ఏథెన్స్ : స్వీడన్‌కు చెందిన పర్యావరణ, సామాజిక కార్యకర్త గ్రెటా థన్‌బర్గ్ మరో 160 మంది కార్యకర్తలతో కలిసి గ్రీస్ చేరుకున్నారు. మానవతా సాయం తీసుకుని గాజా బయలుదేరిన నౌకలు, బోట్లను దారి మధ్యలోనే అడ్డగించిన ఇజ్రాయిల్ వీరందరినీ వెనక్కి తిప్పిపంపింది. ఏథెన్స్ విమానాశ్రయం వద్ద గ్రేటా థన్‌బర్గ్ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ ‘అక్కడ మారణహోమం జరుగుతోంది అని నేను స్పష్టంగా చెప్పదలచుకున్నాను.’ అని చెప్పారు. గాజాలో ఇజ్రాయిల్ సైనిక చర్యను ప్రస్తావిస్తూ ‘మన అంతర్జాతీయ వ్యవస్థలు పాలస్తీనియన్లను మోసం చేశాయి. దారుణమైన యుద్ధ నేరాలను కూడా అవి నిలువరించలేకపోయాయి’ అని మండిపడ్డారు.
ప్రభుత్వాలు తమ న్యాయపరమైన బాధ్యతలను నిర్వర్తించకపోవడం వల్లనే తాము నౌకల్లో గాజాకు సహాయ సామగ్రిని తరలించాల్సి వచ్చిందని చెప్పారు. ఏథెన్స్ చేరుకున్న 161 మందిలో 27 మంది గ్రీస్‌కు చెందిన వారు కాగా మిగిలిన వారు పదిహేను దేశాలకు చెందిన వారు. విమానాశ్రయం వద్ద ప్రజలు పెద్ద ఎత్తున కార్యకర్తలకు స్వాగతం పలికారు. అరైవల్ బ్లాక్ వద్ద వారు ఓ భారీ పాలస్తీనా పతాకాన్ని వుంచారు. ‘ఫ్రీడమ్ ఫర్ పాలస్తీనా’, ‘లాంగ్ లివ్ ది ఫ్లోటిల్లా’ అంటూ నినాదాలు చేశారు.
చేయి చేసుకున్న ఇజ్రాయిల్ సైనికులు
ఏథెన్స్ చేరుకున్న వారిలో యూరోపియన్ పార్లమెంటుకు చెందిన ఫ్రెంచ్-పాలస్తీనా సభ్యురాలు రిమా హసన్ కూడా ఉన్నారు. నౌకను అడ్డుకున్న ఇజ్రాయిల్ సైనికులు ఆమెపై చేయి చేసుకున్నారు. తనను వ్యానులో ఎక్కించేటప్పుడు ఇద్దరు పోలీసు అధికారులు కొట్టారని ఆమె తెలిపారు. ఇతర డిటెన్యూలతో పాటు తనను అత్యంత భద్రత కలిగిన జైలులో ఉంచారని, ఒక్కో గదిలో పదిహేను మందిని నిర్బంధించారని వివరించారు.
మారణహోమం జరుగుతోంది గ్రెటా థన్‌బెర్గ్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES