బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టుకు వెళ్లాలి : బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్.రాంచందర్‌రావు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్ 9పై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులపై కాంగ్రెస్ సర్కారుదే బాధ్యత అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్.రాంచందర్‌రావు అన్నారు. గురువారం హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. చిత్తశుద్ధి లేకుండా వ్యవహరించిన కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యమే ఈరోజు ఓబీసీలు ఎదుర్కొంటున్న దురవస్థకు కారణమని తెలిపారు. బీసీలకు న్యాయం జరిగేలా కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే సుప్రీంకోర్టుకు వెళ్లి, న్యాయపరమైన లొసుగులను సరిచేసుకోవాలని డిమాండ్ చేశారు. ఆగస్టు 31న అసెంబ్లీ ఆమోదించిన బిల్లును గవర్నర్‌కు పంపినప్పటికీ, గవర్నర్ నిర్ణయం తీసుకోవడానికి ఉన్న మూడు నెలల గడువు ముగియకముందే ప్రభుత్వం ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసిందని విమర్శించారు.
దేశ అత్యున్నత న్యాయస్థానం గవర్నర్‌కు పంపిన బిల్లులపై మూడు నెలల్లో నిర్ణయం తీసుకోవాలని స్పష్టంగా పేర్కొన్నప్పటికీ, ఆ గడువు పూర్తికాకముందే ప్రభుత్వం తొందరపడి ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేయడం చట్టవిరుద్ధమని పేర్కొన్నారు. బీసీ రిజర్వేషన్లను కాంగ్రెస్ సర్కారు రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నదని విమర్శించారు. కాంగ్రెస్ తమ తప్పులను కప్పిపుచ్చుకునేందుకు ”బీజేపీ అడ్డుకుంటోంది” అని తప్పుడు ప్రచారం చేస్తున్నదన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు తమ పార్టీ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. మధ్యప్రదేశ్‌లో 57 శాతం రిజర్వేషన్ల కోసం బీజేపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పోరాడుతున్న విషయాన్ని ప్రస్తావించారు. బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లను వ్యతిరేకిస్తూ హైకోర్టులో పిటిషన్లు వేసినవారు కాంగ్రెస్ పార్టీకి చెందినవారేనని రాంచందర్ రావు ఆరోపించారు.
కాంగ్రెస్ సర్కారుదే బాధ్యత
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES