బాధితులనే అక్రమంగా అరెస్టు చేసిన పోలీసులు
ఏబీవీపీ గూండాలను అరెస్టు చేయాలి : ఎస్‌ఎఫ్‌ఐ డిమాండ్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ (ఇఫ్లూ) హైదరాబాద్ ప్రాంగణంలో విద్యార్థులపై ఏబీవీపీ గూండాలు దాడి చేశారు. ఇఫ్లూ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో పాలస్తీనా ఐక్యత కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సమయంలో పోలీసుల ముందే విద్యార్థులపై ఏబీవీపీ గూండాలు దాడి చేసినా వారు చోద్యం చూసినట్టు తెలుస్తున్నది. పైగా దాడి చేసిన మతోన్మాద గూండాలను వదిలేసి బాధిత విద్యార్థులనే పోలీసులు అక్రమంగా అరెస్టు చేయడం గమనార్హం. అరెస్టు చేసిన విద్యార్థుల వివరాలను ఉస్మానియా విశ్వవిద్యాలయం (ఓయూ) పోలీసులు రహస్యంగా ఉంచారు. ఏబీవీపీ గూండాలను తక్షణమే అరెస్టు చేయాలని భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్‌ఎఫ్‌ఐ) రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షులు ఎస్ రజినీకాంత్, కార్యదర్శి టి నాగరాజు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ దాడిలో విద్యార్థి సంఘం బాధ్యులతోపాటు అనేక మంది విద్యార్థులు గాయపడ్డారని తెలిపారు. ఈ దాడికి నాయకత్వం వహించిన ఏబీవీపీ కార్యకర్తలపై కఠిన చర్యలు తీసుకోవాలనీ, పోలీసులు, అధికార యంత్రాంగం తక్షణమే చర్యలు చేపట్టాలని కోరారు.
దాడి చేసిన ఏబీవీపీ విద్యార్థులను వదిలేసి సామాన్య విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేసే ప్రయత్నం చేశారని విమర్శించారు. ఈ దాడికి నాయకత్వం వహించిన ఏబీవీపీ కార్యకర్తలను రక్షించే పనిని రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పోలీసుల ద్వారా చేపడుతోందని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇజ్రాయిల్‌కు మద్దతు ఇస్తోందా? లేక కాంగ్రెస్ కూడా దేశవ్యాప్తంగా సంఘ్ పరివార్‌లాగే సయోనిస్టు ఇజ్రాయిల్ వైఖరినే అనుసరిస్తోందా? అన్నదానిపై స్పష్టతనివ్వాలని డిమాండ్ చేశారు. ఈ దాడికి నాయకత్వం వహించిన వారిపై రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. విద్యార్థులపై క్రూరంగా దాడి చేసిన పోలీసులపైనా చర్యలు తీసుకోవాలని తెలిపారు. దేశవ్యాప్తంగా ఉన్న వర్సిటీల ప్రాంగణాల్లో పాలస్తీనాలో సయోనిస్టు ఇజ్రాయిల్ చేస్తున్న మారణహోమానికి వ్యతిరేకంగా ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలను చేపడుతున్నామని పేర్కొన్నారు. పోలీసులు అరెస్టు చేసిన విద్యార్ధి వివరాలు తెలపాలని డిమాండ్ చేశారు. దాడి చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.