Monday, May 12, 2025
Homeరాష్ట్రీయంఎవరికీ పట్టని కూల్‌ రూఫ్‌ పాలసీ

ఎవరికీ పట్టని కూల్‌ రూఫ్‌ పాలసీ

- Advertisement -

– కూల్‌ పెయింట్‌ వేస్తే తగ్గనున్న 4-16 డిగ్రీల ఉష్ణోగ్రతలు
– విద్యుత్‌ వినియోగం, చార్జీల భారం ఆదా
– కూల్‌ పెయింట్‌ వేయకున్నా ఆక్యుపెన్సీ సర్టిఫికెట్‌ జారీ
– నిబంధనలు పట్టని మున్సిపల్‌ అధికారులు
– ఇందిరమ్మ ఇండ్లకు కూల్‌ పెయింట్‌ తప్పనిసరి

భవన సముదాయ నిర్మాణంలో కూల్‌ రూఫ్‌ పయింట్‌ తప్పనిసరి. భవనాల నిర్మాణంలో ఆక్యుపెన్సీ సర్టిఫికెట్‌ జారీ చేయాలంటే తప్పనిసరిగా భవనాలకు కూల్‌ పెయింట్‌ వేయాలి. కానీ..! కూల్‌ రూప్‌ పాలసీని ఎవరూ పట్టించుకోవడం లేదు. కూల్‌ పెయింట్‌ అంటే కేవలం చిన్నపాటి రేకుల షెడ్ల ఇండ్లు, దాబాల్లో నివశించే వాళ్లు మాత్రమే ఎండల తీవ్రత నుంచి ఉపశమనం కోసం వేసుకుంటారనే భావన ఉంది. దాని వల్ల చేకూరే ప్రయోజనాలు చాలానే ఉన్నాయి. ముఖ్యంగా పెద్ద పెద్ద వాణిజ్య, వ్యాపార సదుపాయాలు, ప్రభుత్వ కార్యాలయాలు, ఇండ్లు, ఇతర భవనాలకు కూల్‌ పెయింట్‌ వేయడం ద్వారా గదుల లోపలి ఉష్ణోగ్రతల తీవ్రత తగ్గుతుంది. దాని వల్ల విద్యుత్‌ అధిక వినియోగం అవసరముండదు. విద్యుత్‌ చార్జీలూ తగ్గుతాయని అధికారులు చెబుతున్నారు. పర్యావరణం మెరుగుపడుతుందని కేంద్ర ప్రభుత్వ సంస్థ బ్యూరో ఆఫ్‌ ఎనర్జీ ఎఫీషియన్సీ (బీఈఈ) చేసిన పరిశోధనలో తేలింది.
నవతెలంగాణ- మెదక్‌ ప్రాంతీయ ప్రతినిధి
భవనాలపై కూల్‌ రూప్‌ పెయింట్‌ వేయడం ద్వారా చేకూరే లాభాల గురించి ఇటీవల శాస్త్రీయంగా రుజువైంది. కేంద్ర ప్రభుత్వ సంస్థ బ్యూరో ఆఫ్‌ ఎనర్జీ ఎఫిషియన్స్‌ (బీఈఈ) సహకారంతో అడ్మినిస్ట్రేటివ్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఇండియా (ఎఎస్‌సీఐ) కూల్‌ రూప్‌ పెయింట్‌ వినియోగం, ఫలితాలపై క్షేత్రస్థాయి పరిశీలన చేసింది. హైదరాబాద్‌లోని హెచ్‌సీయూ భవనాలపై కూల్‌ రూప్‌ పెయింట్‌ వేసి పరిశీలించగా 4 నుంచి 16 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు తగ్గినట్టు తేలింది. నిర్ణీత భవన విస్తీర్ణంలో పెయింట్‌ వేయడం ద్వారా నమోదైన ఉష్ణోగ్రతలను బట్టి ఎంతో ప్రయోజనమున్నట్టు రుజువైంది.
కూల్‌ రూప్‌ పాలసీ
రాష్ట్ర వ్యాప్తంగా భవన సముదాయాలు విస్తరిస్తున్నాయి. బహుళ అంతస్తులు, భారీ భవనాలు, పెద్ద భవంతులతో కూడిన ఇండ్లు, ప్రభుత్వ కార్యాలయ భవన సముదాయాలు, వాణిజ్య భవనాల నిర్మాణం పెద్ద ఎత్తున జరుగుతోంది. అయితే, భవనాల నిర్మాణంలో పాటించాల్సిన అనేక నిబంధనల్లో కూల్‌ రూప్‌ పెయింట్‌ పాలసీ కూడా కీలకమైందే. ఈ నిబంధన గురించి భవన యజమానులు, అనుమతులిచ్చే మున్సిపల్‌ ఇతర శాఖల అధికారులు పట్టించుకోవడంలేదు.
2028 వరకు హైదరాబాద్‌లో 200 చదరపు కిలో మీటర్ల ప్రాంతంలోని భవనాలపై రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో 100 చదరపు కిలో మీటర్ల ప్రాంతంలో ఉన్న భవనాలపై కూల్‌ రూప్‌ పెయింట్‌ వేయించాలనేది లక్ష్యంగా నిర్దేశించారు. కొత్తగా నిర్మించే భవనాలతో పాటు పాత భవనాలపై కూడా కూల్‌ పెయింట్‌ వేయించేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం భావించినా అమలు కావడం లేదు.
తగ్గనున్న విద్యుత్‌ వినియోగం
ప్రస్తుతం ఎండల తీవ్రత వల్ల హైదరాబాద్‌లోనే సాయంత్రం పూట 3794 మెగావాట్ల విద్యుత్‌ వినియోగం నమోదవుతున్నాయి. ఇతర ప్రాంతాల్లో కలిపితే మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ వినియోగమవుతోంది. కూల్‌ రూప్‌ పెయింట్‌ వేయిస్తే లోపలి ఉష్ణోగ్రతలు తగ్గడం వల్ల సుమారు 500 మెగావాట్ల విద్యుత్‌ను పొదుపు చేయొచ్చని విద్యుత్‌ సంస్థలు పేర్కొంటున్నాయి. విద్యుత్‌ వాడకం తగ్గితే ఏడాదిలో రూ.62 కోట్ల మేరకు విద్యుత్‌ బిల్లులు కూడా తగ్గుతాయంటున్నారు.
పట్టించుకోని మున్సిపల్‌ అధికారులు
గృహ, వాణిజ్య, నివాసేతర భవనాల నిర్మాణం తర్వాత మున్సిపల్‌ అధికారులు ఆక్యుపెన్సీ సర్టిఫికెట్‌ (ఓఆర్‌) జారీ చేస్తారు. ఆ సమయంలో నిర్మించిన భవనాలపై కూల్‌ రూప్‌ పెయింట్‌ తప్పని సరిగా వేయాలి. ప్రతి ఆఫీస్‌ భవనం, నివాసేతర, వాణిజ్య భవనాలకు కూల్‌ రూప్‌ వేయించాలి. 600 చదరపు గజాల విస్తీర్ణంలో కట్టే భవనాలకు విధిగా కూల్‌ రూప్‌ వేయించాలి. తక్కువ విస్తీర్ణంలో నిర్మించే ఇండ్లకు పెయింట్‌ వేయిస్తే ఎంతో ఉపయోగం. తెల్లాపూర్‌, కొల్లూరు, అమీన్‌పూర్‌, పటాన్‌చెరు, సంగారెడ్డి, సదాశివపేట, జహీరాబాద్‌, మెదక్‌, గజ్వేల్‌, సిద్దిపేట, తూప్రాన్‌ వంటి ప్రాంతాల్లో పెద్ద పెద్ద భవనాలు నిర్మిస్తున్నారు. ఎక్కడా కూల్‌రూప్‌ పెయింట్‌ వేయట్లేదు. ఇందిరమ్మ ఇండ్లకు కూల్‌ రూప్‌ పెయింట్‌ వేయించాలనే నిబంధన ఉంది. రాష్ట్రంలో 4 లక్షల ఇందిరమ్మ ఇండ్లు నిర్మించబోతున్నారు. ఇప్పటికే 2 లక్షల వరకు డబుల్‌బెడ్‌రూం ఇండ్లు కట్టారు. వీటికి కూడా కూల్‌ పెయింట్‌ వేసేలా అధికారులు చర్యలు తీసుకోవాల్సి ఉంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -