ఎస్‌ఎఫ్‌ఐ, డివైఎఫ్‌ఐ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ప్రపంచ విప్లవకారుడు, సామ్రాజ్యవాదానికి సింహాస్వప్నం చేగువేరా అని ఎస్‌ఎఫ్‌ఐ, డీవైఎఫ్‌ఐ నేతలు అన్నారు. గురువారం హైదరాబాద్‌లోని ఆ సంఘం కార్యాలయంలో చేగువేరా 58వ వర్థంతి సభ నిర్వహించారు. ఈ సందర్భంగా కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.స్కైలాబ్, టీపీటీఎల్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఎ.విజరు కుమార్, డివైఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి ఆనగంటి వెంకటేష్, ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్ష్య, కార్యదర్శులు ఎస్.రజనీకాంత్, టి.నాగరాజు మాట్లాడారు. ప్రపంచంలో దోపిడీ లేని సమాజం కోసం తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా 39 సంవత్సరాలకే తనువు చాలించాడని గుర్తు చేశారు. చేగువేరా జీవితం నేటి యువత, విద్యార్ధులు అధ్యయనం చేసి సమాజంలో అసమానతలు, దోపిడీ లేని, పేదరికం లేని వ్యవస్థ కోసం పోరాడాలని సూచించారు.
పదవుల కోసం పార్టీలు మారే ఈరోజుల్లో క్యూబా దేశానికి అత్యున్నత పదవిలో ఉండి కూడా దానికి రాజీనామా చేసి బోలివియా స్వాతంత్వ్రం కోసం అమెరికా సైన్యంతో గెరిల్లా పోరాటాన్ని నిర్వహించాడని చెప్పారు. ప్రపంచానికి వైద్యంలో వెన్నుదన్నుగా క్యూబా నిలుస్తుందంటే నాడు చేగువేరా విద్య, వైద్యంపై చేసిన అసమాన కృషి కారణమని తెలిపారు. క్యూబా, వెనిజులా లాంటి దేశాలను అమెరికా అణచివేసేందుకు కుట్రలు చేస్తున్నదని విమర్శించారు. చే స్ఫూర్తితో సామ్రాజ్యవాద దోపిడీకి వ్యతిరేకంగా పోరాడాలని విద్యార్థి యువతరానికి పిలుపునిచ్చారు. సభలో డివైఎఫ్‌ఐ రాష్ట్ర ఉపాధ్యాక్షులు ఎం.డి.జావేద్, రాష్ట్ర నాయకులు రాజు, ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కమిటీ సభ్యులు జె.రమేష్, టీపీటీఎల్‌ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కొమ్ము విజయ్ తదితరులు పాల్గొన్నారు.