పునరాలోచనలో భారతీయులు
కొండలా పెరుగుతున్న రుణ భారం
హెచ్1బీ వీసాపై దూరమౌతున్న ఆశలు
హెచ్-1బీ వీసా ఫీజు పెంపుతో అయోమయంలో భారతీయ విద్యార్థులు
కొత్త హెచ్-1బీ వీసా దరఖాస్తులపై ఏకంగా లక్ష డాలర్ల ఫీజు విధిస్తూ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయం అనేక మంది భారతీయ విద్యా ర్థులలో అలజడి సృష్టించింది. పెరుగుతున్న రుణ భారం ఒక పక్క, పరిమితంగానే ఉన్న ఉద్యోగావకాశాలు మరో పక్క వారిని కలవర పెడుతున్నాయి. దీంతో వారి అమెరికా కలలు అనిశ్చితిలో పడిపోయాయి. ఎన్నో ఆశలతో అగ్రరాజ్యానికి వెళ్లిన వారు రుణ భారంతో, చెదిరిపోయిన ఆకాంక్షలతో తిరిగి రావాల్సిందేనా అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది.
న్యూఢిల్లీ : సెప్టెంబర్ 21 తర్వాత దాఖలు చేసే హెచ్-1బీ వీసా దరఖాస్తుల ఫీజును పెంచుతూ కార్యనిర్వాహక ఆదేశంపై ట్రంప్ చేసిన సంతకం అంతర్జాతీయ విద్యార్థి సమాజంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. అమెరికా వచ్చే ప్రతి వ్యక్తీ ఎన్నో కలలు కంటాడు. చదువుకోవాలనో, పని చేయాలనో లేదా అమెరికాలోనే నివసించాలనో… ఇలా అనేక కోరికలు కోరుకుంటాడు. అయితే ఆ ఆశలన్నీ అడియాసలుగానే కన్పిస్తున్నాయి.
స్టూడెంట్ వీసాలకు పరిమితులు
స్టూడెంట్ వీసాలపై అమెరికా వెళ్లడానికి మూడు లక్షల మందికి పైగా భారతీయ విద్యార్థులు ఇప్పటికే తమ సొమ్మును వెచ్చించారు. చదువు పూర్తయిన తర్వాత ఉద్యోగం వస్తుందని, హెచ్-1బీ వీసా పొందగలమని, రుణాలు అమెరికాలో తగ్గుతున్న ఉపాధి అవకాశాలు తేలికగా చెల్లించగలమని వారు అనుకున్నారు. అయితే వీసా ఫీజును పెంచుతూ ట్రంప్ తీసుకున్న నిర్ణయం వారి పాలిట అశనిపాతం అయింది. ఎఫ్1 వీసాలపై ఇప్పటికే అనేక పరిమితులు ఉన్నాయి. కోర్సు కాలంలో మొదటి 12 నెలలు ఆఫ్-క్యాంపస్ పనిని అనుమతించరు. ఆ గడువు పూర్తయిన తర్వాత పాఠ్యాంశంలో భాగంగా ఉండే ఆఫ్-క్యాంపస్ పనిని మాత్రమే అనుమతిస్తారు. కోర్సు పూర్తయిన తర్వాత విద్యార్థులు గరిష్టంగా మూడు సంవత్సరాలు పని చేసుకోవచ్చు. అప్పుడు వారి ఎఫ్1 వీసాను తప్పనిసరిగా హెచ్-1బీగా మార్చుకోవాల్సి ఉంటుంది. ఇది జరగా లంటే ఉద్యోగి తరఫున యాజమాన్యం అధికారులకు దరఖాస్తు చేయాలి. ట్రంప్ విధించిన కొత్త నిబంధనల ప్రకారం కంపెనీ అందుకోసం లక్ష డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది. హెచ్-1బీ దరఖాస్తులు ఈ వీసా ఫీజుకు లోబడి ఉంటాయా లేదా అనేది ఇంకా తెలియదు.
దీర్ఘకాల అవకాశాలే గీటురాయి
విద్యార్థికి ఇంటర్న్‌షిప్ అవకాశం లభిస్తే కొంత ఊరట కలుగుతుంది. అయితే పొడిగింపు లభించని విద్యార్థుల పరిస్థితి దారుణంగా ఉంటుంది. వారు క్యాంపస్ బయట పార్ట్ టైమ్ పనులు చేసుకోవాలి. ఉద్యోగిని తీసుకునే ముందు ఏ కంపెనీ అయినా అతని దీర్ఘకాల అవకాశాలను పరిశీలిస్తుంది. అవి లేని అభ్యర్థులను కంపెనీలు పనిలోకి తీసుకోవు. ఎఫ్1 వీసా ఉన్న విద్యార్థిని ఏ కంపెనీ అయినా గరిష్టంగా మూడు సంవత్సరాలు ఉద్యోగంలోకి తీసుకుంటుంది. ఆ కాలంలో విద్యార్థి కోసం హెచ్-1బీ వీసా నిమిత్తం దరఖాస్తు చేస్తుంది. ఇప్పుడు వీసా దరఖాస్తు ఫీజు భారీగా ఉన్నం దున, పైగా స్పష్టత లేనందున ఏ కంపెనీ అయినా విద్యార్థులను ఎందుకు పనిలో పెట్టుకుంటుంది? విద్యాభ్యాసాన్ని పూర్తి చేసి వెంటనే ఉద్యోగం పొందాలనుకుంటున్న వారి పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. ఎందుకంటే అనేక అమెరికా కంపెనీలు అంతర్జాతీయ విద్యార్థులను తీసుకోవడం ఆపేశాయి.
చైనా ఏం చేస్తోంది?
ఎఫ్1 వీసా నిబంధనల ప్రకారం గ్రాడ్యుయేషన్ పూర్తయిన తర్వాత 60 రోజులలో ఉద్యోగాన్ని వెతుక్కోవాలి. లేదా మరో కోర్సులో చేరాలి. రెండు పనులూ చేయలేని వారు తిరిగి స్వదేశానికి రావాల్సిందే తప్ప మరో మార్గం లేదు. మరి తీసుకున్న అప్పును ఎలా తీరుస్తారు?. కొద్ది కాలం క్రితం వరకూ అమెరికా కాలేజీలలో చదువుతున్న అంతర్జాతీయ విద్యార్థులలో చైనా వారే ఎక్కువగా ఉండేవారు. ఇప్పుడు భారతీయ విద్యార్థుల వాటా అధికంగా ఉంటోంది. విదేశాలలో చదువుకు నేందుకు తన విద్యార్థులను చైనా ప్రోత్సహిస్తుంది. మాస్టర్స్ డిగ్రీలు, పీహెచ్‌డీలు పూర్తి చేసుకునేందుకు సాయపడుతుంది. చైనా యూనివర్సిటీలు, పరిశ్రమలలో పని చేయ డానికి అవకాశం కల్పిస్తుంది. ఇప్పుడు భారత్ చేయాల్సింది కూడా అదే.
మోడీ ప్రభుత్వం ఏం చేయాలంటే…
ఏదేమైనా ఉపాధి దొరక్క పుట్టెడు రుణ భారంతో స్వదేశానికి చేరుకునే విద్యార్థుల పరిస్థితి దారుణంగా ఉంటుంది. అప్పులు ఎలా తీర్చాలన్న ఆందోళన వారిని వెన్నాడుతుంది. ఉద్యోగం లేకుండా రిక్తహస్తాలతో తిరిగి వస్తే అప్పు భారమంతా కుటుంబం పైనే పడుతుంది. ఈ పరిస్థితిని ఊహించుకుంటేనే భయానకంగా ఉంటుంది. రుణం సంగతి అటుంచితే జీవనోపాధి మరో పెద్ద సమస్యగా ముందుకు వస్తుంది. ఈ నేపథ్యంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం వెంటనే స్పందించాల్సిన అవసరం ఉంది. హెచ్-1బీ వీసా దరఖాస్తు ఫీజును పూర్వ స్థాయికి తెచ్చేలా ట్రంప్ ప్రభుత్వాన్ని ఒప్పించాలి. భారతీయ విద్యార్థులు విదేశాలలో చదువు ముగించుకొని స్వదేశానికి చేరితే వారికి తగిన ఉపాధి కల్పించాలి. లేనిపక్షంలో వారి ఆశలన్నీ అడియాసలే అవుతాయి.