విచక్షణ జ్ఞానం గల మనిషిని మాదకద్రవ్యాలు మృగంగా మార్చేస్తూ, ప్రజా ఆరోగ్యానికి, శాంతి భద్రతలకు ప్రథమ శత్రువులుగా పరిణమించాయి. గంజాయి, హెరాయిన్, కొకైన్, మెఫీడ్రిన్ వంటి పదార్థాలు నిత్యం ఏదో ఓ చోట పట్టుబడుతూనే ఉన్నాయి. అదే సమయంలో ఎన్నో రెట్లు ఎక్కువ పరిమాణంలో మత్తు పదార్థాలు సురక్షితంగా గమ్యస్థానాలకు చేరి వినియోగ దారుల చెంతకు చేరుతున్నాయి. విదేశాల నుంచి భారత్‌లోకి చొరబాట్ల ద్వారా ప్రవేశిస్తున్న ఈమత్తు పదార్థాలకు తోడు, స్థానిక పరిశ్రమల్లో గుట్టు చప్పుడు కాకుండా జరుగుతున్న డ్రగ్ తయారీ దందాలు దేశ భవిష్యత్తుకు తీవ్రమైన ముప్పుగా మారాయి. ఇటీవల హైదరాబాద్‌లోని చర్లపల్లి ప్రాంతంలో పోలీసుల దాడిలో కోట్ల రూపాయల విలువైన మెఫీడ్రిన్ మత్తుమందు, ముడిసరుకులు స్వాధీనం కావడం ఈ వ్యవస్థీకృత నేరాల విస్తృతిని సూచిస్తోంది. గుజరాత్, రాజస్థాన్ వంటి రాష్ట్రాల్లో కూడా ఇలాగే రూ.230 కోట్ల విలువైన డ్రగ్స్ ఉత్పత్తి సామగ్రి పట్టుబడింది.ఇవన్నీ ప్రాణాధార ఔషధాల ముసుగులో జరుగుతున్న నేర కార్యకలాపాలు. వీటిని సమూలంగా అరికట్టకపోతే దేశాన్ని అనారోగ్యం, అల్లకల్లోలం వైపు నెడతాయి. పాఠశాలల నుండి విశ్వవిద్యాలయాల వరకు, వృత్తి, సాంకేతిక విద్యాలయాల వరకు మత్తుమందుల ప్రభావం విస్తరిస్తోంది.
యువతలో ‘ఒత్తిడి’ తగ్గించుకోవడం పేరుతో లేదా స్నేహితుల ప్రోత్సాహంతో డ్రగ్స్ వైపు అడుగులు వేస్తున్నారు. ఉన్నత విద్యావంతులు, డాక్టర్లు, ఇంజినీర్లు సైతం ఈ మాదక రక్కసి కబంధహస్తాల్లో చిక్కి విలవిల్లాడుతున్నారు. మత్తు అలవాటుతో మానసిక స్థైర్యం కోల్పోయి నేరాలకు పాల్పడడం, ఆత్మహత్యలు చేసుకోవడం వంటి ఘటనలు పెరుగుతున్నాయి. డ్రగ్స్ ట్రీట్మెంట్ క్లినిక్‌లకు వెళ్లేవారి సంఖ్య ఐదేండ్లలో పదమూడు వందల శాతం పెరిగిందని గణాంకాలు చెబుతున్నాయి. ఇండోర్, ముంబై, చెన్నై, లక్నో వంటి నగరాల్లో ఈ మహమ్మారి విస్తరిస్తూ ఉంది. మన రాష్ట్రంలోనే మత్తు మార్కెట్ విలువ దాదాపు రూ.వెయ్యి కోట్లకు పైగా ఉందని అధికారులు చెబుతున్నారు. పట్టుబడుతున్న మత్తుమందులు మొత్తం వ్యాపారంలో పది శాతానికి కూడా చేరవు. స్థానికంగా ఉత్పత్తి అవుతున్న గంజాయి, లాటిన్ అమెరికా నుంచి చేరే హెరాయిన్, అలాగే ఔషధ కర్మాగారాల రూపంలో తయారవుతున్న రసాయన డ్రగ్స్ మార్కెట్లో సులభంగా లభ్యమవుతున్నాయి. ప్రస్తుతం నలభై నాలుగుకు పైగా రకాల మత్తు పదార్థాలు వినియోగంలో ఉన్నాయని అధికారుల అంచనా.
ఇటీవల మహారాష్ట్ర పోలీసులు చర్లపల్లి పారిశ్రామికవాడలో రూ.పన్నెండు కోట్ల విలువైన మత్తు మందులు స్వాధీనం చేసుకోవడం, గత ఏడాది రూ.139 కోట్లు, ఈ ఏడాది జూలై వరకు రూ.68 కోట్ల విలువైన డ్రగ్స్ ఈగల్ అధికారులు పట్టుకోవడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తున్నాయి. పట్టణాలు, నగరాల ప్రతి మూలలో గంజాయి మత్తులో తేలుతున్న యువతను చూడడం ఇప్పుడు సాధారణ దృశ్యమైంది.హైదరాబాద్‌లో ఖరీదైన హెరాయిన్, కొకైన్ డ్రగ్స్‌తో పార్టీలు నిర్వహించడం ‘ఫ్యాషన్’గా మారింది. ముఠాలు మొదట ఉచితంగా సరఫరా చేసి, తరువాత ఆ వ్యక్తులను అమ్మకందారులుగా మార్చే వ్యూహం అవలంబిస్తున్నాయి. ప్రభుత్వం కట్టడి చర్యలు ఫలితాలనివ్వడం లేదు. అధికారుల కన్నుగప్పి వ్యాపారం విస్తరిస్తూనే ఉంది. 2023లో ఈగల్ అధికారులు 104.75 గ్రాముల కొకైన్ స్వాధీనం చేసుకోగా, 2024లో అది 336.56గ్రాములుగా పెరిగింది. అలానే హెరాయిన్ విషయంలో కూడా ఇదే ధోరణి 2023లో 419 గ్రాములు, 2024లో 2,160.67 గ్రాములు పట్టుబడ్డాయి. నిన్నటికి నిన్న వ్యాసం రాస్తుండగానే హైదరాబాద్‌లో నిషేధిత ఎఫి డ్రీన్ మత్తు పదార్థాన్ని భారీగా తయారు చేసి విక్రయించేందుకు సిద్ధమైన ముఠాను తెలంగాణ ఈగల్ (ఎలిటీ యాక్షన్ గ్రూప్ ఫర్ డ్రగ్ లా ఎన్ ఫోర్స్‌మెంట్) పట్టుకుంది.220 కిలోల ఎఫీడ్రిన్ ను స్వాధీనం చేసుకుంది. దీని విలువ దాదాపు రూ. 72 కోట్ల విలువ అంతర్జాతీయ మార్కెట్లో ఉంటుందని తెలుస్తోంది. ఈ పరిస్థితులు,గణాంకాలు భయంకర దిశను చూపుతున్నాయి.
ఇలా ఊడలు దిగిన డ్రగ్స్ విషవ్యాపారాన్ని నిర్మూలించాలంటే? కేంద్రం అన్ని రాష్ట్రాలు కలిసికట్టుగా పని చేయాలి. దీనికి సంబంధించిన ముడి సరుకులు ఎక్కడినుంచి వస్తున్నాయి, ఏ ప్రాంతాల్లో మత్తు మందులను ఎలా తరలిస్తున్నారు? అనే అంశాలపై లోతుగా ఆరా తీయాలి.ఆ రవాణా వ్యవస్థను పూర్తిగా విచ్ఛిన్నం చేయాలి. దేశవ్యాప్తంగా అన్ని పారిశ్రామిక ల్యాబ్‌ల కార్యకలాపాలపై ఎప్పటికప్పుడు గమనిస్తుండాలి. డ్రగ్స్ కేసులను పకడ్బందీగా దర్యాప్తు చేసేలా సిబ్బందికి తగిన శిక్షణ అందించాలి. దీని వెనుక అసలు సూత్రధారులను కటకటాల్లోకి నెట్టడం అత్యవసరం. వారికి వెంటనే కఠిన శిక్షలు పడాలంటే డ్రగ్స్ కేసుల విచారణ ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయాలి. నిర్లక్ష్యం వహిస్తే భావితరం ఇంకా బలహీనమై జాతి భవిష్యత్తు అగమ్య గోచరంగా మారుతుంది. పాఠశాలలు, కళాశాలలు, సమాజ సంస్థలు డ్రగ్ అవగాహన కార్యక్రమాలను తరచుగా నిర్వహించి యువతను మేలుకొలపాలి.ప్రభుత్వం కఠిన చట్టాలతో పాటు పునరావాస కేంద్రాల ద్వారా మత్తుకు బానిసలైన వారికి సహాయం చేయాలి. ఇదే సమయంలో సమాజం కూడా నిర్లక్ష్యంగా ఉండకూడదు. ప్రతి పౌరుడు ఈ సమస్యపై బాధ్యతగా స్పందిస్తేనే రేపటి తరాన్ని రక్షించగలం.
- మేకిరి దామోదర్,9573666650