Wednesday, October 8, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సమాచార హక్కు చట్టం అమలులో జిల్లాను ఆదర్శంగా నిలుపాలి

సమాచార హక్కు చట్టం అమలులో జిల్లాను ఆదర్శంగా నిలుపాలి

- Advertisement -

అవగాహన సదస్సులో కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి
నవతెలంగాణ – నిజామాబాద్ సిటీ 

పారదర్శకత, జవాబుదారీతనం కోసం ఉద్దేశించిన సమాచార హక్కు చట్టాన్ని అన్ని ప్రభుత్వ శాఖలలో సమర్ధవంతంగా అమలు చేస్తూ నిజామాబాద్ జిల్లాను ఆదర్శంగా నిలుపాలని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. ఆర్.టి.ఐ వారోత్సవాలను పురస్కరించుకుని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో బుధవారం జిల్లా స్థాయి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేయగా, అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్, ట్రైనీ కలెక్టర్ కరోలిన్ చింగ్తియాన్ మావీ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. సబ్ కలెక్టర్లు, ఆర్డీఓల నేతృత్వంలో గురువారం నిజామాబాద్, బోధన్, ఆర్మూర్ లలో డివిజనల్ స్థాయిలో, శుక్రవారం తహసిల్దార్ల ఆధ్వర్యంలో అన్ని మండల కేంద్రాలలో మండల స్థాయిలో సమాచార హక్కు చట్టంపై అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలని సూచించారు.

ఈ అవగాహన కార్యక్రమాలకు ఆయా శాఖల పీ.ఐ.ఓలు, ఏ.పీ.ఐ.ఓలు తప్పనిసరిగా హాజరయ్యేలా చూడాలన్నారు. ప్రతి ఒక్కరు సమాచార హక్కు చట్టం గురించి అవగాహన పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందని కలెక్టర్ తెలిపారు. ఆర్.టి.ఐ చట్టంలోని నిబంధనలను చక్కగా ఆకళింపు చేసుకుని, పక్కాగా అమలు అయ్యేలా చిత్తశుద్ధితో కృషి చేయాలని సూచించారు. ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో పౌర సమాచార అధికారి(పీ.ఐ.ఓ), సహాయ పౌర సమాచార అధికారి (ఏ.పీ.ఐ.ఓ), అప్పిలేట్ అధికారి వివరాలతో కూడిన సమాచార హక్కు చట్టం బోర్డును విధిగా ప్రదర్శించాలని ఆదేశించారు. అధికారులు మారిన సందర్భాలలో వెంటదివెంట ఆ సమాచారాన్ని అప్డేట్ చేయాలని అన్నారు. అదేవిధంగా ఆర్.టి.ఐ అమలుకు సంబంధించి తప్పనిసరిగా రిజిస్టర్ ను నిర్వహిస్తూ, ఎప్పటికప్పుడు వివరాలను అందులో పొందుపరచాలని సూచించారు. 4(1బి) రిజిస్టర్లోని సమాచారంతో కూడిన బుక్ లెట్ ను అన్ని కార్యాలయాలలో అందుబాటులో ఉంచాలని, పీరియాడికల్ రిపోర్ట్స్ ను క్రమం తప్పకుండా సేకరించాలని, కనీసం ప్రతి మూడు మాసాలకు ఒకసారి ఆర్.టి.ఐ అమలుపై సమీక్ష జరపాలని అన్నారు. పై అంశాలను పాటిస్తున్నారా, లేదా అన్నది నిశితంగా పర్యవేక్షణ జరుపుతామని కలెక్టర్ తెలిపారు. 

 సమాచార హక్కు చట్టంలోని నిబంధనలను తు.చ తప్పకుండా పాటిస్తూ, దరఖాస్తులను నిర్ణీత కాలవ్యవధి లోపు పరిష్కరించాలని అన్నారు. దరఖాస్తుదారు రెండవ అప్పిలేట్ అథారిటీకి వెళ్లే ఆస్కారం లేకుండా కోరిన సమాచారాన్ని నిర్ణీత ఫార్మాట్ లో అందించాలని, సమాచారం అందించే సమయంలో విచక్షణతో వ్యవహరిస్తూ జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఆర్.టి.ఐ దరఖాస్తుల పరిష్కారంలో నిర్లక్ష్యానికి తావిస్తూ, అనవసర కాలయాపన చేస్తే జరిమానాలకు గురి కావాల్సి వస్తుందని, ఇది పదోన్నతులు, ఇంక్రిమెంట్లు వంటి వాటిపై కూడా ప్రభావం చూపే ప్రమాదం ఉంటుందని అన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని ఆర్.టి.ఐ అమలులో నిర్లిప్త ధోరణికి అవకాశం లేకుండా నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించాలని హితవు పలికారు. దరఖాస్తుదారు కోరిన విధంగా నిర్ణీత వ్యవధిలో పారదర్శకంగా ఖచ్చితమైన సమాచారాన్ని యధాతథంగా అందించాలని అన్నారు. సమాచారం ఇవ్వడానికి తిరస్కరిస్తే అందుకు గల కారణాన్ని స్పష్టంగా తెలియజేయాలని సూచించారు. అవగాహన సదస్సులలో పాల్గొని, ఆర్.టి.ఐ చట్టం గురించి ఆకళింపు చేసుకుని, అన్ని కార్యాలయాలలో పకడ్బందీగా అమలయ్యేలా చూడాలన్నారు.

కాగా, రిసోర్స్ పర్సన్లు కిషన్, కృష్ణాజీ సమాచార హక్కు చట్టంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అవగాహన కల్పించారు. ఆర్.టి.ఐ అమలు విషయంలో సాధారణంగా జరిగే పొరపాట్లు ఏమిటీ, వాటిని ఎలా నియంత్రించుకోవాలి, దరఖాస్తుదారులు కోరిన సమాచారాన్ని అందించే సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి తదితర అంశాల గురించి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ సాయాగౌడ్, నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ సందీప్, కలెక్టరేట్ ఏ.ఓ ప్రశాంత్ అన్ని శాఖల జిల్లా అధికారులు, పీ.ఐ.ఓలు, ఏ.పీ.ఐ.ఓలు తదితరులు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -