– ఐసిడిఎస్ భీంగల్ ప్రాజెక్టు సిడిపిఓ స్వర్ణలత
– ఉప్లూర్ లో భీంగల్ ప్రాజెక్టు స్థాయిలో పోషణ మాసం కార్యక్రమం
నవతెలంగాణ-కమ్మర్ పల్లి
అంగన్వాడీ కేంద్రాలను ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని ఐసిడిఎస్ భీంగల్ ప్రాజెక్టు సిడిపిఓ స్వర్ణలత అన్నారు. శుక్రవారం మండలంలోని ఉప్లూర్ శ్రీ బాల రాజేశ్వర స్వామి ఆలయ ధర్మశాల వద్ద భీంగల్ ప్రాజెక్ట్ స్థాయిలో పోషణ మాసం కార్యక్రమాన్ని సిడిపిఓ స్వర్ణలత ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఇందులో భాగంగా గ్రామంలోని అంగన్వాడి కేంద్రాల పరిధిలోని గర్భిణీలు, బాలింతలు, చిన్నారులు, తల్లులను ఆహ్వానించి వారు తీసుకుని పోషకాహారం పై అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా సిడిపిఓ స్వర్ణలత మాట్లాడుతూ ఆకుకూరలు, కూరగాయలు, బెల్లం, క్యారెట్లు, ఆలుగడ్డలు పిల్లలకు అన్ని రకాలతో కూడిన పోషకాహారాన్ని ఆహారంగా పెట్టాలని, అప్పుడే పిల్లలు ఆరోగ్యంగా పెరగడానికి అవకాశం ఉంటుందని తల్లులకు వివరించారు.అర్హులైన ప్రతి ఒక్కరు అంగన్వాడి కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. అంగన్వాడి కేంద్రాల ద్వారా క్రమం తప్పకుండా చిన్న పిల్లలకు పాలు, గుడ్డు, ఆకుకూరలతో కూడిన పౌష్టికాహారాన్ని అందించడం జరుగుతుందన్నారు. గర్భిణులు కూడా అంగన్వాడి కేంద్రాలకు వచ్చి ఇక్కడ అందించే పౌష్టిక ఆహారాన్ని తీసుకోవాలని సూచించారు. నలుగురితో కలిసి మంచి విషయాలను మాట్లాడుకుంటే పుట్టబోయే బిడ్డలు కూడా ఆరోగ్యవంతులుగా పుడతారని పేర్కొన్నారు.
చిన్నపిల్లలను అంగన్వాడీ కేంద్రాలకు పంపితే ఆటలు,ఆట బొమ్మలతో, పాటలతో కూడిన విజ్ఞానాన్ని అంగన్వాడీ టీచర్లు అందిస్తారన్నారు.అనంతరం పోషణ మోసం కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఐసిడిఎస్ మండల పర్యవేక్షకురాలు గంగ హంస ఆధ్వర్యంలో స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బాలికలకు వ్యాసరచన పోటీలు, అంగన్వాడికి విచ్చేసి చిన్నారులకు పరుగు పందెం పోటీలు నిర్వహించి బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏసిడిపిఓ జ్ఞానేశ్వరీ, బ్లాక్ కోఆర్డినేటర్ ప్రశాంత్, భీంగల్ ప్రాజెక్టు పరిధిలోని ఆయా మండలాల పర్యవేక్షకులు, కమ్మర్ పల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యురాలు డాక్టర్ హఫీనా, పర్యవేక్షకులు మారుతి, అంగన్వాడీ టీచర్లు, తదితరులు పాల్గొన్నారు.