హర్షం వ్యక్తం చేస్తున్న రైతులు
నవతెలంగాణ – జగిత్యాల టౌన్
రైల్వే లైను కోసం తీసుకున్న భూములకు రైతులకు పరిహారం చెల్లించకపోవడంతో కోర్టు సీరియస్ అయింది. ఈ మేరకు జగిత్యాల ఆర్డీవో కార్యాలయంలోని సామాగ్రిని కోర్టు ఆదేశాలతో సిబ్బంది జప్తు చేశారు. పెద్దపల్లి –నిజామాబాద్ రైల్వే లైన్ కోసం జగిత్యాల పరిధిలో రైతుల నుంచి సుమారు 100 ఎకరాల భూమిని 23 ఏళ్ల క్రితం ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. ఎకరాకు లక్ష 30 వేల రూపాయలు చొప్పున రైతులకు నష్టపరిహారం అప్పటి ప్రభుత్వం చెల్లించింది. అయితే విలువైన భూములు కావడంతో రైతులు నష్టపోతున్నామని సివిల్ కోర్టును ఆశ్రయించారు.
దీంతో 2010లో సివిల్ కోర్టు రైతులకు ఎకరాకు 10 లక్షల నష్టపరిహారం అందించాలని ఆదేశించారు. ఈ క్రమంలో ఆర్డీవో హైకోర్టును ఆశ్రయించగా విచారణ జరిపిన న్యాయస్థానం 2014లో ఎకరాకు 15 లక్షల నష్టపరిహారం ఇవ్వాల్సిందిగా ప్రభుత్వాన్ని ఆదేశించింది. మరోసారి ఆర్డీవో ప్రభుత్వం తరఫున 2018లో సుప్రీంకోర్టుకు వెళ్ళగా సర్వోన్నత న్యాయస్థానం సివిల్ కోర్టు ఉత్తర్వుల మేరకు ఎకరాకు 10 లక్షల నష్టపరిహారం తో పాటు ఇతరత్రా చార్జీలను రైతులకు నష్టపరిహారంగా ఇవ్వాలని స్పష్టం చేసింది. ఇంతవరకు రైతులకు పూర్తిస్థాయిలో ప్రభుత్వం నష్టపరిహారం ఇవ్వకపోవడంతో బాధిత రైతులు కోర్టును ఆశ్రయించగా ఆగ్రహం వ్యక్తం చేసిన సివిల్ కోర్టు గురువారం జగిత్యాల ఆర్డీవో కార్యాలయంలోని సామాగ్రిని జప్తు చేసింది.