Friday, October 10, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంబీజేపీ, బీఆర్‌ఎస్‌లకు బీసీ రిజర్వేషన్లు ఇష్టం లేదు

బీజేపీ, బీఆర్‌ఎస్‌లకు బీసీ రిజర్వేషన్లు ఇష్టం లేదు

- Advertisement -

ఒక్కరు కూడా ఆ కేసులో ఇంప్లీడ్‌ కాలేదు
విమర్శలే తప్ప నిర్ధిష్టంగా ఏం చేయాలో చెప్పడం లేదు
ప్రజలను తప్పుదోవ పట్టించేలా కాంగ్రెస్‌ సర్కారుపై విమర్శలు
హైకోర్టు తీర్పు డాక్యుమెంట్‌ కాపీలు వచ్చిన తర్వాత కార్యాచరణ : టీపీసీసీ అధ్యక్షులు మహేశ్‌ కుమార్‌గౌడ్‌

నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వడం బీజేపీ, బీఆర్‌ఎస్‌ పార్టీలకు ఇష్టం లేదని టీపీసీసీ అధ్యక్షులు మహేశ్‌ కుమార్‌గౌడ్‌ విమర్శించారు. అందుకే ఆ పార్టీలకు చెందిన ఏ ఒక్క నేత ఆ కేసులో ఇంప్లీడ్‌ కాలేదని చెప్పారు. ఆ రెండు పార్టీలు బీసీల నోటికాడి ముద్దలాగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ ప్రభుత్వంపై విమర్శలు చేయడమే తప్ప నిర్ధిష్టంగా రిజర్వేషన్ల విషయంలో ఏం చేయాలో చెప్పడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీలను, రాష్ట్ర ప్రజలను తప్పుదోవ పట్టించేలా రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైకోర్టు తీర్పు డాక్యుమెంట్‌ కాపీలు వచ్చిన తర్వాత కార్యాచరణ ప్రకటిస్తామని చెప్పారు. గురువారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్‌, వాకిటి శ్రీహరి, ఇతర ముఖ్య నేతలతో కలిసి ఆయన విలేకర్లతో మాట్లాడారు. కోర్టు తీర్పులకు, చట్టాలకు కాంగ్రెస్‌ కట్టుబడి ఉందన్నారు. హైకోర్టులో బీసీలకు 42శాతం రిజర్వేషన్లపై కోర్టు స్టే ఇచ్చిందని తెలిపారు.

ఆ తీర్పు కాపీలు వచ్చిన తర్వాత స్పందిస్తామని చెప్పారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చేందుకు చిత్తశుద్ధితో అనేక కార్యక్రమాలను నిర్వహించామని గుర్తు చేశారు. బ్రిటీష్‌ ప్రభుత్వం శాస్త్రీయ బద్ధంగా కుల సర్వే చేసిందని గుర్తు చేశారు. ఆ ఆధారంగానే 42శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని కృతనిశ్చయంతో పని చేస్తున్నామని చెప్పారు. రిజర్వేషన్లకు లిమిట్‌ పెడుతూ బీఆర్‌ఎస్‌ సర్కారు చట్టం చేసిన విషయాన్ని గుర్తు చేశారు. బీఆర్‌ఎస్‌ అడుగడుగునా బీసీలను అణగదొక్కిందని తెలిపారు. కాంగ్రెస్‌ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్‌ను ప్రకటించి, అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ దిశగా ముందుకు పోతున్నామన్నారు. అందులో భాగంగానే 42 శాతం రిజర్వేషన్లను అమలు చేసేలా జీవో జారీ చేసినట్టు తెలిపారు. ఏడాది క్రితమే స్థానిక ఎన్నికలు జరగాల్సి ఉన్నప్పటికీ రిజర్వేషన్లు అమలు చేసిన తర్వాతనే ఎన్నికలను నిర్వహిస్తామన్నారు. సీఎం, మంత్రులతోసహా ఢిల్లీ వెళ్లి జంతర్‌మంతర్‌ వద్ద ధర్నా చేసిన విషయాన్ని గుర్తు చేశారు.

బీసీ సంఘాలు, కుల సంఘాలు ధర్నా చేస్తే బీజేపీ, బీఆర్‌ఎస్‌ పార్టీలు ఎందుకు ధర్నా చేయలేదని ప్రశ్నించారు. ఎట్టి పరిస్థితుల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేసి తీరుతామని స్పష్టం చేశారు. బీసీలకు వ్యతిరేకంగా ఉన్న ఆ పార్టీలు చరిత్రలో ద్రోహులుగా మిగిలిపోతాయని చెప్పారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ 2018లో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రిజర్వేషన్‌ కటాఫ్‌ 50శాతం చేస్తూ చట్టం చేసిందని గుర్తు చేశారు. ఓబీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలం టూ ఆనాటి ప్రభుత్వం ప్రయత్నం చేయలేదని విమర్శిం చారు. ఇప్పుడు కాంగ్రెస్‌ పార్టీపై బీఆర్‌ఎస్‌, బీజేపీ నిందలు వేస్తున్నాయని చెప్పారు. శాసనసభలో చేసిన బీసీ రిజర్వేషన్ల బిల్లు గవర్నర్‌ దగ్గర పెండింగ్‌లో ఉందనీ, ఆ బిల్లును ఆపుతున్నది బీజేపీ ప్రభుత్వం కాదా? అని ప్రశ్నించారు. మూడు నెలలైన ఆ బిల్లుపై గవర్నర్‌ ఎలాంటి నిర్ణయం తీసుకోకపోతే అది చట్టంగా మారినట్టేననీ, అందుకే జీవో ఇచ్చామని తెలిపారు. కులసర్వేలో కూడా పాల్గొనని ఆ పార్టీలు ఇప్పుడు మాట్లాడుతున్నాయని విమర్శించారు. న్యాయ స్థానాల్లోనూ, రాజకీయంగా పోరాడి బీసీలకు రిజర్వేషన్లు అమలు చేసి తీరుతామని ఆయన చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -