Wednesday, October 8, 2025
E-PAPER
Homeప్రధాన వార్తలురసవత్తరం.. జూబ్లీహిల్స్‌ ఉపఎన్నిక

రసవత్తరం.. జూబ్లీహిల్స్‌ ఉపఎన్నిక

- Advertisement -

కీలకంగా మైనార్టీ ఓటర్లు
ఇప్పటికే అభ్యర్థిని ప్రకటించిన బీఆర్‌ఎస్‌
అభ్యర్థుల వేటలో జాతీయ పార్టీలు
టీడీపీ మద్దతు ఎవరికీ?
పోటీకి దూరంగా ఎంఐఎం
స్థానికులకే టికెట్‌ ఇవ్వాలని కాంగ్రెస్‌ పార్టీలో డిమాండ్‌

నవతెలంగాణ-సిటీబ్యూరో/బంజారాహిల్స్‌
జూబ్లీహిల్స్‌ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక రసవత్తరంగా మారింది. కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం షెడ్యూల్‌ను ప్రకటించిన నేపథ్యంలో ప్రధాన రాజకీయ పార్టీలు వ్యూహాలు సిద్ధం చేసుకునే పనిలో పడ్డాయి. నవంబరు 11న పోలింగ్‌ జరగనున్న నేపథ్యంలో సిట్టింగ్‌ స్థానాన్ని నిలబెట్టుకోవాలని బీఆర్‌ఎస్‌ శతవిధాలా కరసత్తు చేస్తుంటే, అభివృద్ధి, సంక్షేమం పేరుతో ఎలాగైనా విజయం సాధించాలని అధికార కాంగ్రెస్‌ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. రాష్ట్రంలో జరిగిన మొదటి ఉప ఎన్నిక సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ బీఆర్‌ఎస్‌ సిట్టింగ్‌ సీటును కాంగ్రెస్‌ ఖాతాలో వేసుకోవడంతో ఉత్సాహంగా ఉన్న కాంగ్రెస్‌ క్యాడర్‌, జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో సైతం సత్తాచాటి తిరుగులేదని నిరూపించుకునేందుకు తీవ్రంగా ప్రయత్నాలు ప్రారంభించింది.

కంటోన్మెంట్‌లో దెబ్బతిన్న బీఆర్‌ఎస్‌ సైతం ఎలాగైనా సిట్టింగ్‌ సీటును దక్కించుకోవాలని అన్ని విధాలా ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే అందరికంటే ముందుగానే జూబ్లీహిల్స్‌ నుంచి బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా మాగంటి సునీతను ప్రకటించింది. ఇక్కడ ప్రధానంగా కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ రెండు పార్టీల మధ్య ప్రధాన పోటీ నెలకొంది. ఎవరికి వారు ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ పావులు కదుపుతున్నారు. ఇదిలావుండగా జూబ్లీహిల్స్‌ నియోజకవర్గంలో స్థానికేతరులు కాకుండా స్థానికులకు టికెట్‌ ఇస్తే గెలిపించుకుంటామని కొంతమంది స్థానిక కాంగ్రెస్‌ నాయకులు అభిప్రాయం వ్యక్తం చేస్తుండటంతో ఉత్కంఠగా మారింది.

బలమైన అభ్యర్థుల కోసం వేట
ఈ నెల 13న నోటిఫికేషన్‌ వెలువడనుండగా నామినేషన్ల దాఖలుకు గడువు 21 వరకు ఉండటంతో బలమైన అభ్యర్థుల కోసం కాంగ్రెస్‌, బీజేపీ కసరత్తు చేస్తున్నాయి. 2009లో ఏర్పడిన ఈ నియోజకవర్గంలో అప్పట్లో కాంగ్రెస్‌ నుంచి పి.విష్ణువర్ధన్‌రెడ్డి విజయం సాధించారు. 2014, 2018లో మాగంటి గోపినాథ్‌ విజయం సాధించారు. 2023లో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి మాగంటి గోపినాథ్‌ హ్యాట్రిక్‌గా గెలవగా కాంగ్రెస్‌ నుంచి పోటీచేసిన మాజీ క్రికెటర్‌ అజహరుద్దీన్‌ రెండో స్థానాన్ని దక్కించు కున్నారు. తాజా ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసేందుకు చేవెళ్ల మాజీ ఎంపీ రంజిత్‌ రెడ్డి, మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మితోపాటు పలువురు ఉత్సాహం చూపుతున్నారని తెలిసింది.

అయితే నవీన్‌యాదవ్‌, మాజీ ఎంపీ అంజన్‌కుమార్‌ యాదవ్‌, మాజీ మేయర్‌ బొంతు రామ్మోహన్‌, కార్పొరేటర్‌ సీఎన్‌ రెడ్డిల పేర్లను అధిష్టానానికి పీసీసీ ప్రతిపాదించినట్టు తెలిసింది. అయితే తాజాగా జూబ్లీహిల్స్‌ ఎమ్మెల్యే అభ్యర్థి పోటీలో తాను లేనని మాజీ మేయర్‌, కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు బొంతు రామ్మోహన్‌ ప్రకటించారు. టికెట్‌ ఇచ్చినా, ఇవ్వకపోయినా కాంగ్రెస్‌ గెలుపు కోసం పని చేస్తానని స్పష్టం చేయడంతో మరింత ఆసక్తి నెలకొంది. ఇక ముగ్గురు అభ్యర్థుల్లో ఎవరిని టికెట్‌ వరిస్తుందోనన్న ఉత్కంఠ నెలకొంది. ఇక బీజేపీ బలమైన అభ్యర్థిని బరిలోకి దించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. దీపక్‌రెడ్డి, దీప్తిరెడ్డి, లక్ష్మీనారాయణ పేర్లు తెరమీదకు వచ్చాయి.

ఎంఐఎం మద్దతు ఎవరికో? చాపకింద నీరులా పావులు కదుపుతున్న టీడీపీ
జూబ్లీహిల్స్‌ నియోజకవర్గంలో 3,92,669 మంది ఓటర్లు ఉన్నారు. 2023లో జరిగిన ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి మాగంటి గోపినాథ్‌కు 80549 ఓట్లురాగా, కాంగ్రెస్‌ అభ్యర్థి అజహరుద్దీన్‌కు 64212 ఓట్లతో రెండో స్థానంలో, 25,866 ఓట్లతో మూడో స్థానంలో బీజేపీ అభ్యర్థి ఎల్‌.దీపక్‌రెడ్డి నిలిచారు. ఈ నియోజకవర్గంలో 1 లక్షా 13వేల మంది ముస్లీంల ఓట్లు ఉండగా, దాదాపు 24వేల మంది క్రిస్టియన్‌ మైనార్టీ ఓటర్లు న్నారు. యాదవ్‌ కమ్యూనిటీకి 20వేలకు పైగా ఓటర్లున్నారు. కమ్మ కమ్యూనిటీతోపాటు ఇతరులను కలుపుకుని మొత్తం 3,92,669 మంది ఓటర్లు ఉన్నారు. అయితే ఇక్కడ ముస్లీం మైనార్టీ ఓట్లు కీలకం కానున్నాయి. దాంతో వారు ఎవరికి మద్ధతు ఇస్తే వారు విజయం సాధించే అవకాశాలున్నాయి. ఎంఐఎం కాంగ్రెస్‌తోనే ఉందని, తమకే మద్దతిస్తోందని, దాంతో ప్రజలు తమకు పట్టం కట్టడం ఖాయమని కాంగ్రెస్‌ ప్రచారం చేస్తోంది.

ఇక్కడ వరుసగా మూడు సార్లు మాగంటి విజయం సాధించారని, ఆయన ఈ నియోజకవర్గానికి ఎంతో సేవచేశారంటూ సెంటిమెంట్‌తోపాటు కాంగ్రెస్‌ పాలన వైఫల్యాలతో బీఆర్‌ఎస్‌ సైతం ప్రచారంలో దూసుకెళ్తోంది. టీడీపీకి ఇక్కడ కమ్మ ఓటర్లు ఉండటంతో ఆ పార్టీ చాపకింద నీరులా పావులు కదుపుతోంది. ఇప్పటికే నియోజకవర్గంలో తేనీటి విందుల పేరుతో రహస్య మీటింగ్‌లు కొనసాగిస్తున్నారు. టీడీపీ అధిష్టానం చెప్పిన వారికే మద్దతు ఇవ్వాలని క్షేత్ర స్థాయి నాయకులు మంతనాలు కొనసాగిస్తున్నారు. అయితే నందమూరి హరికృష్ణ కూతురు నందమూరి సుహాసినిని పోటీ చేయించే అవకాశాలున్నాయనే చర్చ కూడా టీడీపీ శ్రేణుల్లో వినిపిస్తుంది. లేదంటే గెలిచే గుర్రానికే టీడీపీ మద్దతు ఇవ్వనున్నట్టు కూడా చెబుతున్నారు. ఇక బీఎస్‌పీ సైతం అభ్యర్థిని నిలబెట్టే అవకాశం ఉందని తెలుస్తోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -