ఎస్‌ఈసీ, ప్రభుత్వం సమాలోచనలు
సర్కార్ ముందు మూడు ఆప్షన్లు
హైకోర్టు స్టే కాపీలు అందాక మరోసారి మేధోమథనం
‘స్థానికం’లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై తేలని పంచాయతీ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఊహించిందే జరిగింది. ‘స్థానిక’ పోరు ఆగిపోయింది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల జీవో 9పై హైకోర్టు స్టే విధించింది. ఆరు వారాల పాటు ఎన్నికల నిర్వహణను ఆపాలని ఆదేశించింది. దీంతో గురువారం ఆయా జిల్లాల్లో రిటర్నింగ్ అధికారులు విడుదల చేసిన ఎన్నికల నోటీసులు చెల్లకుండాపోయాయి. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ప్రక్రియకు బ్రేకులు పడ్డాయి. హైకోర్టు ఆదేశాల మేరకు ఎన్నికల ప్రక్రియను నిర్వహిస్తామంటూ రాష్ట్ర ఎన్నికల సంఘం ఏకవాక్యంతో పత్రికా ప్రకటన విడుదల చేసింది. ఈ పరిణామాలన్నీ ప్రభుత్వం, ప్రజలు, రాష్ట్ర ఎన్నికల సంఘం ముందుగా ఊహించినవే! అయితే స్థానిక ఎన్నికల నిర్వహణ విషయంలో రేవంత్‌రెడ్డి సర్కార్ ముందు మూడు ఆప్షన్లు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. (1) ఎన్నికల నోటిఫికేషన్ విడుదయ్యాక, ఆ ప్రక్రియలో న్యాయస్థానాలు జోక్యం చేసుకోవడం సరిగాదంటూ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ, సుప్రీం కోర్టుకు వెళ్ళడం.
(2) హైకోర్టు సూచన మేరకు కౌంటర్ దాఖలు చేసి ఆరువారాలు నిరీక్షించడం (3) తెలంగాణ పంచాయతీరాజ్ యాక్టు-2018 ప్రకారం పాత పద్ధతిలో బీసీలకు రిజర్వేషన్లు కేటాయించి, పార్టీ పరంగా మిగతా స్థానాల్లో బీసీ అభ్యర్థులను నిలిపి ఎన్నికలకు వెళ్లడం. వీటిపైనే ప్రభుత్వం ప్రధానంగా దృష్టి కేంద్రీకరిస్తోంది. రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా తాము విడుదల చేసిన నోటిఫికేషన్‌ను రద్దు చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించింది. దీనితో ఎన్నికలు అధికారికంగానే వాయిదా పడినట్టు అయ్యింది. అయితే రాష్ట్రంలో స్థానిక సంస్థలకు దాదాపు రెండేండ్లుగా పాలకమండళ్లు లేకపోవడంతో కేంద్రం నుంచి రావాల్సిన రూ.3 వేల కోట్ల నిధులు ఆగిపోయాయి. అన్నీ అనుకున్నట్టు జరిగితే మళ్లీ స్థానిక ఎన్నికలు ఈ ఏడాది డిసెంబర్, లేదా 2026 జనవరిలోగా నిర్వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రభుత్వం కూడా ఆ దిశగానే మరోసారి ప్రణాళికల్ని రూపొందిస్తున్నట్టు సమాచారం.
ఎవరిదారి వాళ్లదే..
బీసీ సామాజిక తరగతుల్లో తమకు చెడ్డపేరు రావద్దనే ఉద్దేశంతో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్‌ఎస్ నేతలు ఒకరిపై ఒకరు రాజకీయ విమర్శలు ఎక్కుపెట్టుకుంటున్నారు. అసెంబ్లీలో 42 శాతం రిజర్వేషన్ల అమలుకు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపిన ఈ పార్టీలన్నీ, ఇప్పుడు పొలిటికల్ మైలేజ్ కోసం పాకులాడుతున్నాయి. కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చేందుకు ప్రభుత్వం చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేసిందని కాంగ్రెస్ నేతలు ప్రచారం చేసుకుంటున్నారు. బీజేపీ కోర్టులోకి బంతిని నెట్టాం కాబటికట, ఈ విషయంలో వారే నిర్ణయం తీసుకోవాలనే ఎదురుదాడికి సిద్ధపడుతోంది. ఈ వ్యవహారంలో బీజేపీ కూడా గోడమీది పిల్లిలా ఉంది.
బీసీ బిల్లు న్యాయ ప్రక్రియలో వేలుపెడితే దేశవ్యాప్తంగా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఇదే తరహా రిజర్వేషన్ల డిమాండ్లు వస్తాయని భయపడుతోంది. అదే సమయంలో 42 శాతం రిజర్వేషన్ల క్రెడిట్ కాంగ్రెస్‌కు వెళ్లకుండా ఎక్కడికక్కడ రాజకీయ విమర్శలు చేస్తోంది. కేంద్రంలోని మోడీ సర్కార్‌ను పల్లెత్తుమాట అనని బీఆర్‌ఎస్ కాంగ్రెస్‌పైనే విమర్శనాస్త్రాలు ఎక్కుపెడుతోంది. ఈ మూడు పార్టీల వ్యవహారశైలిని సీపీఐ(ఎం), సీపీఐ, ఇతర వామపక్ష పార్టీలు సహా బీసీ సంఘాలు కూడా తప్పుబడుతున్నాయి. చివరకు బీసీ రిజర్వేషన్ల బిల్లు విషయంలో ‘ఊరంతా శాఖాహారులే…గంప కింది కోడి మాయం’ అన్నట్టే తయారైంది.