– ఆలస్యంగా వెలుగులోకి
నవతెలంగాణ-ఏటూరునాగారం ఐటీడీఏ
మావోయిస్టు పార్టీలో క్రమశిక్షణా చర్యల కింద ఛత్తీస్‌గఢ్ ఏరియా దళ కమాండర్ మాడవి లక్కి(38)ని మావోయిస్టులు హతమార్చిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం చెల్పాక వీరాపురం గొత్తికోయగూడెంలో ఈ నెల 2వ తేదీ (దసరా పండుగ రోజు) అటవీ ప్రాంతంలో మృతి చెందిన వ్యక్తిని పోలీసులు గుర్తించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మంగళవారం పాలెం ప్రాంతానికి చెందిన ఓ కొరియర్ పోలీసులకు చిక్కడంతో అసలు విషయం బయటపడింది. లక్కి మావోయిస్టు పార్టీలో పనిచేసే ఓ మహిళను తీసుకుని బయటకు వచ్చి, పాలెంకు చెందిన వ్యక్తి సహకారంతో వీరాపురం గొత్తికోయగూడెంలోని బంధువుల వద్ద నివాసం ఉంటున్నట్టు తెలిసింది. ఈ విషయం తెలుసుకున్న నలుగురు మావోయిస్టులు ద్విచక్రవాహనాలపై అక్కడికి చేరుకుని లక్కిని చత్తీస్‌గఢ్‌కు తీసుకెళ్లే ప్రయత్నం చేయగా, అతను ప్రతిఘటించాడు. దాంతో మావోయిస్టులు లక్కిని చెట్టుకు కట్టేసి ఉరి వేసి హతమార్చారు. పార్టీకి ద్రోహం చేశాడని, క్రమశిక్షణా చర్యల కింద హతమారుస్తున్నట్టు స్థానికులకు చెప్పి వెళ్లినట్టు సమాచారం. లక్కి మృతదేహానికి సామాజిక ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు. అయితే, ఈ విషయాలను పోలీసులు ధృవీకరించలేదు.
మావోయిస్టుల చేతిలో దళ కమాండర్ హత్య
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES