చెన్నైలో శ్రేసన్ ఫార్మా యజమాని అరెస్ట్
కోడంబాక్కంలోని నివాసంలో రంగనాథన్‌ను అదుపులోకి తీసుకున్న మధ్యప్రదేశ్ సిట్
చెన్నై : దేశవ్యాప్తంగా సంచలనాన్ని రేకెత్తించిన కోల్డ్‌రిఫ్ దగ్గు మందు కేసులో కీలక పరిణామం చోటు చేసుకున్నది. కోల్డ్‌రిఫ్ సిరప్‌ను తయారు చేస్తున్న శ్రేసన్ ఫార్మా కంపెనీ యజమాని రంగనాథన్ అరెస్టయ్యారు. గురువారం ఉదయం మధ్యప్రదేశ్ పోలీసులు ఆయనను చెన్నైలో అదుపులోకి తీసుకున్నారు. వివరాళ్లోకెళ్తే.. శ్రేసన్ ఫార్మా తయారు చేసిన కోల్డ్‌రిఫ్ దగ్గు మందును తాగిన తర్వాత మధ్యప్రదేశ్‌లో 20 మందికి పైగా చిన్నారులు మృతి చెందారని ఆరోపణలున్నాయి. దీంతో పోలీసులు రంగనాథన్‌పై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. ఇందులో భాగంగా ప్రత్యేక దర్యాప్త బృందాన్ని ఏర్పాటు చేశారు.సిట్ గురువారం ఉదయం రంగనాథన్‌ను అరెస్ట్ చేసింది.
కోడంబాక్కంలోని ఆయన ఇంటి నుంచి రంగనా థన్‌ను అదుపులోకి తీసుకున్నారు. మధ్యప్రదేశ్ సిట్‌కు చెన్నై అశోక్‌నగర్ పోలీసులు సహకరించారు. ఆయన అరెస్ట్ అనంతరం సిట్, చెన్నై పోలీసులు కలిసి కాంచీపురంలోని కంపెనీ మ్యానుఫాక్షరింగ్ యూనిట్‌లో రికార్డులు, శాంపిళ్లను పరీక్షించటానికి సోదాలు జరిపారు. రంగనాథన్‌పై మధ్యప్రదేశ్ పోలీసులు భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్), ఇతర చట్టాల్లోని పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. తదుపరి దర్యాప్తును కొనసాగిస్తున్నారు. చెన్నై-బెంగళూరు రహదారి వెంట ఉన్న రంగనాథన్ మ్యానుఫాక్షరింగ్ కంపెనీని సీల్ చేశారు. కోడంబాక్కంలోని ఆయన రిజిస్టర్డ్ ఆఫీస్ మూతబడింది. కాగా ఈ కేసులో మరిన్ని అరెస్ట్‌లు జరగొచ్చని తెలుస్తున్నది.
రాజస్తాన్‌లోనూ కోల్డ్‌రిఫ్ దగ్గు మందు తాకిన కారణంగా చాలా మంది చిన్నారులు మరణించారని ఆరోపణ లున్నాయి. ఈ దగ్గు మందు తాగిన తర్వాత పిల్లల కిడ్నీలు ఇన్‌ఫెక్షన్‌కు గురైనట్టు తెలుస్తోంది. ఈ పరిస్థితుల నేపథ్యం లో దేశంలోని అన్ని రాష్ట్రాలూ కోల్డ్‌రిఫ్ దగ్గు మందు వినియోగాన్ని నిషేధిం చాయి. ఈ మందును చిన్న పిల్లల్లో జలుబు, దగ్గు వంటి లక్షణాలను నివారించేందుకు వాడతారు. అయితే ఈ మందుపై ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం దాని శాంపిల్స్‌ను సేకరించి పరీక్షించింది. ఆ తర్వాత వచ్చిన ల్యాబ్ రిపోర్ట్‌లు ఆ మందు ప్రమాద కరమైనదని నిర్ధారించాయి.
సుప్రీంకోర్టులో పిల్.. విచారణకు న్యాయస్థానం ఓకే
కోల్డ్‌రిఫ్ దగ్గు మందు మరణాలపై సుప్రీంకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది. ఈ పిల్‌ను విచారించటానికి న్యాయస్థానం అంగీకరించింది. న్యాయవాది విశాల్ తివేరి ఈ పిల్ వేశారు. ఈ కేసును తక్షణమే విచారించాలని అభ్యర్థించారు. దీనిని పరిగణలోకి తీసుకున్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ బి.ఆర్. గవారు, న్యాయమూర్తులు జస్టిస్ ఉజ్జల్ భుయాన్, జస్టిస్ కె. వినోద్ చంద్రన్‌లతో కూడిన ధర్మాసనం సదరు అభ్యర్థనను సమీక్షించింది. దీనిపై నేడు (శుక్రవారం) విచారణ జరిపేందుకు సమ్మతించింది.