– పీఏపల్లి మండలం పలుగుతండాలో వ్యాపారి ఇంటిపై దాడి
– విలువైన వస్తువులు ధ్వంసం.. ఫర్నీచర్‌కు నిప్పు
– గ్రామంలో ఉద్రిక్తత.. రంగ ప్రవేశం చేసిన పోలీసులు
నవతెలంగాణ-దేవరకొండ
అధిక వడ్డీ ఆశ చూపి పేదల నుంచి కోట్ల రూపాయలను వసూలు చేసి డబ్బులను తిరిగి ఇవ్వకపోవడంతో ఆందోళన చెందిన బాధితుడు రమావత్ సరియానాయక్(37) గడ్డిమందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. అతని పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ తరలించగా చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు. దాంతో మృతిని బంధువులు, బాధితులు, తండావాసులు ఆగ్రహంతో బాలాజీ నాయక్ ఇంటిపై మంగళవారం దాడికి పాల్పడ్డారు. పోలీసులు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. నల్లగొండ జిల్లా పీఏపల్లి మండలం పలుగుతండాకు చెందిన రమావత్ బాలాజీనాయక్ నూటికి 10 రూపాయల నుంచి 16 రూపాయల వరకు వడ్డీ ఇస్తానని నమ్మించి డబ్బులు డిపాజిట్‌గా తీసుకున్నాడు. ఇలా కోట్లాది రూపాయలు వసూలు చేశారు. సరియానాయక్ నిరుపేద కుటుంబం. బతుకుదెరువు కోసం మిర్యాలగూడకు వెళ్లాడు. అతనికి కేవలం ఐదు గుంటల భూమి మాత్రమే ఉంది. సరియానాయక్ అధిక వడ్డీ ఆశతో తెలిసిన వారి నుంచి రూ.30 లక్షల వరకు అప్పు తీసుకొని బాలాజీనాయక్‌కు ఇచ్చాడు. తానిచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వాలని, ఎన్నిసార్లు అడిగిన బాలాజీనాయక్ నుంచి ఎలాంటి స్పందన లేదు. తనకు అప్పులు ఇచ్చినవారు డబ్బులు ఇవ్వాలని ఒత్తిడి చేస్తుండటంతో వాటిని ఎలా తీర్చాలో తెలియక ఆందోళన చెందిన సరియానాయక్ సోమవారం మిర్యాలగూడ పట్టణంలో గడ్డిమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దాంతో తండావాసులు పలుగుతండాలోని బాలాజీనాయక్ విలాసవంతమైన భవనాన్ని ధ్వంసం చేశారు. ఇంటిలోపల ఉన్న ఫర్నీచర్‌ను ఇంటి ముందు వేసి తగులబెట్టారు. ఇంటి కిటికీలు, ఇంట్లో ఉన్న విలాస వస్తువులు, టీవీ, డోర్లు పగులగొట్టారు. ఈ ఘటనతో బాలాజీనాయక్ బాధితుల్లో కలవరం మొదలైంది. తండాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు రంగ ప్రవేశం చేసి బాధితులతో చర్చలు జరుపుతున్నారు.
ముంచిన వడ్డీ వ్యాపారి ..వ్యక్తి ఆత్మహత్య
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES