నవతెలంగాణ-హైదరాబాద్ : ప్రముఖ రియాలిటీ షో బిగ్ బాస్ అభిమానులకు ఊహించని షాక్ తగిలింది. కన్నడ స్టార్ కిచ్చా సుదీప్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ‘బిగ్ బాస్ కన్నడ’ 12వ సీజన్‌కు అధికారులు అడ్డుకట్ట వేశారు. పర్యావరణ నిబంధనలను తీవ్రంగా ఉల్లంఘిస్తున్నారన్న కారణంతో కాలుష్య నియంత్రణ మండలి అధికారులు షో నడుస్తున్న హౌస్‌ను సీజ్ చేశారు. ఈ అనూహ్య పరిణామంతో షో మధ్యలోనే నిలిచిపోయింది.
బిగ్ బాస్ హౌస్ నిర్వహణలో నిర్వాహకులు నిబంధనలు పాటించడం లేదని అధికారులు గుర్తించారు. హౌస్ నుంచి వెలువడుతున్న మురుగునీటిని ఎలాంటి శుద్ధి ప్రక్రియ చేపట్టకుండా నేరుగా పరిసరాల్లోకి వదిలేస్తున్నారని తేల్చారు. దీనికి తోడు, షో కోసం 24 గంటలూ పనిచేసే రెండు భారీ డీజిల్ జనరేటర్ల వల్ల తీవ్ర వాయు కాలుష్యం ఏర్పడుతోందని అధికారులు తెలిపారు.
ఈ ఉల్లంఘనలపై చర్యలు తీసుకునే ముందు నిర్వాహకులకు నోటీసులు జారీ చేసినట్లు కాలుష్య నియంత్రణ మండలి వెల్లడించింది. అయితే, ఆ నోటీసులపై నిర్వాహకుల నుంచి కనీస స్పందన కూడా రాలేదని, దీంతో నిబంధనల ప్రకారం హౌస్‌ను సీజ్ చేయాల్సి వచ్చిందని అధికారులు స్పష్టం చేశారు.
అధికారులు హౌస్‌ను సీజ్ చేయడంతో నిర్వాహకులు వెంటనే అప్రమత్తమయ్యారు. హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్లందరినీ తాత్కాలికంగా ఓ థియేటర్‌కు తరలించారు. ప్రస్తుతం షో భవిష్యత్తుపై అనిశ్చితి నెలకొంది. నిర్వాహకులు అధికారులతో చర్చించి సమస్యను పరిష్కరించుకుంటారా? లేక షో నిరవధికంగా వాయిదా పడుతుందా? అన్న దానిపై స్పష్టత రావాల్సి ఉంది. ఈ వివాదం ఎప్పుడు ముగుస్తుందో, షో తిరిగి ఎప్పుడు ప్రారంభమవుతుందోనని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.