– మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల
– బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి లేదు
– బీసీ రిజర్వేషన్ లపై హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ఎమ్మెల్యే స్పందన
నవతెలంగాణ-కమ్మర్ పల్లి
కాంగ్రెస్, బీజేపీ పార్టీలు రెండు కలిసి బీసీలను మోసం చేస్తున్నాయని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. బీసీ రిజర్వేషన్ లపై హైకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో ఆయన స్పందించారు.బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ కపట రాజకీయాలు చేస్తూ, న్యాయస్థానాలపై నెపం నెట్టి తప్పించుకునే ప్రయత్నం చేస్తుందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్‌ల అంశంపై కాంగ్రెస్ పార్టీ మరోసారి తమ చిత్తశుద్ధి లేని కపట ప్రేమను బయటపెట్టిందని విమర్శించారు.బీసీ రిజర్వేషన్‌ల పెంపు అంశంలో కాంగ్రెస్ తెలివిగా డ్రామా లాడుతోందని, మేము పెంచాలనుకున్నాం, కానీ కోర్టు అడ్డుపడిందని న్యాయస్థానంపై నెపం వేస్తూ బీసీ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం కాంగ్రెస్ చేస్తోందన్నారు. చెల్లదని తెలిసినా, బీసీలను మభ్యపెట్టే ఉద్దేశంతో రిజర్వేషన్ పెంపు జీ.ఓ జారీ చేసింది కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే అని అన్నారు.
అనంతరం మళ్లీ పార్టీ అనుచరులతోనే కోర్టులో కేసు వేయించి ఆ నిర్ణయాన్ని అడ్డుకోవాలనే కుట్ర చేసింది కాంగ్రెస్సే అన్నారు. ఈ ద్వంద్వ నాటకం ఎవరి కోసం? ఎవరిని పిచ్చోళ్ళని చేయడానికి ఈ డ్రామాలు ఆడుతున్నావ్ రేవంత్ రెడ్డి? అని ప్రశ్నించారు.సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం 50 శాతం కంటే ఎక్కువ రిజర్వేషన్ ఇవ్వాలంటే 10వ షెడ్యూల్ లో చేర్చి రాజ్యాంగ సవరణ తప్పనిసరి చేయాలన్న వాస్తవం తెలిసి కుడా కామారెడ్డి బీసీ డిక్లరేషన్ పేరుతో 42 శాతం అంటూ ఎన్నికల సమయంలో బీసీ ఓట్ల కోసం మోసం చేసిందన్నారు.నేడు కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో లబ్ధి కోసం అదే పాత బీసీ రిజర్వేషన్ డ్రామా మళ్లీ ప్రారంభించిందన్నారు.
రాజ్యాంగ సవరణ కోసం 22 నెలలుగా ఢిల్లీలో పోరాటం చేయకుండా కాంగ్రెస్, గల్లీలో మాత్రం డ్రామాలు ఆడుతుందని విమర్శించారు.ఢిల్లీలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో బీసీ రిజర్వేషన్‌ల పెంపు కోసం ధర్నా చేసినప్పుడు, కాంగ్రెస్ ఆదినాయకత్వం సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, పార్టీ అధ్యక్షులు మల్లిఖార్జున ఖర్గే ఇలా ఏ ఒక్కరూ అక్కడికి రాలేకపోవడం కాంగ్రెస్‌కి బీసీ లపై ఉన్న చిత్తశుద్ధి బయటపడిందన్నారు.బీసీ రిజర్వేషన్ లపై ఉభయ చట్ట సభల్లో తీర్మానం చేసి గవర్నర్‌కి పంపినప్పుడు గవర్నర్ తొక్కిపెట్టడం, గతంలో తీర్మానం చేసి రాష్ట్రపతికి పంపితే రాష్ట్రపతి కుడా ఆమోదం తెలుపక కపోవడం కూడా కేంద్రంలో ఉన్న బీజేపీకి బీసీ లపై ఉన్న చిత్తశుద్ధి కి నిదర్శనం అన్నారు.
బీసీ ప్రధాని అంటూ గొప్పలు చెప్పుకునే మోడీ కూడా, కాంగ్రెస్‌తో కలిసి బీసీ రిజర్వేషన్‌ల పెంపు కాకుండా చేస్తున్నారని ఆరోపించారు.బిఆర్ఎస్ పార్టీ తరఫున స్పష్టంగా చెబుతున్నామని, బీసీ రిజర్వేషన్‌ల పెంపు కోసం ఢిల్లీలో కాంగ్రెస్ నిజాయితీగా పోరాటం చేస్తే, మేము కూడా వారితో కలిసి వస్తామన్నారు. కానీ ప్రజలను మోసం చేసే కపట రాజకీయాలకు తమ పార్టీ సహకరించదన్నారు.ఇకనైన రేవంత్ రెడ్డి బీసీ లను రాజకీయ లబ్ది కోసం వాడుకోకుండా రిజర్వేషన్ ల పెంపుపై చిత్త శుద్ధితో పని చేయాలని ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి డిమాండ్ చేశారు.