ఛేదనలో నదిన్ డిక్లర్క్ అసమాన ఇన్నింగ్స్
3 వికెట్ల తేడాతో సఫారీ అమ్మాయిల గెలుపు
టీమ్ ఇండియాకు తప్పని తొలి పరాజయం
ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్
విశాఖపట్నం-నవతెలంగాణ
ఐసీసీ మహిళల వన్డే వరల్డ్‌కప్‌లో ఆతిథ్య భారత్‌కు భంగపాటు. గురువారం విశాఖపట్నంలో జరిగిన గ్రూప్ దశ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా చేతిలో భారత్ 3 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. 252 పరుగుల లక్ష్యాన్ని దక్షిణాఫ్రికా అమ్మాయిలు 48.5 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి ఛేదించారు. టీమ్ ఇండియా పేసర్లు, స్పిన్నర్లు సమిష్టిగా మెరవటంతో ఛేదనలో దక్షిణాఫ్రికా బ్యాటర్లకు ఆరంభంలో కళ్లెం పడింది. 81/4తో సఫారీ అమ్మాయిలు ఓటమి అంచుల్లో కూరుకున్నారు. ఓపెనర్ బ్రిట్స్ (0), సునె లుస్ (5), మారిజానె కాప్ (20), బాచ్ (1), జాఫ్టా (14)లు తేలిపోయారు. ఓపెనర్ లారా (70, 111 బంతుల్లో 8 ఫోర్లు) టాప్ ఆర్డర్‌లో ఒంటరి పోరాటం చేసింది. సహచర బ్యాటర్లు నిష్క్రమించినా.. ఓ ఎండ్‌లో స్కోరు బోర్డును ముందుకు నడిపించింది. లారాను క్రాంతి గౌడ్ అవుట్ చేయటంతో సఫారీ కథ ముగిసిందనే అనుకున్నారు. కానీ నదిన్ డిక్లర్క్ (84 నాటౌట్, 54 బంతుల్లో 8 ఫోర్లు, 5 సిక్స్‌లు) అజేయ అర్థ సెంచరీతో చెలరేగింది.
మరో టెయిలెండర్ చోలె ట్రైయాన్ (49, 66 బంతుల్లో 5 ఫోర్లు)తో కలిసి కీలక భాగస్వామ్యం నమోదు చేసిన నదిన్.. ఆయబోంగ ఖాకా (1 నాటౌట్) తోడుగా ఒత్తిడిని జయిస్తూ ఆఖరు ఓవర్లలో అదరగొట్టింది. క్రాంతి గౌడ ఓవర్లో వరుస సిక్సర్లు, ఫోర్‌తో సఫారీల వైపు మ్యాచ్‌ను లాగేసిన నదిన్.. ఆమన్జోత్ కౌర్ ఓవర్లో రెండు సిక్సర్లు సంధించి లాంఛనం ముగించింది. మరో 7 బంతులు ఉండగానే దక్షిణాఫ్రికా మెరుపు విజయం నమోదు చేసింది. అంతకుముందు, తొలుత బ్యాటింగ్ చేసిన భారత మహిళల జట్టు 49.5 ఓవర్లలో 251 పరుగులకు ఆలౌటైంది. ఓ దశలో 102/6తో కష్టాల్లో కూరుకున్న హర్మన్‌ప్రీత్ సేన.. వికెట్ కీపర్ రిచా ఘోష్ (94, 77 బంతుల్లో 11 ఫోర్లు, 4 సిక్స్‌లు), స్నేహ్ రానా (33, 24 బంతుల్లో 6 ఫోర్లు) మెరుపులతో భారీ స్కోరు చేసింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (9), జెమీమా రొడ్రిగస్ (0), దీప్తి శర్మ (0), ఆమన్జోత్ కౌర్ (13) సహా స్మతీ మంధాన (23) నిరాశపరిచారు. ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టిన నదిన్ డిక్లర్క్ (84, 2/52) ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు అందుకుంది. ప్రపంచకప్ గ్రూప్ దశలో భారత్ తన తర్వాతి మ్యాచ్‌లో ఆదివారం విశాఖలోనే ఆస్ట్రేలియాతో తలపడనుంది.