Wednesday, October 8, 2025
E-PAPER
Homeప్రధాన వార్తలుపాలస్తీనాపై యుద్ధం ఆపాలి

పాలస్తీనాపై యుద్ధం ఆపాలి

- Advertisement -

గాజాలో మారణహోమం వద్దు
అమెరికా సామ్రాజ్యవాదం
ఇజ్రాయిల్‌ ఆధిపత్యవాదంపై పోరాడాలి
వామపక్ష పార్టీల నేతల పిలుపు
అశోక్‌ నగర్‌ నుంచి ఇందిరాపార్క్‌ వరకు ప్రదర్శన
జాన్‌వెస్లీ, అజీజ్‌పాషా సహా పలువురి అరెస్టు

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
పాలస్తీనాపై అమెరికా సామ్రాజ్యవాదం సహకారంతో ఇజ్రాయిల్‌ చేస్తున్న యుద్ధాన్ని వెంటనే ఆపాలని వామపక్ష పార్టీల నేతలు డిమాండ్‌ చేశారు. మారణహోమం సృష్టిం చొద్దనీ, శాంతిని నెలకొల్పాలని కోరారు. ఇజ్రాయిల్‌ దాష్టీకాలను ఖండిస్తూ పాలస్తీనాకు సంఘీభావంగా వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో మంగళవారం హైదరాబాద్‌లోని అశోక్‌నగర్‌ నుంచి ఇందిరాపార్క్‌ ధర్నాచౌక్‌ వరకు ప్రదర్శన నిర్వహించారు. అఖిల భారత శాంతి సంఘీ భావ సంఘం (ఐప్సో), పాలస్తీనా సంఘీభావ కమిటీ (పీఎస్‌సీ), మూవ్‌మెంట్‌ ఫర్‌ పీస్‌ అండ్‌ జస్టిస్‌ (ఎంపీజే) సంఘీభావం ప్రకటించాయి.

‘అమెరికా సామ్రాజ్యవాదం నశించాలి, పాలస్తీనాపై యుద్ధం ఆపాలి, ప్రపంచ శాంతిని నెలకొల్పాలి’ అంటూ పెద్దఎత్తున నినాదాలు చేశారు. ధర్నాచౌక్‌లో శాంతియుతంగా సభ జరుగుతుండగానే పోలీసులు వామపక్ష పార్టీల తోపాటు ఐప్సో, పీఎస్‌సీ, ఎంపీజే, నాయకులు, కార్యకర్తలను అరెస్టు చేశారు. సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ, సీపీఐ సీనియర్‌ నాయకులు అజీజ్‌పా షాతోపాటు పలువురు నాయకులను పోలీసులు అరెస్టు చేసి వివిధ పోలీస్‌ స్టేషన్లకు తరలించారు. ఈ సమ యంలో కొద్దిసేపు అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అంతకుముందు సభ నిర్వహించారు.

పాలస్తీనా భూభాగాన్ని ఆక్రమిస్తున్న ఇజ్రాయిల్‌
పాలస్తీనా భూభాగాన్ని ఇజ్రాయిల్‌ ఆక్రమిస్తున్నదని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ విమర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటికే 65 వేల మందికిపైగా ప్రజలను పొట్టనబెట్టు కుందన్నారు. విద్య లేదనీ, వైద్యం అందడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. పిల్లలు, పెద్దలు అన్న తేడాలేకుండా అందరూ చనిపోతున్నారని వివరించారు. పాలస్తీనాలో ఆకలిచావులు కూడా జరుగుతున్నాయనీ, ఆహారం పంపిస్తే ఇజ్రా యిల్‌ అడ్డుకుంటున్నదని చెప్పారు. ఇజ్రాయిల్‌కు అనుకూలంగా అమెరికా 20 సూత్రాల పథకాన్ని ముందుకు తెచ్చిందన్నారు. అయినా ఇజ్రాయిల్‌ యుద్ధం ఆపడం లేదనీ, దాడులకు పాల్పడుతూనే ఉందని తెలిపారు.

అమెరికాకు, ఇజ్రాయిల్‌కు మోడీ ప్రభుత్వం అనుకూలంగా ఉంటోందని విమర్శించారు. మోడీ విధానాలను వ్యతిరేకించాలని పిలుపు నిచ్చారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలో ఉన్నా పాలస్తీనాకు సంఘీభావంగా ప్రదర్శన నిర్వహించే పరిస్థితి లేదన్నారు. పాలస్తీనా ప్రజలను చంపుతుంటే, భూభాగాన్ని ఆక్రమిస్తుంటే భారత ప్రభుత్వం ఇజ్రాయిల్‌కు అండగా ఉండడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. పాలస్తీనా యుద్ధాన్ని, గాజాపై మారణ హోమాన్ని వెంటనే ఆపాలని డిమాండ్‌ చేశారు. పాలస్తీనా ప్రజలకు మంచినీరు, ఆహారం అందించాలని కోరారు. అమెరికా సామ్రాజ్యవాదం, ఇజ్రాయిల్‌ ఆధిపత్య ధోరణికి వ్యతిరేకంగా ప్రజలంతా ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు.

పాలస్తీనాను స్వతంత్ర దేశంగా గుర్తించిన పలు దేశాలు
ఐక్యరాజ్య సమితిలో పాలస్తీనాకు అనుకూలంగా ఇజ్రాయిల్‌కు వ్యతిరేకంగా 145 దేశాలు నిలబడ్డాయని సీపీఐ సీనియర్‌ నాయకులు అజీజ్‌పాషా అన్నారు. పాలస్తీనాను స్వతంత్ర దేశంగా గుర్తించాయని వివరించారు. అయినా ఇజ్రాయిల్‌ మారణకాండను ఆపడం లేదన్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌, ఇజ్రాయిల్‌ ప్రధాని నెతన్యాహు పాలస్తీనా భూభాగాన్ని ఆక్రమించుకోవాలని భావిస్తున్నారనీ, అందుకే దాడులకు పాల్పడుతున్నారని విమర్శించారు. సీపీఐ(ఎంఎల్‌) న్యూడెమోక్రసీ రాష్ట్ర నాయకులు బి ప్రదీప్‌, సీపీఐ(ఎంఎల్‌) మాస్‌లైన్‌ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కె రమ, ఎంసీపీఐ(యూ) రాష్ట్ర కార్యదర్శి గాదగోని రవి, ఎస్‌యూసీఐ(సీ) రాష్ట్ర కార్యదర్శి సిహెచ్‌ మురహరి, సీపీఐ(ఎంఎల్‌) నాయకులు విజయ్ మాట్లాడుతూ ప్రపంచ ఉగ్రవాది ట్రంప్‌ నోబెల్‌ శాంతి బహుమతి కోరుకోవడం హాస్యాస్పదంగా ఉందన్నారు.

అనేక దేశాల్లో యుద్ధాలను ఆపానంటూ ప్రకటించడం అవమానకరమని తెలిపారు. అంతర్జాతీయ న్యాయసూత్రాలు, రాయబార ప్రమాణాలను ఇజ్రాయిల్‌ అతిక్రమిస్తున్నదని విమర్శించారు. ఇజ్రాయిల్‌కు అనుకూలంగా వ్యవహరిస్తున్న మోడీ ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా ఖండించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు టి జ్యోతి, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు టి సాగర్‌, ఎండీ అబ్బాస్‌, మల్లు లక్ష్మి, పి ప్రభాకర్‌, బి రవికుమార్‌, రాష్ట్ర కమిటీ సభ్యులు ఆర్‌ శ్రీరాం నాయక్‌, టి స్కైలాబ్‌బాబు, పి ఆశయ్య, జె బాబురావు, సత్యం, సీనియర్‌ నాయకులు డీజీ నరసింహరావు, నగర నాయకులు మహేందర్‌, సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు విఎస్‌ బోస్‌, నగర కార్యదర్శి స్టాలిన్‌, సీపీఐ(ఎంఎల్‌) మాస్‌లైన్‌ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎం హన్మేష్‌, నాయకులు కెఎస్‌ ప్రదీప్‌, సీపీఐ(ఎంఎల్‌) న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జెవి చలపతిరావు, కె గోవర్ధన్‌, నాయకులు సాదినేని వెంకటేశ్వరరావు, ఝాన్సీ, ఐప్సో ప్రధాన కార్యదర్శి కెవిఎల్‌, ఎంపీజే ప్రతినిధులు అన్సారీ, అజీజ్‌ పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -