కేంద్రపాలిత ప్రాంతంగా చేసినా జరగని అభివృద్ధి
6వ షెడ్యూల్‌లో చేర్చకుండా కేంద్రం మోసం
తప్పుడు వాగ్దానాలతో బీజేపీ అభాసుపాలు : ఎస్వీకే వెబినార్‌లో సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు యూసఫ్ తరిగామి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
జమ్మూకాశ్మీర్‌లోని లద్దాఖ్ ప్రజల హక్కుల కోసం ఐక్య ఉద్యమాలను నిర్మించాలని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు, ఎమ్మెల్యే మహమ్మద్ యూసఫ్ తరిగామి పిలుపునిచ్చారు. దేశంలోని ప్రజలు అక్కడి వారికి మద్దతుగా నిలబడి ఉద్యమించాలని చెప్పారు. ‘లఢఖ్‌లో ఏం జరుగుతోంది’అనే అంశంపై సుందరయ్య విజ్ఞాన కేంద్రం (ఎస్వీకే) ఆధ్వర్యంలో వెబినార్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1950లోనే భారతీయ జనసంఫ్‌ు వ్యవస్థాపకుడు శ్యాంప్రసాద్ ముఖర్జీ జమ్మూకాశ్మీర్‌కు స్వయంప్రతిపత్తి కల్పించిన ఆర్టికల్ 370ని వ్యతిరేకించారని గుర్తు చేశారు. ఆర్టికల్ 370 ఉండడం వల్ల జాతీయ సమైక్యతకు ఆటంకం కలుగుతుందంటూ ఆనాడే విషబీజాలు నాటారని విమర్శించారు. ఆయన వారసులు 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఆర్టికల్ 370ని రద్దు చేస్తామంటూ ప్రకటించారని అన్నారు. బీజేపీ రెండోసారి అధికారంలోకి రాగానే 2019, ఆగస్టు ఐదున ఆర్టికల్ 370తోపాటు ఆర్టికల్ 35ఏని కూడా రద్దు చేసిందన్నారు.
జమ్మూకాశ్మీర్‌కు ఉన్న ప్రత్యేక స్వయంప్రతిపత్తి, రక్షణలను తొలగించిందని అన్నారు. జమ్మూకు రాష్ట్ర హోదా, లద్దాఖ్, కాశ్మీర్‌లను కేంద్రపాలిత ప్రాంతాలుగా చేసిందని వివరించారు. అయితే లద్దాఖ్ కేంద్రపాలిత ప్రాంతంగా మారితే అభివృద్ధి చెందుతుందంటూ అక్కడి ప్రజలు భావించి సంబరాలు చేసుకున్నారని చెప్పారు. ఉద్యోగాలు వస్తాయనీ, భూములకు రక్షణ ఉంటుందనీ, స్వేచ్ఛగా జీవించొచ్చని ప్రజలు భావించారని అన్నారు. ఈ ప్రాంతాన్ని ఆరో షెడ్యూల్‌లో చేరుస్తాంమంటూ కేంద్రం హామీ ఇచ్చిందన్నారు. కానీ ఆరేండ్లయినా అభివృద్ధి జరగలేదనీ, ఆరో షెడ్యూల్‌లో చేర్చలేదనీ, యువతకు ఉద్యోగాలు రాలేదని వివరించారు. కేంద్రంలోని బీజేపీ పాలకులు పట్టించుకోకుండా అక్కడి ప్రజలకు తప్పుడు వాగ్ధానాలు చేసి మోసం చేశారని విమర్శించారు. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో బీజేపీ విఫలమైందన్నారు. దీంతో బీజేపీ నాయకులు తలదించుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్పారు. ఇప్పుడు ప్రజలు వాస్తవాలు తెలుసుకుని వాగ్ధానాలను అమలు చేయాలంటూ కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు ఉద్యమిస్తున్నారని అన్నారు.
లద్దాఖ్‌ను ఆరో షెడ్యూల్‌లో చేర్చాలంటూ సోనం వాంగ్‌చుక్ ఉద్యమిస్తే ఆయన్ను అరెస్టు చేసి జైలుకు పంపారని విమర్శించారు. ఉద్యమిస్తున్న ప్రజలపై నిర్బంధం ప్రయోగిస్తున్నదనీ, దేశద్రోహులుగా చిత్రీకరిస్తున్నదని చెప్పారు. ఇంకోవైపు ప్రజలను మతం పేరుతో విభజించేందుకు వైషమ్యాలను రెచ్చగొడుతున్నదని అన్నారు. హిందూత్వ రాజకీయాలను ప్రజలు ఐక్యంగా ఓడించాలని పిలుపునిచ్చారు. లద్దాఖ్, జమ్మూ, కాశ్మీర్ ప్రజల ప్రజాస్వామిక హక్కులు, లౌకిక విలువల పరిరక్షణ కోసం ఉద్యమించాలని చెప్పారు. అయితే అక్కడి వనరులను కార్పొరేట్లకు కట్టబెట్టడం కోసం కేంద్రం ప్రయత్నిస్తున్నదని విమర్శించారు. వాటిని తప్పికొట్టాలని అన్నారు. షేక్ అబ్దుల్లా జయంతి సందర్భంగా ఉన్న సెలవు దినాన్ని హరిసింగ్ జయంతికి మార్చి అక్కడ హిందూ, ముస్లిం ప్రజల మనోభావాలతో కేంద్రం చెలగాటమాడుతున్నదని విమర్శించారు. లద్దాఖ్, జమ్మూ, కాశ్మీర్ ప్రజలు హక్కుల కోసం పోరాడుతున్నారనీ, దేశంలోని ప్రజలంతా వారికి అండగా నిలబడాలనీ, సంఘీభావం ప్రకటించాలని కోరారు. ఈ కార్యక్రమానికి ఎస్వీకే మేనేజింగ్ కమిటీ కార్యదర్శి ఎస్ వినయకుమార్ సమన్వయకర్తగా వ్యవహరించారు. తరిగామి ప్రసంగాన్ని ప్రముఖ జర్నలిస్టు కొండూరి వీరయ్య తెలుగులోకి అనువాదం చేశారు.