Wednesday, April 30, 2025
Homeమానవిహాట్ స‌మ్మ‌ర్ లో కూల్‌గా..

హాట్ స‌మ్మ‌ర్ లో కూల్‌గా..

మే నెల రాకముందే ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. అలా కాసేపు బయటికి వెళ్లినా ఒంట్లోని శక్తి మొత్తం ఎవరో స్ట్రా వేసి పీల్చినట్లే అనిపిస్తుంది. ఇక వేసవి తాపం కారణంగా డీహైడ్రేషన్‌, వడ దెబ్బ, అతిసారం వంటి అనేక ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి. ఇలా వేసవితో ముడిపడి ఉండే ఇటువంటి సమస్యలకు బార్లీ, మజ్జిగతో చెక్‌ పెట్టొచ్చు. అలాగే ఈ వేడిని తట్టుకోలేక పిల్లలు ఎక్కువగా ఐస్‌క్రీం అడుగుతుంటారు. అలాంటప్పుడు ఇంట్లోనే ఆరోగ్యకరంగా ఐస్‌క్రీం కూడా చేసి పెట్టొచ్చు.
బార్లీ జావ
ఉపయోగాలు: బార్లీలో శరీర వేడిని తగ్గించి తక్షణ శక్తిని అందించే గుణాలు పుష్కలంగా ఉంటాయి. దీనిలో కాల్షియం, ఫైబర్‌, ఇనుము, మెగ్నీషియం, మాంగనీస్‌, జింక్‌, కాపర్‌,  విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు మెండుగా ఉంటాయి. ఈ పోషకాలు గుండె ఆరోగ్యం, అజీర్తి, డీహైడ్రేషన్‌, డయాబెటిస్‌ కంట్రోల్‌తో పాటు బరువు తగ్గడానికి ఉపయోగపడతాయి.
కావాల్సిన పదార్థాలు: బార్లీ – ఒకటిన్నర గ్లాసు, నీళ్లు – 3 గ్లాసులు, ఉప్పు – రుచికి సరిపడా,  పెరుగు – గ్లాసు, పచ్చిమిర్చి – 4, క్యారెట్‌ తురుము – కొద్దిగా, అల్లం – చిన్న ముక్క, కొత్తిమీర తరుగు – కొద్దిగా, నూనె – అర చెంచా, ఆవాలు – అర చెంచా, జీలకర్ర – అర చెంచా, ఇంగువ – చిటికెడు.
తయారీ విధానం: ముందుగా కుక్కర్‌లోకి బార్లీ తీసుకుని శుభ్రంగా కడగాలి. ఆ తర్వాత ఒక గ్లాసుకు బార్లీకి రెండు గ్లాసుల వాటర్‌ పోసుకోవాలి. అంటే ఇక్కడ గ్లాసున్నర కాబట్టి మూడు గ్లాసుల వాటర్‌ పోసుకోవాలి. తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసి మూత పెట్టి మీడియం ఫ్లేమ్‌లో మూడు విజిల్స్‌ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఈలోపు పచ్చిమిర్చి, అల్లం, కొత్తిమీరను సన్నగా కట్‌ చేసుకోవాలి. అలాగే క్యారెట్‌ సగ భాగాన్ని సన్నగా తురుముకుని పక్కన ఉంచాలి. బార్లీ ఉడికిన తర్వాత స్టవ్‌ ఆఫ్‌ చేసి పూర్తిగా చల్లార్చుకోవాలి. తర్వాత ఉడికించిన బార్లీని మిక్సీజార్‌లోకి తీసుకుని కచ్చాపచ్చాగా గ్రైండ్‌ చేసుకోవాలి. ఒకవేళ ఈ మిశ్రమం కాస్త గట్టిగా అనిపిస్తే రుబ్బుకునేటప్పుడు కొన్ని నీళ్లు పోసుకోవచ్చు. బార్లీని గ్రైండ్‌ చేసుకుని ఓ గిన్నెలోకి తీసుకోవాలి. అందులోకి పెరుగు, మరో గ్లాస్‌ వాటర్‌ పోసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత కొత్తిమీర తరుగు, క్యారెట్‌ తురుము వేసి మిక్స్‌ చేసుకుని పక్కన ఉంచాలి. స్టవ్‌ ఆన్‌ చేసి కడాయి పెట్టి నూనె వేసుకోవాలి. ఆయిల్‌ కాగిన తర్వాత ఆవాలు, జీలకర్ర వేసి వేయించాలి. ఆ తర్వాత ఇంగువ వేసి మగ్గించాలి. చివరగా పచ్చిమిర్చి, అల్లం తరుగు వేసి ఓ నిమిషం వేపి బార్లీలో కలుపుకోవాలి. తాలింపును బార్లీలో కలిసేలా కలుపుకుని సర్వ్‌ చేసుకుంటే ఎండాకాలం ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే బార్లీ జావ రెడీ.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img