Friday, October 10, 2025
E-PAPER
Homeప్రధాన వార్తలుస్థానికానికి బ్రేక్‌

స్థానికానికి బ్రేక్‌

- Advertisement -

హైకోర్టు మధ్యంతర ఆదేశాలు
ప్రభుత్వానికి, ఎస్‌ఈసీకి నోటీసులు
విచారణ 6 వారాలకు వాయిదా
అన్ని ఇంప్లీడ్‌ పిటీషన్లు విచారిస్తాం
‘స్టే’ కారణాలతో పూర్తి ఉత్తర్వులు ఇస్తాం
బీసీ రిజర్వేషన్‌ జీవో 9, ఎలక్షన్‌ నోటిఫికేషన్‌పై స్టే

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో 9ని, రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) జారీ చేసిన ఎన్నికల నోటిఫికేషన్‌ అమలును నిలిపివేస్తూ హైకోర్టు స్టే ఉత్తర్వులు జారీ చేసింది. స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించే ప్రక్రియను నిలిపివేయాలని ఆదేశించింది. బీసీ రిజర్వేషన్ల పెంపు రాజ్యాంగ వ్యతిరేకమనీ, రాష్ట్ర ప్రభుత్వం చట్ట వ్యతిరేకంగా రిజర్వేషన్ల పెంపు నిర్ణయం తీసుకుందంటూ దాఖలైన పలు వ్యాజ్యాల్లో ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. ‘స్టే’ కారణాలతో పూర్తి ఉత్తర్వులు ఇస్తామని తెలిపింది.సామాజిక కార్యకర్త బుట్టెంగారి మాధవరెడ్డి, పెద్దపల్లి జిల్లా మహాముత్తారం మండలం, కమ్మపల్లి గ్రామానికి చెందిన సముద్రాల రమేష్‌, సిద్ధిపేట జిల్లా కొండూరుకు చెందిన జల్లపల్లి మల్లవ్వ, నల్లగొండ జిల్లా చింతపల్లికి చెందిన గోరటి వెంకటేష్‌ ఇతరులు వేర్వేరుగా దాఖలు చేసిన పిటిషన్లలో ప్రతివాదులైన బీసీ సంక్షేమ, పంచాయతీ రాజ్‌, సాధారణ పరిపాలన, న్యాయ శాఖల ముఖ్య కార్యదర్శులకు, రాష్ట్ర ఎన్నికల సంఘానికి నోటీసులు జారీ చేసింది.

పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించింది. నాలుగు వారాల్లోగా తమ వాదనలతో కౌంటర్లు దాఖలు చేయాలని ప్రతివాదులను ఆదేశించింది. ప్రభుత్వం వేసే కౌంటర్లల్లోని అంశాలపై అభ్యంతరాలు ఉంటే పిటిషనర్లు రిప్లై కౌంటర్లను రెండు వారాల్లోగా దాఖలు చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. విచారణను ఆరు వారాలకు వాయిదా వేసింది. ప్రధాన పిటిషన్లను విచారణకు అనుమతిచ్చింది. ఈ కేసుల్లో ఇంప్లీండ్‌ అయిన 30 పిటిషన్లను విచారిస్తామని పేర్కొంది. ఎన్నికలను నిలిపివేస్తూ స్టే ఉత్తర్వుల జారీకి కారణాలను వివరిస్తూ, పూర్తి వివరాలతో తర్వాత మధ్యంతర తీర్పును వెలువరిస్తామని ప్రకటించింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అపరేశ్‌ కుమార్‌ సింగ్‌, జస్టిస్‌ జిఎం మొహియుద్దీన్‌లతో కూడిన డివిజన్‌ బెంచ్‌ గురువారం మధ్యంతర ఉత్తర్వులు వెలువరించింది.

ఏజీ వాదనలు
ఈ సందర్భంగా ప్రభుత్వం తరఫు వాదనను అడ్వకేట్‌ జనరల్‌ (ఏజీ) సుదర్శన్‌రెడ్డి, సుప్రీం కోర్టు సీనియర్‌ న్యాయవాది రవివర్మ కుమార్‌ వాదనలు వినిపించారు. కులగణన, రాష్ట్ర జనాభా, పెరిగిన బీసీల జనాభా, సామాజిక న్యాయం, డెడికేటెడ్‌ కమిషన్‌ ఏర్పాటు, అసెంబ్లీలో అన్ని పార్టీలు ఏకగ్రీవంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్‌కు ఆమోదం తెలుపడం, గవర్నర్‌ బిల్లును రాష్ట్రపతికి పంపడం, అక్కడ పెండింగ్‌ ఉండటం వంటి అన్ని విషయాలను ఆయన న్యాయస్థానానికి వెల్లడించారు. నిర్ణీత సమయంలోపు బిల్లుపై గవర్నర్‌ నిర్ణయం తీసుకోనందున దాన్ని ఆమోదించినట్టే పరిగణించాలని చెప్పారు. ఇప్పటికే ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడిందనీ, అది షెడ్యూల్‌ మాత్రమేనన్న పిటిషనర్ల వాదన వాస్తవం కాదన్నారు. రాజ్యాంగంలోని 243 (ఓ) ప్రకారం ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడ్డాక ఎన్నికల ప్రక్రియలో కోర్టుల జోక్యానికి వీల్లేదన్నారు. పిటిషనర్లు జీవో 9ని మాత్రమే సవాల్‌ చేశారనీ, ఎన్నికల నోటిఫికేషన్‌ను సవాల్‌ చేయలేదని గుర్తు చేశారు.

పెంచిన బీసీ రిజర్వేషన్లతో కలిపి మొత్తం రిజర్వేషన్లు 67 శాతానికి చేరడం వల్ల ఎవరికీ ఎలాంటి నష్టం జరగదన్నారు. రాష్ట్రంలో ఎస్టీలు 10.43 శాతం, ఎస్సీలు 17.42 శాతం, బీసీలు 57.6 శాతం చొప్పున ఉన్న జనాభా రిజర్వేషన్ల మొత్తం 50 శాతానికి మించరాదనే వాదన అన్యాయమన్నారు. ఈ మూడు వర్గాల జనాభాకు 67 శాతం రిజర్వేషన్లు అమలు చేశాక మిగిలిన 33 శాతం పదవులను కేవలం 15 శాతం ఉన్న ఉన్నత కులాలకు దక్కడం అనేది కూడా అన్యాయమేనన్నారు. ఇప్పటి వరకు 50 శాతం పదవులను 15 శాతమున్న అగ్ర కులాల వాళ్లు అనుభవిస్తున్నారనీ, ఈ నేపథ్యంలో ప్రభుత్వం బీసీలకు రిజర్వేషన్లను 42 శాతానికి పెంపుదల చేయడం వల్ల వచ్చే నష్టమేమీ రాదని వాదించారు. తమిళనాడులో 69 శాతం రిజర్వేషన్లను అమలు చేస్తున్న విషయాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలన్నారు. ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రక్రియ యథాతథంగా కొనసాగాలనీ, ఎలాంటి మధ్యంతర స్టే ఆదేశాలు జారీ చేయవద్దని కోరారు.

స్టే ఇవ్వండి-పిటిషనర్ల వాదన
పిటిషనర్ల తరఫు సీనియర్‌ న్యాయవాదులు మయూర్‌రెడ్డి, జె.ప్రభాకర్‌, కె.వివేక్‌రెడ్డి ఇతరులు వాదనలు వినిపిస్తూ, పంచాయతీరాజ్‌ చట్ట నిబంధనలను ఉల్లంఘిస్తూ ఆ శాఖ కార్యదర్శి జీవో 9ని జారీ చేయడంతో మొత్తం రిజర్వేషన్లు 67 శాతానికి చేరిందన్నారు. ఇది రాష్ట్ర ప్రభుత్వం చేసిన చట్టానికి, సుప్రీం కోర్టు తీర్పునకు విరుద్ధమన్నారు. కోర్టు తీర్పుల ప్రకారం రిజర్వేషన్లు 50 శాతానికి
మించరాదన్నారు. ఈ సందర్భంగా వారు పలు అంశాలు, సుప్రీంకోర్టు తీర్పులను ప్రస్తావించారు. 1987లో 44 శాతం రిజర్వేషన్లను కల్పిస్తే నాటి ఉమ్మడి ఏపీ హైకోర్టు కొట్టేసిందన్నారు. ఏకసభ్య కమిషన్‌ నివేదిక గురించి ప్రస్తావిస్తూ ప్రజలకు తెలియకుండా నిర్వహించిన సర్వే చెల్లదన్నారు.

బీసీ జనాభా బాగా పెరిగినందున రిజర్వేషన్లు పెంచినట్లు ప్రభుత్వం చెబుతోందనీ, రాష్ట్రంలో ఎస్సీలు, ఎస్టీల జనాభా కూడా పెరిందనీ, వారికి మాత్రం రిజర్వేషన్లు పెంచలేదన్నారు. 2024నాటి బీసీ జనాభా లెక్కలను పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీల జనాభా లెక్కలకు 2011 గణాంకాలనే ప్రామాణికంగా తీసుకోవడం ద్వారా వారికి తీరని అన్యాయం చేసిందన్నారు. ఇరుపక్షాల వాదనల అనంతరం హైకోర్టు, జీవో 9, అందుకు అనుగుణంగా వెలువడిన ఎన్నికల నోటిఫికేషన్ల అమలును నిలిపివేస్తూ స్టే ఆదేశాలిచ్చింది. ప్రభుత్వానికి, రాష్ట్ర ఎన్నికల సంఘానికి నోటీసులిచ్చింది. తదుపరి విచారణను ఆరు వారాలకు వాయిదా వేసింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -