Wednesday, October 8, 2025
E-PAPER
Homeరాష్ట్రీయం86 లక్షల వాహనాలతో రాని కాలుష్యం 2,900 ఆర్టీసీ బస్సులతో వస్తుందా?

86 లక్షల వాహనాలతో రాని కాలుష్యం 2,900 ఆర్టీసీ బస్సులతో వస్తుందా?

- Advertisement -

సర్కారు వాదన సరికాదు
వ్యక్తిగత వాహనాలు తగ్గించరు… ప్రజారవాణాను పెంచరు
కాలుష్యం అంటూ కారణాలు చెప్పడం హాస్యాస్పదం : టీజీఎస్‌ఆర్టీసీ ఎస్‌డబ్ల్యూఎఫ్‌ రాష్ట్ర కమిటీ


నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
‘రాష్ట్రంలో కోటి 70 లక్షల వాహనాలు ఉన్నాయి. రాజధాని హైదరాబాద్‌లో 86 లక్షల వాహనాలు తిరుగుతున్నాయి. వాటిలో ఆర్టీసీ బస్సులు కేవలం 2,900. అన్ని లక్షల వాహనాల ద్వారా తలెత్తని కాలుష్యం, కేవలం ఆర్టీసీ బస్సుల వల్లే వస్తుందా? వ్యక్తిగత వాహనాల సంఖ్య తగ్గించి, ఆర్టీసీ వంటి ప్రజారవాణాను ప్రోత్సహిస్తేనే కదా పర్యావరణం పరిరక్షింపబడేది. ఇంత చిన్న లాజిక్‌ను రాష్ట్ర ప్రభుత్వం ఎలా మిస్‌ అయ్యింది’ అని టీజీఎస్‌ఆర్టీసీ స్టాఫ్‌ అండ్‌ వర్కర్స్‌ ఫెడరేషన్‌ (ఎస్‌డబ్ల్యూఎఫ్‌) రాష్ట్ర కమిటీ అభిప్రాయపడింది. ఇతర వాహనాలతో పోల్చిచూస్తే, ఆర్టీసీ బస్సుల వల్ల వెలువడే కర్బన ఉద్గారాలు చాలా తక్కువనీ, దీనికి భిన్నంగా ఆర్టీసీ వల్లే పర్యావరణం పాడవుతోందని ప్రచారం చేయడం సరికాదని సర్కారుకు సూచించింది. ఎస్‌డబ్ల్యూఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షులు వీరాంజనేయులు అధ్యక్షతన ఆఫీస్‌ బేరర్ల సమావేశం మంగళవారంనాడిక్కడి సీఐటీయూ రాష్ట్ర కార్యాలయంలో జరిగింది.

ఆర్టీసీలోకి అద్దె ప్రాతిపదికన తెస్తున్న ప్రయివేటు ఎలక్ట్రిక్‌ బస్సుల్ని సమర్థించు కోవడం కోసమే రాష్ట్ర ప్రభుత్వం ఈ తరహా ప్రచారం చేస్తున్నదని ఆ సమావేశం అభిప్రాయపడిందని ఫెడరేషన్‌ ప్రధాన కార్యదర్శి వీఎస్‌ రావు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం విద్యుత్‌ బస్సుల విధానంలో మార్పులు చేసి, వాటిని సమకూర్చుకొనే అవకాశం ఆర్టీసీలకు కల్పించాలని డిమాండ్‌ చేశారు. కేంద్రం ప్రతిపాదిస్తున్న అన్ని విద్యుత్‌ బస్సుల పథకాలు గ్రాస్‌ కాస్ట్‌ కాంట్రాక్ట్‌ (జిసిసి) పద్ధతిలో ప్రయివేటు సంస్థలకు సబ్సిడీలు ఇచ్చి, ఆర్టీసీలు నేరుగా వాటిని పొందేందుకు అనుమతించట్లేదనే విషయాన్ని ఆఫీస్‌ బేరర్ల సమావేశం ప్రస్తావించింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్రం విధానాలనే అమల్లోకి తేవడం సరికాదని అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆర్టీసీలే విద్యుత్‌ బస్సుల కొనుగోలు, మెయింటెనెన్స్‌, ఆపరేషన్‌ చేసేలా విధానాల్లో మార్పులు చేయాలని, ఆదాయానికి, ఖర్చుకు మధ్య వస్తున్న వ్యత్యాసాన్ని రాష్ట్ర ప్రభుత్వం ‘వయబిలిటీ గ్యాప్‌ ఫండ్‌’గా ఆర్టీసీకి చెల్లించాలని డిమాండ్‌ చేశారు. పర్యావరణ పరిరక్షణకు అందరూ పాటుపడాల్సినదేనని స్పష్టంచేశారు.

పర్యావరణ పరిరక్షణ వ్యక్తిగత వాహనాలను తగ్గించి, ప్రజా రవాణా బస్సుల్ని విస్తరించడం వల్లే సాధ్యమవుతుందనీ, ట్రాఫిక్‌ రద్దీకూడా నియంత్రణలోకి వస్తుందని సూచించారు. కానీ పాలకులు దీనికి పూర్తి భిన్నంగా వ్యవహరిస్తున్నారని ఆక్షేపించారు. దాదాపు హైదరాబాద్‌లో ఉన్న జనాభా, విస్తీర్ణంలోనే బెంగుళూరు సిటీ కూడా ఉందనీ, అక్కడ 6,500 బస్సులు తిరుగుతుంటే, హైదరాబాద్‌లో కేవలం 2,900 మాత్రమే ఉన్నాయని విశ్లేషించారు. దీనివల్లే సిటీలో ప్రజలు వ్యక్తిగత వాహనాలు, ప్రయివేటు రవాణాలోకి బలవంతంగా నెట్టివేయబడుతున్నారనే విషయాన్ని గమనించాలని పేర్కొన్నారు. విద్యుత్‌ బస్సుల నిర్వహణకు అవసరమైన మౌలిక వనరులన్నీ ఆర్టీసీ సమకూరిస్తే, వాటిని వినియోగించుకొని ప్రయివేటు సంస్థలు లాభాలు సంపాదిస్తాయని తెలిపారు. మౌలిక వనరుల కల్పన కోసం నిధులు సమీకరణ పేరుతో టిక్కెట్‌ చార్జీలు పెంచి ప్రజలపై ఆర్థిక భారాలు మోపడం సరికాదని ఎస్‌డబ్ల్యూఎఫ్‌ రాష్ట్ర కమిటీ అభిప్రాయపడింది.

హైదరాబాద్‌ నగరంలోకి మూడేండ్లలో వచ్చే 2,800 ప్రయివేటు విద్యుత్‌ బస్సులన్నీ ‘గ్రాస్‌ కాస్ట్‌ కాంట్రాక్ట్‌’ పద్ధతిలో ఆర్టీసీలోకి వచ్చేవేననీ, దీనివల్ల ఇప్పుడు సంస్థలో పనిచేస్తున్న వేలాదిమంది కార్మికులు ‘మిగులు’గా తేల్తారని ఆందోళన వ్యక్తం చేశారు. కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పిస్తూ, పైన సూచించినట్టు విధాన నిర్ణయాల్లో మార్పులు చేయాలని కోరారు. విద్యుత్‌ బస్సుల విధానంలో మార్పుల కోసం ఆలిండియా రోడ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ వర్కర్స్‌ ఫెడరేషన్‌ (ఏఐఆర్‌టీడబ్ల్యూఎఫ్‌) నాయకత్వంలో దేశవ్యాపితంగా ఆందోళనలు జరుగుతున్నాయనీ, దానిలో భాగంగానే నవంబర్‌ 23న చెన్నైలో దేశవ్యాప్త సదస్సుని నిర్వహిస్తున్నారని తెలిపారు. దీనిలో భవిష్యత్‌ ఉద్యమ కార్యాచరణకు రూపకల్పన జరుగుతుందని వివరించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -