Friday, May 16, 2025
Homeక్రైమ్గురునానక్‌ కాలేజీలో విద్యార్థిని ఆత్మహత్య

గురునానక్‌ కాలేజీలో విద్యార్థిని ఆత్మహత్య

- Advertisement -

– కుటుంబీకులు రాకముందే ఆస్పత్రికి మృతదేహం తరలింపు
– ఆందోళనకు దిగిన కుటుంబ సభ్యులు, ఎస్‌ఎఫ్‌ఐ
– ఇబ్రహీంపట్నంలో ఘటన
నవతెలంగాణ-ఇబ్రహీంపట్నం

గురునానక్‌ ఇంజినీరింగ్‌ కళాశాల విద్యార్థిని హాస్టల్‌లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. అయితే, కుటుంబీకులు రాకముందే మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించడంతో ఆందోళనకు దిగారు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో శనివారం జరిగింది. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం జిల్లా తల్లాడ మండలం కురనవెళ్లి గ్రామానికి చెందిన అల్లూరి భావన(22) ఇబ్రహీంపట్నం సమీపంలోని గురునానక్‌ ఇంజినీరింగ్‌ కళాశాలలో బీటెక్‌ మూడో సంవత్సరం చదువుతోంది. అక్కడే హాస్టల్‌లో ఉండేది. కాగా, శనివారం ఉదయం 10 గంటల సమయంలో భావన ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
భావన తల్లిదండ్రులు ఇండియన్‌ ఓవర్సీస్‌ బ్యాంకులో ఉద్యోగం చేస్తున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు. భావన సోదరి జూబ్లీహిల్స్‌లో బీఎస్సీ నర్సింగ్‌ చదువుతోంది. భావన మృతిపై కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. భావనది ఆత్మహత్య.. హత్యనా? అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు.
కుటుంబ సభ్యుల ఆందోళన..
ఇంజినీరింగ్‌ కళాశాల ఎదుట భావన కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. వారు వచ్చేలోపే మృతదేహాన్ని ఇబ్రహీంపట్నం ఆస్పత్రికి తరలించారు. మరోవైపు కుటుంబ సభ్యులు కళాశాలలోనికి వెళ్లకుండా యాజమాన్యం, పోలీసులు అడ్డుకున్నారు. దాంతో ప్రధాన గేటు వద్ద ఆందోళనలో దిగారు. తమకు ఎలాంటి సమాచారమూ ఇవ్వకుండా మృతదేహాన్ని తరలించడం పట్ల అనుమానాలు వ్యక్తం చేశారు. తమ కూతురిని కళాశాల యాజమాన్యమే హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తోందని ఆరోపించారు. తమను కళాశాల లోపలికి ఎందుకు రానివ్వడం లేదని ప్రశ్నించారు. పోలీసులు సమగ్ర విచారణ జరిపి తమకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు.
విద్యార్థి సంఘాల ఆందోళన
విద్యార్థి సంఘాల నాయకులు కాలేజీ ఎదుట ఆందోళన చేపట్టారు. బాధిత కుటుంబీకులకు మద్దతుగా ఎస్‌ఎఫ్‌ఐ, ఎంఎస్‌యూఐ, ఏబీవీపీ నాయకులు ఆందోళన దిగారు.కళాశాల యాజ మాన్యం నుంచి ఎలాంటి స్పందనా లేకపోవడంతో వారు లోపలికి దూసుకెళ్లే యత్నం చేశారు. ఈ క్రమంలో ఇబ్రహీంపట్నం సీఐ జగదీశ్‌ విద్యార్థి సంఘాల నాయకులపై చేయి చేసుకున్నారు. దాంతో నాయకులు పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కుటుంబ సభ్యులకు చెప్పకుండానే విద్యార్థిని మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించడం ఏమిటని ప్రశ్నించారు. కళాశాల వద్ద కుటుంబ సభ్యులను అడ్డుకోవడం తగదని, విద్యార్థిని చనిపోయినా వార్షికోత్సవం చేసుకోవడం యాజమాన్యం దుర్మార్గపు చర్యలకు నిదర్శనమని ఆగ్రహం వ్యక్తం చేశారు. గురునానక్‌ కళాశాలపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. విద్యార్థి సంఘాల నాయకులపై చేయి చేసుకున్న సీఐ జగదీశ్‌పై చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం నాయకులను పోలీసులు అరెస్టు చేసి ఆయా పోలీస్‌స్టేషన్లకు తరలించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -