హంగేరియన్ రచయితకు దక్కిన గౌరవం
స్టాక్‌హౌం : సాహిత్యం(లిటరేచర్)లో ఈ ఏడాదికి గానూ నోబెల్ బహుమతి సాధించిన వారి పేర్లను నోబెల్ కమిటీ ప్రకటించింది. సాహిత్యంలో విశేష కృషి చేసిందుకు హంగేరియన్ రచయిత లాజ్లో క్రాస్నాహౌర్కైకు ఈ పురస్కారం దక్కింది. ప్రపంచ వినాశన భయాల నేపథ్యంలోనూ కళకు ఉన్న శక్తిని ధృవీకరించే ఆయన ఆకర్షణీయమైన, దార్శనిక రచనలకు గానూ నోబెల్ పురస్కారానికి ఎంపిక చేసినట్టు స్వీడిశ్ అకాడమీ ప్రకటించింది.
లాజ్లో క్రాస్నాహౌర్కై రచనలు ఆధునిక ప్రపంచంలో ని గందరగోళాన్ని, భయాన్ని లోతుగా విశ్లేషిస్తూనే.. మానవ అనుభవాన్ని, కళకు ఉన్న శక్తిని అద్భుతంగా ఆవిష్కరిస్తాయని వివరించింది. ఈ అత్యున్నత గౌరవం ఆయన సాహితీ ప్రయాణంలో మరో మైలురాయిగా నిలిచిందని పేర్కొన్నది. గతేడాది దక్షిణ కొరియా రచయిత్రి హాన్ కాంగ్‌కు ఈ బహుమతి లభించిన విషయం విదితమే. 1901 నుంచి 2024 వరకు 117 సార్లు సాహిత్యంలో నోబెల్ బహుమతిని ప్రకటించారు. ఇందులో ఇప్పటి వరకు 18 మంది మహిళలు ఈ పురస్కారం అందుకున్నవారిలో ఉన్నారు.
క్రాస్నాహౌర్కై నేపథ్యం
ఈయన 1954లో ఆగేయ హంగేరీలోని గ్యులా అనే చిన్న పట్టణంలో రొమేనియన్ సరిహద్దుకు సమీపంలో జన్మించారు. ఆయన మొట్టమొదటి నవల 1985లో ప్రచురించారు. దాని పేరు ‘సాటంటాంగో’. ఈ రచన హంగేరీలో సంచలనం సృష్టించింది. ఆ తర్వాత ఆయన రాసిన ‘హెర్ష్ట్ 07769’ జర్మన్ దేశంలోని సామాజిక అశాంతిని చిత్రీకరించింది. ఈ రచనను గొప్ప సమకాలీన జర్మన్ నవలగా పాఠకులు అభివర్ణించారు. అపోకలిప్టిక్ భయానక పరిస్థితుల మధ్య కళ శక్తిని పునరుద్ఘాటించే ఆయన దార్శనిక కృషికి నోబెల్ బహుమతి వరించింది. ఈనెల 6 (సోమవారం) నుంచి వివిధ రంగాల్లో నోబెల్ బహుమతులు సాధించిన వారి పేర్లను కమిటీ ప్రకటిస్తూ వస్తున్నది.
సోమవారం వైద్య రంగంలో, మంగళవారం భౌతిక శాస్త్రం, బుధవారం రసాయన శాస్త్రంలో నోబెల్ గ్రహీతల పేర్లను వెల్లడించారు. గురువారం సాహిత్యంలో నోబెల్ గ్రహీత పేర్లను ప్రకటించారు. ఇక శుక్రవారం శాంతి బహుమతి, 13న అర్థశాస్త్రంలో ఈ పురస్కారం అందుకోనున్నవారి పేర్లను ప్రకటించనున్నారు. స్వీడన్‌కు చెందిన సైంటిస్ట్, ఇంజినీర్, వ్యాపారవేత్తగా పేరు పొందిన ఆల్‌ఫ్రెడ్ నోబెల్ వర్ధంతి సందర్భంగా డిసెంబర్ 10న గ్రహీతలకు ఈ అవార్డులను ప్రదానం చేయనున్నారు. ఆ రోజు జరగనున్న వేడుకల్లో నోబెల్ విజేతలుగా నిలిచిన వారికి బహుమతితో పాటు 10 లక్షల డాలర్లు (అంటే రూ.8.8 కోట్లు) అందిస్తారు. ఆల్ఫ్రెడ్ నోబెల్ 1896లో మరణించగా.. 1901 నుంచి నోబెల్ ట్రస్ట్ ద్వారా ఈ అవార్డులను ఏటా ప్రదానం చేస్తున్నారు. ఈ ఏడాది ఈనెల 6 నుంచి మొదలైన ఈ నోబెల్ గ్రహీతల పేర్ల ప్రకటనలు 13 వరకు కొనసాగనున్నాయి.