Sunday, October 12, 2025
E-PAPER
Homeమానవిసోషల్‌ మీడియాతో జాగ్రత్త

సోషల్‌ మీడియాతో జాగ్రత్త

- Advertisement -

పియ్రమైన వేణు గీతికకు
నీతో ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది. నీకూ పండగ సెలవులు ఉండటంతో ఇద్దరం ఇంట్లో కలిసి కబుర్లు చెప్పుకోవడంతో సమయం గడిచిపోయింది. మన మాటల్లో సోషల్‌ మీడియా గురించి చర్చ వచ్చింది. ఈ సోషల్‌ మీడియా కొంత మంచికి ఉపయోగపడితే, ఎక్కువ శాతం చెడు వైపుకే దారితీస్తోంది. ఇందులో అన్ని వయసుల వారూ ఉంటారు. ముఖ్యంగా ఫేస్‌బుక్‌లో అయితే చెప్పాల్సిన పనే లేదు. ఏదో ఒక పోస్ట్‌ పెట్టికాని మంచం దిగని వారూ ఉన్నారు.

అయితే సోషల్‌ మీడియాలో మనకు తెలియని కొన్ని విషయాలు తెలుసుకోవచ్చు. ఉదాహరణకు పర్యాటక స్థలాలు, మంచి రచయితలు, ఆరోగ్య సలహాలు, అవగాహన సదస్సులు మొదలైనవి. కానీ ఏది కూడా వేలం వెర్రి కాకూడదు. వ్యక్తిగత విషయాలు ఎప్పుడూ పోస్ట్‌ చేయకూడదు. కొందరైతే వాళ్ళు కొనుక్కున్న బట్టలు పోస్ట్‌ చేస్తుంటారు కొందరు ఇంట్లో వస్తువులు ఏవి ఎక్కడ ఉన్నాయో చెప్తూ పోస్ట్‌ చేస్తారు. ఇటువంటివి చాలా ప్రమాదం. ఇదొక ఓపెన్‌ స్కై. దీంతో ఎవరైనా పోస్టింగ్స్‌ చూడవచ్చు. కొందరు పట్టించుకుంటారు, కొందరు ఒక కామెంట్‌ పెట్టి ఊరుకుంటారు.
ముఖ్యంగా సోషల్‌ మీడియా వాడకంలో అమ్మాయిలు చాలా జాగ్రత్తగా ఉండాలి. సోషల్‌ మీడియా వాడండి, ఒక మంచి పని గురించి, మీరు తెలుసుకున్న కొత్త విషయం ఉంటే దాని గురించి పంచుకోవచ్చు. నేనూ సోషల్‌ మీడియా వాడతాను. అయితే అందులో కేవలం నా ట్రస్ట్‌ ద్వారా చేసిన, చేయబోయే కార్యక్రమాల గురించి, నేను రాసిన ఆర్టికల్స్‌, కార్యక్రమాల ఫొటోలు, ఆహ్వాన పత్రికలు వంటివి మాత్రమే పోస్ట్‌ చేస్తాను. నా వ్యక్తిగత విషయాలు అస్సలు పోస్ట్‌ చేయను.

నువ్వు కూడా సోషల్‌ మీడియా విషయంలో నియంత్రణలో ఉంటావు. ఏదైనా అనుమానం వస్తే వెంటనే నాకు చెప్తావు, లేదా బ్లాక్‌ చేస్తావు. అయినా మన వ్యక్తిగత విషయాలు ప్రపంచానికి బహిర్గతం చేయాల్సిన అవసరం ఏముంది? ఏది ఎంత వరకు ఉండాలో అంత వరకు ఉంటే బాగుంటుంది. సమస్యలు కొని తెచ్చుకోవద్దు. ముక్కు మొహం తెలియని వాళ్ళు ప్రేమిస్తున్నామంటే నమ్మి ఇంట్లోంచి వెళ్లిపోయిన ఆడపిల్లలు ఎందరో ఉన్నారు. ఏ విషయమైనా పెద్దలకు చెప్పాలి. తల్లిదండ్రులు కూడా ఒక కంట కనిపెడుతూ ఉండాలి. డబ్బు పోతే సంపాదించుకోవచ్చు. జీవితం పోతే తిరిగిరాదు నాన్న. ఏది చెప్పినా బిడ్డలు బాగుండాలనే పెద్దలు చెప్తారు. వారి మాటలు కోపం తెప్పించినా ఒక్కసారి ఆలోచించి చూస్తే మీకే అర్ధమవుతుంది. పెద్దల అనుభవాలు పిల్లలకు పాఠాలు. వుంటాను నాన్న, జాగ్రత్తగా ఉండు.
ప్రేమతో మీ అమ్మ
పాలపర్తి సంధ్యారాణి

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -