర్చు పెంచేందుకు నెపాన్ని తమ మీద నెట్టాలని ఐరోపా యూనియన్‌, నాటో కూటమి దేశాలు లేనిపోని కథలను వ్యాపింప చేస్తున్నాయని గత ప్రచ్చన్న యుద్ధంతో పోల్చటాన్ని అంగీకరించటం లేదని రష్యా విదేశాంగ ప్రతినిధి మరియా ఝకరోవా గతవారంలో స్పష్టం చేశారు. క్రెమ్లిన్‌ ప్రతినిధి దిమిత్రి పెష్కోవ్‌ మాట్లాడుతూ ఐరోపా అంతటా ఇటీవల కనిపించిన డ్రోన్లకు రష్యా కారణమని నిందించటానికి ఎలాంటి హేతుబద్దత లేదన్నాడు. డ్రోన్ల వెనుక రష్యా ఉందని భావిస్తున్నట్లు జర్మన్‌ ఛాన్సలర్‌ ఫ్రెడరిక్‌ మెర్జ్‌ ఇటీవల చేసిన వ్యాఖ్య తర్వాత ఐరోపాలోని అనేక మంది రాజకీయవేత్తలు అన్నింటికీ రష్యా కారణమని నిందిస్తున్నారన్నాడు.

క్యూబన్‌ క్షిపణుల సంక్షోభం 1962 తరువాత రష్యా, పశ్చిమ దేశాల మధ్య ఉక్రెయిన్‌ సంక్షోభ రూపంలో తలెత్తిన ఘర్షణ రెండవ ప్రపంచ యుద్ధం తరువాత ఐరోపాలో తీవ్రమైనది,అతి పెద్దది. తాము ఇప్పటికే మరో రూపంలో ఉన్న ఘర్షణలో ఉన్నామని, అదేమాత్రం ప్రచ్చన్న యుద్ధం కాదు ఇప్పటికే ఇక్కడ మంటలు ఉన్నాయని మరియ ఝకరోవా చెప్పారు. అలాస్కా భేటీ తరువాత శాంతి అవకాశాలు ఆవిరవుతున్నట్లు జరిగే పరిణామాలు వెల్లడిస్తున్నాయి. తమ అజెండాను అమలు జరిపేందుకు పశ్చిమ దేశాలు సరికొత్త ప్రచారదాడిని మొదలు పెట్టాయి. తమ గగనతలాన్ని అతిక్రమిస్తున్నందంటూ వివిధ దేశాలు ఒక పథకం చేస్తున్న ప్రచారాన్ని రష్యా తిరస్కరించి నప్పటికీ గోబెల్స్‌ ప్రచారం సాగుతున్నది. ఉక్రెయిన్‌పై దాడుల తీవ్రతను పెంచిన రష్యా మెల్లమెల్లగా కొత్త ప్రాంతాలను తన ఆధీనంలోకి తెచ్చు కుంటున్నది.దానికి పోటీగా పశ్చిమ దేశాల గగనతల అతిక్రమణ కతలను ముందుకు తెచ్చాయి. ఆ పేరుతో మిలిటరీ బడ్జెట్‌లను పెంచేందుకు, సంక్షేమ పథకాలకు కోత విధించేందుకు పూనుకున్నారు.

తమకు వ్యతిరేకంగా నాటో కూటమి కుట్రపన్నిందని పుతిన్‌ ఉక్రెయిన్‌ సంక్షోభ ప్రారంభానికి ముందు నుంచీ చెబుతున్నాడు.సోవియట్‌ పతనమైన 1991లో నాటో కూటమిని తూర్పు వైపు విస్తరించబోమని చెప్పి దాన్ని పశ్చిమ దేశాలు ఉల్లంఘించాయి. రష్యా సరిహద్దుల్లో ఉన్న ఉక్రెయిన్‌, జార్జియా వ్యవహారాల్లో జోక్యం చేసుకొని మాస్కో వ్యవహారాలను నియంత్రించేందుకు చూశాయని అదే తమ మిలిటరీ చర్యకు కారణమని, అలాంటి కుట్రకు స్వస్తి పలికితే వెంటనే దాడులను నిలిపివేస్తామని పదే పదే చెబుతున్నాడు. రష్యా చెబుతున్న అంశాలను విననట్లు నటిస్తున్న పశ్చిమ దేశాలు తీవ్రమైన ఆంక్షలను ప్రకటించి దిగ్బంధనం కావించేందుకు చూసినప్పటికీ వాటన్నింటిని మాస్కో ఇప్పటివరకు అధిగమించింది. మూడు వందల కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను దెబ్బతీసే క్షిపణులను నాటో కూటమి దేశాలు ఉక్రెయిన్‌కు అందించి దాడులు చేయించాయి. ఫలితం లేకపోవటంతో ఇప్పుడు మాస్కోతో సహా రష్యాలోని ఐరోపా ప్రాంతాలన్నింటిపైనా దాడులు చేయగల రెండున్నరవేల కిలోమీటర్ల దూరం ప్రయాణించే తమ తోమహాక్‌ క్షిపణులను అందచేయాలని అమెరికా చూస్తున్నది. అనేక ఐరోపా దేశాలు వాటిని అడుగుతున్నాయని అమెరికా ఉపాధ్యక్షుడు జెడి వాన్స్‌ వారం రోజుల క్రితం ప్రకటించాడు.

నేరుగా ఉక్రెయిన్‌కు అందిస్తే విమర్శలపాలు కావాల్సి వస్తుందనే భయంతో ఇతర దేశాలకు విక్రయించి అక్కడి నుంచి మళ్లించాలన్నది ఎత్తుగడ. అయితే జెలెన్‌స్కీ సేనలకు వాటిని అందచేసినప్పటికీ ఉపయోగించే సామర్ధ్యం లేదు. ఆ విషయాన్ని అతడే స్వయంగా చెప్పాడు. ఆ క్షిపణులు తమ దగ్గర ఉంటే పుతిన్‌పై ఒత్తిడి పెంచటానికి తోడ్పడతాయన్నాడు. అందుకే అదే జరిగితే పశ్చిమ దేశాలతో సంబంధాల విచ్చిన్నానికి దారితీస్తుందని పుతిన్‌ హెచ్చరించాడు. ఇవ్వాలా లేదా అన్నది అమె రికా తేల్చుకోవాల్సి ఉంది. ఇస్తామంటే ఎలాంటి స్పందనలు వస్తాయో తెలుసుకొనేందుకు వాన్స్‌ ద్వారా ట్రంప్‌ మాట్లాడించాడు. రష్యా ఇంథన మౌలిక సదుపాయాలకు సంబంధించిన సమాచారాన్ని ఉక్రెయిన్‌కు అందచేసేందుకు వాషింగ్టన్‌ నిర్ణయించిందని, వాటిని ధ్వంసం చేయాలంటే దీర్ఘశ్రేణి క్షిపణులు అవసరమౌతాయని వాటిని ఇవ్వటమా లేదా అన్న గుంజాటనలో ఉన్నట్లు వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ పత్రిక రాసింది.

అమెరికన్లు ప్రత్యక్షంగా పాల్గ్గొంటే తప్ప తోమహాక్‌ క్షిపణులను ప్రయోగించటం అసాధ్యమని, అదే జరిగితే ఉద్రిక్తలు నూతన దశకు చేరతాయని పుతిన్‌ గతవారంలో హెచ్చరించాడు. అలాంటి క్షిపణులను ఇచ్చేది లేదని గతంలో ట్రంప్‌ ప్రకటించాడు. అయితే ఉక్రెయిన్‌లో అమెరికా ప్రత్యేక రాయబారి కెయిత్‌ కెల్లాగ్‌ మాట్లాడుతూ ప్రస్తుతం రష్యా మీద దీర్ఘశ్రేణి లక్ష్యాలపై దాడులను చేసే స్థితిలో ఉక్రెయిన్‌ ఉందని ట్రంప్‌ సూచన ప్రాయంగా చెప్పినట్లు తెలిపాడు.తన పాటలకు అనుగుణ్యంగా పుతిన్‌ నృత్యం చేయటం లేదనే ఉక్రోషంతో ఈ విపరీత చర్య గురించి ఆలోచిస్తున్నట్లు చెప్పవచ్చు. పిచ్చివాడి చేతిలో రాయి మాదిరి ఎప్పుడు ఎలాంటి నిర్ణయమైనా తీసుకోవచ్చు. అమెరికా మీడియా క్సియోస్‌తో మాట్లాడిన జెలెన్‌స్కీ తాము కూడా రష్యా ఏది చేస్తే ప్రతిక్రియగా అదే చేస్తామన్నాడు.తమ ఇంథన వనరులపై పుతిన్‌ సేనలు దాడి చేస్తే తాము కూడా అదే చేస్తామన్నాడు.కెయిత్‌ కెలోగ్‌ ఒక మీడియాతో మాట్లాడుతూ ట్రంప్‌ ఇప్పటికే రష్యాలో ఉన్న కొన్ని ప్రత్యేక లక్ష్యాలపై దాడులకు కీవ్‌ను అనుమతిస్తున్నట్లు చెప్పాడని తెలిపాడు.

సురక్షిత ప్రాంతాలనేవి లేవని అన్నాడు. ఉక్రెయిన్‌కు ఆయుధాలు నిలిపివేయాలని కోరుతున్న శక్తులపై ఇటీవల గెలిచిన చెక్‌ అధ్యక్షుడు పీటర్‌ పావెల్‌ మాట్లాడుతూ సరఫరా కొనసాగించా ల్సిందే అన్నాడు. తగ్గించినా, నిలిపివేసినా మనకు మనమే హాని చేసుకున్నట్లని వ్యాఖ్యానించాడు. 650 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాల మీద దాడులు చేయగల డ్రోన్‌ క్షిపణి వ్యవస్థలను తాము స్వంతంగా తయారు చేసుకున్నట్లు ఉక్రెయిన్‌ చెప్పింది, అది నిజమో కాదో తెలియదు గానీ నిజ మైతే దాని వెనుక నాటో దేశాల హస్తం ఉంటుందని వేరే చెప్పనవసరంలేదు. అంతే ఫ్లెమింగో పేరుతో తాము మూడువేల కిలోమీటర్ల దూరం ప్రయణించే క్షిపణిని తయారు చేసినట్లు కూడా కీవ్‌ చెప్పుకుంది. అంటే పశ్చిమదేశాల ఆయుధాలకు ఉక్రెయిన్‌ ముద్రవేసి రష్యా మీద దాడులకు సన్నా హాలు చేస్తున్నట్లు చెప్పవచ్చు.బహుశా వీటిని గమనించే పుతిన్‌ చేసిన తాజా హెచ్చరిక పరమార్ధం.

మరోవైపున ఐరోపా అంతటా ఇటీవల జరుగుతున్న వివిధ రంగాల సమ్మెలను గమనలోకి తీసుకోవాల్సి ఉంది. ఈ నెలలో అనేక దేశాల్లో విమానాశ్రయాల సిబ్బంది సమ్మెకు పిలుపులు ఇచ్చారు. అందువలన ప్రయాణికులు ఒకటికి రెండుసార్లు తమ విమానాలు నడిచేదీ లేనిదీ తనిఖీ చేసుకోవాలని ఆ రంగానికి చెందిన సంస్థలు హెచ్చరిస్తున్నాయి. పని పరిస్థితులు, వేతన పెంపుదల వంటి అంశాలు ప్రధానంగా సమ్మెలకు పురికొల్పుతున్నాయి. ఇప్పటికే కొన్ని చోట్ల సమ్మెలు, ఇతర రూపాల్లో ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఆగస్టు 15 నుంచి స్పెయిన్‌లోని అనేక విమానాశ్రయాల్లో సిబ్బంది ఆందోళన కారణంగా అనేక విమానాలు నిలిచిపోయాయి. ప్రతి బుధ,శుక్ర, శనివారాల్లో విమానాలు దిగేందుకు పనిచేసే సిబ్బంది ఉదయం ఐదు నుంచి తొమ్మిది గంటల వరకు సమ్మెలు చేస్తున్నారు, ఈ ఆందోళన డిసెంబరు 31వరకు కొనసాగుతుందని ప్రకటించారు.

ఫ్రాన్సులో తలెత్తిన రాజకీయ సంక్షోభంతో అధ్యక్షుడు ఎమ్మాన్యుయెల్‌ మక్రాన్‌ నియమించిన ఏడవ ప్రధాని లికోర్ను రాజీనామా చేశాడు. సెప్టెంబరు 9న పదవీ బాధ్యతలు స్వీకరించి కేవలం 26 రోజులు మాత్రమే పదవిలో ఉండి అతి తక్కువ కాలం ఏలుబడిలో ఉన్న వ్యక్తిగా చరిత్రకెక్కాడు. అంతకు ముందు బడ్జెట్లో కోతలను ప్రతిపాదించిన ఫ్రాంకోయిస్‌ బేయరు నాటకీయంగా గద్దె దిగాల్సి వచ్చింది.కేవలం రెండేండ్లలోనే ఐదుగురు ప్రధానులను నియమించారు. పోర్చుగల్‌లో వచ్చే జనవరి వరకు ప్రకటించిన 71రోజుల ఆందోళన పిలుపును కోర్టు ఆదేశాల కారణంగా వెనక్కు తీసుకున్నారు. కనీస సిబ్బంది విధుల్లో ఉండాల్సిందే అని కోర్టు ఆదేశించింది. ఇది సమ్మెహక్కుపై నిజమైన దాడి అని కార్మిక సంఘం విమర్శించింది. ఇటలీ రవాణా రంగంలో అనేక అంశాలపై ఒప్పం దాలకు రావటంలో విఫలం కావటంతో కార్మికులు ఆందోళన బాట పట్టారు. దీనికి తోడు గాజాలో ఇజ్రాయిల్‌ జరుపు తున్న మారణకాండను నిరసిస్తూ జరిగిన సాధారణ సమ్మెకు కార్మికులు మద్దతు ప్రకటించి లక్షలాది మంది ప్రదర్శనల్లో పాల్గొన్నారు.

చాలీచాలని వేతనాలతో బతుకులీడుస్తున్నామని స్వంత ఇల్లు కొనుగోలు చేసేందుకు అవసరమైన రీతిలో తమవేతనాలను పెంచాలని బ్రిటన్‌లో రైల్‌,మారిటైమ్‌ మరియు ట్రాన్ప్‌పోర్ట్‌ (ఆర్‌ఎంటి) యూనియన్‌ ప్రచార ఆందోళన నిర్వహిస్తున్నది.వేతన పెంపుదలను కోరుతూ రెండు రోజుల పాటు సమ్మె జరపాలని ట్రాన్స్‌పోర్ట్‌ ఫర్‌ లండన్‌ (టిఎఫ్‌ఎల్‌) పిలుపు ఇవ్వగా 4.5శాతం పెంపుదలకు అంగీకరించటంతో ఆందోళన విరమించారు. కార్మికవర్గం జరుపుతున్న సమ్మెలకు వ్యతిరేకంగా మీడియాలో ఉన్న యాజమాన్య అనుకూల వ్యాఖ్యాతలు వక్రీకరణలతో విశ్లేషణలు రాస్తున్నారు. స్వంత ఇల్లు కొనుగోలు బ్రిటన్‌లో ఒక హక్కుగా లేదన్నది వాటిలో ఒకటి. బ్రిటన్‌లో 1947 నుంచి ప్రతియేటా రైల్వే కార్మికులు సమ్మెలు చేస్తున్నారంటూ ఒక వ్యాఖ్యాత ఉక్రోషం వెలిబుచ్చాడు.

బడ్జెట్‌లోటు ఏర్పడినపుడల్లా ఫ్రాన్సులో ఆ భారాన్ని కార్మికవర్గం మీద నెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. గతంలో జీడీపీలో ఐదుశాతం ఉన్నపుడు 1995లో జరిగిన ఆందోళనల్లో ఇరవై లక్షల మంది రోడ్ల మీదకు వచ్చారు. నాటి ప్రధాని అలైన్‌ జుపే అంతకు ముందు ప్రతిపాదించిన అనేక పొదుపు చర్యలకు స్వస్తి పలకాల్సి వచ్చింది. ఇప్పుడు కూడా అదే జరుగుతోంది. అధ్యక్షుడు మక్రాన్‌ 2023లో ఉద్యోగ విరమణ వయస్సును 62 నుంచి 64 ఏండ్లకు పెంచి పెన్షన్‌ బిల్లును తగ్గించేందుకు చూశాడు.ఇప్పుడు మరో మితవాద ప్రధాని లీకొర్ను అదే విధానాలతో ఇంటిదారి పట్టాడు.ఐరోపా పాలకవర్గ సంక్షోభం, దానికి కార్మికవర్గం నుంచి ఎదురవుతున్న ప్రతిఘటనకు ఇదో సాక్ష్యం.

ఎం కోటేశ్వరరావు
8331013288

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -