ట్రాన్స్‌జెండర్లు, హిజ్రాల సదస్సులో నాయకులు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ట్రాన్స్ జెండర్ల సమస్యలను పరిష్కరించాలని పలువురు నాయకులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. మంగళవారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ ప్రజా సాంస్కృతిక కేంద్రం (టీపీఎస్కే), హ్యూమన్ రైట్స్ లా నెట్‌వర్క్ (హెచ్‌ఆర్‌ఎల్‌ఎన్), క్రిస్టియన్ సర్వీస్ ఏజెన్సీ (సీఎస్‌ఏ), సబ్‌రంగ్ సంయుక్తాధ్వర్యంలో కమ్యూనిటీ కమిటీల బలోపేతం కోసం ట్రాన్స్ జెండర్లు, హిజ్రాల రాష్ట్ర సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రాన్స్ జెండర్ల యాక్టివిస్ట్ రచన ముద్రబోయిన మాట్లాడుతూ అందరి విముక్తిలోనే ట్రాన్స్‌జెండర్ విముక్తి ఉందని తెలిపారు. ట్రాన్స్‌జెండర్లు, హిజ్రాలు తమ హక్కులతో పాటు బాధ్యతలను కూడా గుర్తించాలని కోరారు. అడుక్కోవడం దగ్గర గొంతులు పెంచడం కాకుండా హక్కుల విషయంలో గొంతులు పెంచి ప్రభుత్వాల మెడలు వంచాలని పిలుపునిచ్చారు. సమాజం పట్ల బాధ్యతగా వ్యవహరిస్తూ వివక్ష, హింసను అంతం చేస్తామని ప్రకటించారు. ట్రాన్స్ పీపుల్స్ రైట్స్‌ను హుమన్స్ రైట్స్‌గా పరిగణించాలని డిమాండ్ చేశారు. ట్రాన్స్ జెండర్లు ప్రజలతో మమేకం కావాలన్నారు.
అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో టీపీఎస్కే రాష్ట్ర అధ్యక్షులు భూపతి వెంకటేశ్వర్లు, రచన మాట్లాడారు. తెలంగాణలోని హిజ్రాలు, ట్రాన్స్‌జెండర్లు సుమారు 3 లక్షల మంది ఉన్నారనీ, వారి సమస్యలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే పరిష్కరించాలని కోరారు. విద్య వైద్యం ఉపాధి అవకాశాలు కల్పించాలనీ, వారి కోసం ఇండ్లు, కమ్యూనిటీ హాల్స్ నిర్మించాలని డిమాండ్ చేశారు. దేశంలో పుట్టిన ప్రతి వ్యక్తికి సమానమైన హక్కులు ఉండాలని మన రాజ్యాంగం నిర్దేశిస్తుందని గుర్తుచేశారు. స్త్రీ, పురుషులను మాత్రమే కాకుండా హిజ్రాలు, ట్రాన్స్ జెండర్లను గుర్తించాలని విజ్ఞప్తి చేశారు.
తెలంగాణ హిజ్రా, ట్రాన్స్‌జెండర్ల అసోసియేషన్ అధ్యక్షురాలు మోనాలిసా మాట్లాడుతూ హిజ్రాలు, ట్రాన్స్ జెండర్లు మనుషులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. హిజ్రాల సముదాయాలకు కమ్యూనిటీ హాల్స్ నిర్మించాలనీ, తెలంగాణ ట్రాన్స్ జెండర్ పర్సన్స్ ప్రొటెక్షన్ రైట్స్ వెంటనే అమలు చేయాలని కోరారు.
ప్రజలు అర్థం చేసుకోవాలి
పీఓడబ్ల్యూ నాయకురాలు సంధ్య, సామాజిక వేత్తలు కొండవీటి సత్యవతి, సజయ మాట్లాడుతూ ట్రాన్స్ జెండర్లను ప్రజలు అర్ధం చేసుకోవాలని కోరారు. వారి సమస్యలను ప్రభుత్వాలు గుర్తించాలనీ, లింగమార్పిడి చేసుకోవడానికి అవసరమైన సహాయాన్ని ప్రభుత్వాలు అందించాలని కోరారు. ట్రాన్స్ జెండర్లను దేశంలో ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కలా పిలుస్తారనీ, వీరందరికీ సమాన హక్కులు కల్పించాలని కోరారు. తెలంగాణలో ప్రత్యేక సర్వే చేసి ఆర్థిక సహకారం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ట్రాన్స్ జెండర్లకు సంబంధించి 60 మంది గురువులు సంఘమిత్ర, సోనీ, మనోరమ, ప్రియా, శిల్ప, ప్రేమమ్మ,శోభ, సమీరా, యాస్మిన్, సోనారథోడ్, శ్రావణి సమంత, చిట్టి, నందన తదితరులు పాల్గొన్నారు
తీర్మానం
ట్రాన్స్ జెండర్ హిజ్రాల కల్చరల్ ఫెస్ట్‌ను 2025 నవంబర్ చివర్లో నిర్వహించి తమ ప్రతిభా పాటవాలు సమాజానికి తెలియజేయాలని సదస్సులో తీర్మానించారు.
ట్రాన్స్‌జెండర్ల సమస్యలు పరిష్కరించాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES