Wednesday, October 8, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంబీసీ రిజర్వేషన్ల పెంపు రాజ్యాంగబద్ధమే

బీసీ రిజర్వేషన్ల పెంపు రాజ్యాంగబద్ధమే

- Advertisement -

హైకోర్టులో కూనంనేని ఇంప్లీడ్‌ పిటిషన్‌
పలువురు కాంగ్రెస్‌ నేతలు కూడా
నేడు విచారణ చేయనున్న డివిజన్‌ బెంచ్‌


నవతెలంగాణ-హైదరాబాద్‌
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను కల్పిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో 9ని సవాలు చేసిన పిటిషన్లను కొట్టేయాలని కోరుతూ సీపీఐ శాసనసభ్యులు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు హైకోర్టులో ఇంప్లీడ్‌ పిటిషన్లు దాఖలు చేశారు. రిజర్వేషన్ల పెంపుదలకు సంబంధించిన జీవో 9ని రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్లల్లో తమ వాదనలు వినాలని కోరుతూ ఇంప్లీడ్‌ పిటిషన్‌ వేశారు. బీసీ రిజర్వేషన్ల పెంపు రాజ్యాంగబద్ధమేనని పేర్కొంటూ మంగళవారం హైకోర్టును ఆశ్రయించారు. ఇదే తరహాలో బీసీ సంఘ నాయకులు, రాజ్యసభ సభ్యులు ఆర్‌.కృష్ణయ్య కూడా మరో ఇంప్లీడ్‌ పిటిషన్‌ వేశారు. ఇప్పటికే కాంగ్రెస్‌ నేత వి.హనుమంతరావు ఇతరులు కూడా ఇంప్లీడ్‌ పిటిషన్లు దాఖలు చేయగా మంగళవారం కాంగ్రెస్‌ నేతలు చరణ్‌ కౌశిక్‌ యాదవ్‌, ఇందిరా శోభన్‌ తదితరులు ఇంప్లీడ్‌ పిటిషన్లు వేశారు.

వారి తరఫున సీనియర్‌ అడ్వకేట్లు బీఎస్‌ ప్రసాద్‌, కేజీ.కృష్ణమూర్తి ఇతరులు వాదించనున్నారు. సుప్రీం కోర్టు సీనియర్‌ న్యాయవాది సిద్ధార్థ లూద్రా కూడా హాజరుకానున్నారని తెలిసింది. జీవో 9ను సవాలు చేస్తూ బుట్టెంబారి మాధవరెడ్డి, సముద్రాల రమేష్‌ దాఖలు చేసిన పిటిషన్లను సవాల్‌ చేస్తూ వారంతా ఇంప్లీడ్‌ పిటిషన్లు వేశారు. జీవో 9ని రద్దు చేయాలంటూ రామాంతపూర్‌కు చెందిన విద్యార్థి శ్రీరామ శ్రీలేఖ మంగళవారం మరో పిల్‌ దాఖలు చేశారు. వీటిపై చీఫ్‌ జస్టిస్‌ ఏకే సింగ్‌, జస్టిస్‌ జి ఎం మొహియుద్దీన్లతో కూడిన డివిజన్‌ బెంచ్‌ మంగళవారం విచారణ చేయనుంది. పిటిషనర్ల తరఫున సీనియర్‌ లాయర్లు వాదించేందుకు సమాయత్తం అవుతున్నారు. హైకోర్టు చెప్పబోయే తీర్పుపై ఆధారపడి స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే అవకాశముంది.

ఘోష్‌ నివేదిక చర్యలు వద్దు గత ఉత్తర్వులను పొడిగించిన హైకోర్టు
కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ జరిపిన జస్టిస్‌ ఘోష్‌ నివేదికను సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్లపై రెండు వారాల్లోగా కౌంటర్‌ వేయాలని రాష్ట్రానికి హైకోర్టు ఆదేశించింది. మరో రెండు వారాల్లోగా పిటిషనర్లు మళ్లీ కౌంటర్లు వేయాలంది. తొలుత గడువు కావాలని అడ్వకేట్‌ జనరల్‌ ఏ.సుదర్శన్‌రెడ్డి చేసిన విజ్ఞప్తిని అనుమతిచ్చింది. విచారణ వచ్చే 12కు వాయిదా వేసింది. అప్పటి వరకు జస్టిస్‌ ఘోష్‌ నివేదిక ఆధారంగా మాజీ సీఎం కేసీఆర్‌, మాజీ మంత్రి హరీశ్‌రావు, మాజీ సీఎస్‌ ఎస్‌కే జోషి, అప్పటి సీఎం ప్రత్యేక కార్యదర్శి స్మితా సబర్వాల్‌పై ఏవిధమైన చర్యలు తీసుకోరాదని ప్రభుత్వాన్ని ఆదేశించింది.

ఈ మేరకు గతంలోని మధ్యంతర ఉత్తర్వులను పొడిగిస్తున్నట్టు ప్రకటించింది. కమిషన్‌ సాక్షులుగా తమను పిలిచిందనీ, అభియోగాలు చేసే ముందు తమకు నోటీసులు ఇవ్వలేదనీ, ఏకపక్షంగా తమపై అభియోగాలు మోపుతూ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చిందంటూ కేసీఆర్‌, హరీశ్‌రావు, ఎస్‌కే జోషి, స్మితా సబర్వాల్‌ వేర్వేరుగా వేసిన వ్యాజ్యాలన్నింటినీ కలిపి ధర్మాసనం విచారించింది, ప్రభుత్వ వినతి మేరకు విచారణ వాయిదా వేసింది.

హైకోర్టు న్యాయమూర్తి అభినంద్‌ కుమార్‌ షావిలికి వీడ్కోలు
న్యాయమూర్తిగా పదవీ విరమణ చేసిన జస్టిస్‌ అభినంద్‌ కుమార్‌ షావిలికి హైకోర్టు ఘనంగా వీడ్కోలు చెప్పింది. చీఫ్‌ జస్టిస్‌ అపరేశ్‌ కుమార్‌ సింగ్‌ అధ్యక్షతన ఫస్ట్‌ కోర్టులో న్యాయమూర్తులు సమావేశమై వీడ్కోలు చెప్పారు. న్యాయమూర్తులు, జస్టిస్‌ షావిలి కుటుంబసభ్యులు, ఏజీ సుదర్శన్‌రెడ్డి, బార్‌ కౌన్సిల్‌ చైర్మెన్‌ నరసింహారెడ్డి, పీపీ పల్లె నాగేశ్వరరావు, అదనపు సొలిసిటర్‌ జనరల్‌ నరసింహశర్మ, హైకోర్టు బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు జగన్‌ ఇతరులు హాజరయ్యారు.

సీజేఐపై దాడికి న్యాయవాదుల నిరసన
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై బహిరంగ కోర్టులో సోమవారం జరిగిన దాడిని నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కోర్టుల వద్ద న్యాయవాదులు ఆందోళనలు నిర్వహించారు. సీజేఐపై దాడి రాజ్యాంగంపై దాడేనంటూ పలువురు న్యాయవాదులు మంగళవారం హైకోర్టులో నిరసన తెలిపారు, హైకోర్టు బార్‌ అసోసియేషన్‌, బీజీపీ లీగల్‌ సెల్‌ ఆధ్వర్యంలో నిరసన జరిగింది. బార్‌ కౌన్సిల్‌ కూడా సీజేఐపై దాడిని ఖండిస్తూ తీర్మానం చేసింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -