రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ వెల్లడి
మెటల్-ఆర్గానిక్ ఫ్రేమ్‌వర్క్స్ అభివృద్ధి చేసినందుకు..
స్టాక్‌హౌం : రసాయన శాస్త్రంలో విశేష పరిశోధనలు జరిపిన ముగ్గురు శాస్త్రవేత్తలకు నోబెల్ బహుమతి లభించింది. మెటల్-ఆర్గానిక్ ఫ్రేమ్‌వర్క్స్ అభివృద్ధి చేసినందుకు గాను సుసుము కిటాగవా, రిచర్డ్ రాబ్సన్, ఒమర్ ఎం యాఘీలకు ఈ పురస్కారాన్ని అందించనున్నట్టు రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ వెల్లడించింది. వీరు కొత్తరకం మాలిక్యూలర్ ఆర్కిటెక్చర్‌ను అభివృద్ధి చేసినట్టు తెలిపింది. గతేడాది కూడా ముగ్గురికి ఈ అవార్డు దక్కింది. ప్రోటిన్లపై విశేష పరిశోధనలు చేసిన డేవిడ్ బేకర్, డెమిస్ హసాబిస్, జాన్ జంపర్‌లు ఈ పురస్కారం అందుకున్నారు. మొత్తంగా 1901-2024 మధ్యకాలంలో 116 సార్లు రసాయన శాస్త్రంలో నోబెల్‌ను ప్రకటించగా ఇప్పటివరకు 195 మంది దీనిని అందుకున్నారు.
వీరిలో జాన్ బీ గూడ్‌ఎనఫ్ 97 ఏండ్ల వయసులో కెమిస్ట్రీలో పురస్కారం అందుకున్న వృద్ధుడిగా నిలువగా.. ఫ్రెడెరిక్ జొలియట్ 35ఏండ్ల వయసులో నోబెల్ అందుకున్న అతిపిన్న వయస్కుడిగా నిలిచారు. ఇక ఫ్రెడరిక్ సాంగెర్, బ్యారీ షార్ప్‌లెస్‌లు రసాయన శాస్త్రంలో రెండుసార్లు నోబెల్ అందుకోవడం విశేషం. మరోవైపు సోమవారం (ఈనెల 6న) మొదలైన నోబెల్ పురస్కారాల ప్రకటన అక్టోబర్ 13 వరకు కొనసాగనుంది. తొలుత వైద్యశాస్త్రంలో, మంగళవారం భౌతికశాస్త్రంలో విజేతలను ప్రకటించారు. బుధవారం రసాయనశాస్త్రంలో నోబెల్ గ్రహీతల పేర్లు వెల్లడించారు. గురువారం సాహిత్యం, శుక్రవారం శాంతి బహుమతి, 13న అర్థశాస్త్రంలో ఈ పురస్కారం అందుకోనున్న వారి పేర్లను ప్రకటించనున్నారు. ఆల్‌ఫ్రెడ్ నోబెల్ వర్ధంతి రోజైన డిసెంబర్ 10న విజేతలకు అవార్డులను అందజేస్తారు.
రసాయనశాస్త్రంలో ముగ్గురికి నోబెల్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES