- Advertisement -
- – ఒకరి మృతి.. చావు, బతుకుల మధ్య మరొకరు
– పోలీసులకు సవాల్ గా మారిన కేసు - – అనుమానితులను అదుపులోకి తీసుకున్న పోలీసుల
- నవతెలంగాణ – గంగాధర
గంగాధర మండలం గర్శకుర్తి గ్రామానికి చెందిన గజ్జల శంకరయ్య, లక్ష్మి దంపతులపై జరిగిన విషప్రయెాగం ఓ మిస్టరీగానే మారింది. మత్తుమందు ప్రభావమెా, విషప్రయెాగమెా కాని ఇప్పటికే ఒకరు మృతి చెందగా, మరొకరు ఆసుపత్రిలో చావు, బతుకుల మధ్య ఉన్నారు. దీంతో పోలీసులకు క్లూస్ దొరికే పరిస్థితి లేక కేసు పెద్ద సవాల్ గా మారింది. భార్య, భర్తలను టార్గెట్ చేసిన గుర్తు తెలియని వ్యక్తులు దుశ్చర్యకు పాల్పడి మూడు రోజు గడుస్తున్నా ఎవరు చేశారు ? ఎందు కోసం చేశారనే అంశం ప్రశ్నార్థంగానే మిగిలింది. మత్తు మందో, విష తుల్య పదార్థం వల్లో భార్య, భర్తలు చెరో చోట అపస్మారక స్థితిలో పడగా, దుండగులు ఇంట్లో దూరి లక్ష్మి మెడలోని రెండున్నర తులాల బంగారు పుస్తెలతాడు అపహరించినట్టు పోలీసుల విచారణలో వెల్లడైంది.
బంగారు ఆభరణాలు, ఆస్తి కాజేయడానికి ఇద్దరిపై విషప్రయెాగం చేశారా ? లేక దంపతుల వద్ద డబ్బు అప్పుగా తీసుకుని అది తీర్చే మార్గం లేక హతమార్చే ప్రయత్నం చేశారా ? అనే కోణంలో నిఘా పెట్టిన ప్రత్యేక పోలీస్ క్లూస్ టీం, పోలీస్ అధికారులు విచారణను వేగవంతం చేసింది. సంఘటన జరిగిన తీరుపై ఆరా తీసిన పోలీస్ నిఘా విభాగం అధికారులు వృద్ద దంపతులపై జరిగిన విషప్రయెాగంపై ప్రతి చిన్న క్లూన్ వదలకుండా పకడ్బందీగా కేసు దర్యాప్తు కొనసాగుతున్నట్టు సమాచారం. అయితే వృద్ద దంపతులపై జరిగిన విషప్రయెాగంతో గజ్జల శంకరయ్య ఇప్పటికే ప్రాణాలు వదలగా, అతని భార్య లక్ష్మి వెంటిలేటర్ కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతోంది.
విషప్రయెాగంతో దంపతుల ఉసురు తీయడానికి ఒడిగట్టిన ఆ వ్యక్తులెవరనే కోణంలో దర్యాప్తును ముమ్మరం చేసిన పోలీసులు అనుమానితులను అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తుంది. అయితే పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు ప్రచారం సాగుతున్న వ్యక్తులు నోరు విప్పితే తప్పా దంపతుల ఉసురు తీయడానికి ఎందుకు విషప్రయెాగం చేశారనే అంశం వెల్లడి అయ్యే అవకాశం లేదనే విషయం గ్రామంలో చర్చానీయాంశంగా మారింది. ఈ విషయమై ఎస్సై వంశీకృష్ణ ప్రశ్నించగా, విచారణ కొనసాగుతుందని, కేసును చేధించడానికి ముమ్మర ప్రయత్నం చేస్తున్నామన్నారు.
- Advertisement -