– పాక్ ఉగ్రవాద స్థావరాలపైనే భారత్ దాడి
– పాకిస్తాన్‌కు చైనా సహకరిస్తుందనడం అబద్ధం : సీపీఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
మానవాళికి ప్రధాన శత్రువు ఉగ్రవాదం అని సీపీఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ అన్నారు. అది ఏ మతంలో ఉన్నా, ఏ కులంలో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా దానిని సమూలంగా నిర్మూలించాల్సిందేనని చెప్పారు. శనివారం హైదరాబాద్‌లోని మఖ్దూంభవన్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆడపిల్ల కన్నీరు వృధా పోదనీ, ఆపరేషన్ సిందూర్ పేరుతో భారత సైన్యం పక్కా ప్రణాళికతో పాకిస్తాన్ కేంద్రంగా కరుడుగట్టిన ఉగ్రవాదుల స్థావరాలపైనే దాడులు చేసి ధ్వంసం చేయడం ద్వారా భారత్ శక్తిని సైనికులు ప్రపంచానికి చాటారని వివరించారు. సరిహద్దులో ఏపీకి చెందిన అగ్నివీర్ మురళి నాయక్ మరణం సంతాపం, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. ఉగ్రవాదులు ఏ మూలన ఉన్నా మట్టు పెట్టాల్సిందేనని అన్నారు. ఉగ్రవాదుల స్థావరాలపై దాడి క్రమంలో పాకిస్తాన్ సామాన్య ప్రజలకు ఇబ్బందులు కలిగించొద్దన్నదే తన అభిప్రాయమని చెప్పారు. పాకిస్తాన్‌తో యుద్ధం చేస్తున్న నేపథ్యంలో దౌత్యపరంగా ప్రపంచ దేశాలతో మరింత మెరుగైన సంబంధాలను ఏర్పాటు చేసుకోవాలనీ, ఏకం చేయాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించారు. అంతర్జాతీయ ఉగ్రవాది మసూద్ అజార్‌ను భారత్‌కు రప్పించేలా చర్యలు తీసుకోవాలన్నారు. పాకిస్తాన్‌కు చైనా సహకరిస్తుందనేది అపోహ మాత్రమేననీ, ఆ ప్రచారం అబద్ధమని అన్నారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టనున్న కులగణనను స్వాగతిస్తున్నామని చెప్పారు. ఈ ప్రక్రియను నిర్దిష్ట కాలపరిమితిలోగా పూర్తి చేయాలని కోరారు. 2029లో జరిగే సార్వత్రిక ఎన్నికల నాటికి కుల గణన ప్రక్రియను పూర్తి చేసి చట్ట సభల్లో బీసీలకు రిజర్వేషన్లను కల్పించాలని సూచించారు.
అందాల పోటీలా సిగ్గుచేటు
రాష్ట్ర ప్రభుత్వం ప్రపంచ సుందరి పోటీలను హైదరాబాద్‌లో నిర్వహించడం సిగ్గుచేటని నారాయణ విమర్శించారు. మహిళల అందాల పోటీల పేరుతో వ్యాపారం చేస్తారా?అని ప్రశ్నించారు. ఈ పోటీల ద్వారా ఎలాంటి సందేశం ఇస్తున్నారని అడిగారు. యుద్ధంలో ముందున్న కల్నల్ సోఫియా ఖురేషీ, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ ఆదర్శమన్నారు. కార్పొరేట్ సంస్థలకు ఉపయోగపడేందుకే ఈ పోటీలను నిర్వహిస్తున్నారని చెప్పారు. వివిధ దేశాల నుంచి వచ్చిన వారిని పర్యాటక ప్రాంతాలకు తీసుకెళ్లడం సరైంది కాదన్నారు. మగవాళ్లకూ అందాల పోటీలను నిర్వహించాలని కోరారు.
కాల్పుల విరమణను స్వాగతిస్తున్నాం
భారత్-పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణను స్వాగతిస్తున్నామని నారాయణ అన్నారు. పహల్గామ్ దాడిలో పాల్గొన్న ఉగ్రవాదులను భారత న్యాయస్థానానికి అప్పగించాలన్న ప్రతిపాదనను శాంతి చర్చల్లో భారత్ ముందుపెట్టాలి డిమాండ్ చేశారు.
భారత ఆర్మీకి సెల్యూట్ : అజీజ్ పాషా
పాకిస్తాన్‌లోని పలు ప్రాంతాల్లో భారత్ దాడులకు పాల్పడిందని సీపీఐ జాతీయ కార్యదర్శి అజీజ్‌పాషా అన్నారు. పాకిస్తాన్ సుమారు 400 డ్రోన్లను ప్రయోగించగా, వాటిని భారత సైన్యాలు విజయవంతంగా తిప్పికొట్టడం అభినందనీయమని చెప్పారు. సాధారణ పౌరులకు ఎలాంటి ప్రాణ నష్టం జరగకూడదనే లక్ష్యంతో భారత సైన్యాలు ఆర్థరాత్రి తర్వాత కేవలం ఉగ్రవాదుల స్థావరాలను మాత్రమే లక్ష్యంగా చేసుకుని దాడులు చేశారనీ, విజయవంతం చేయడం పట్ల ప్రపంచ దేశాలు హర్షించాయని అన్నారు. భారత ఆర్మీకి సెల్యూట్ చేస్తున్నానని అన్నారు. కసబ్ లాంటి ఉగ్రవాదులు శిక్షణ పొందిన లష్కర్ ఏ తోయిబా, జైషే మహ్మద్, హిజ్బుల్ ముజాహిద్దీన్ అనే ప్రధానమైన ఉగ్రవాద సంస్థల కేంద్రాల్లోకి భారత సైన్యం వెళ్లి ధ్వంసం భారత సైనిక శక్తికి నిదర్శమన్నారు. పాకిస్తాన్ ఏకాకి అయ్యిందనీ, కేవలం టర్కీ మాత్రమే మద్దతుగా నిలిచిందని చెప్పారు.
మానవాళికి శత్రువు ఉగ్రవాదం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES