Sunday, October 12, 2025
E-PAPER
Homeఎడిట్ పేజిజ్ఞాననేత్రం

జ్ఞాననేత్రం

- Advertisement -

నారాయణుడి నామస్మరణ చేస్తూ వైకుంఠంలోకి ప్రవేశించాడు నారదుడు. యధావిధిగానే యోగనిద్రలో ఉన్న శ్రీహరి పాదములు లక్ష్మీదేవి ఒత్తుతూ ఉన్నది.
”నారాయణ” అంటూ నారదుడు ఆది దంపతులకు నమస్కరించాడు.
నారదుడి పిలుపునకు శ్రీహరి మేల్కొన్నాడు. ”బహుకాల దర్శనము నారదా!” అన్నాడు.
”కలహములు పెట్టుటకు కారణములు దొరకక నారదుడు కన్పించుట లేదేమో స్వామి!” అన్నది లక్ష్మీదేవి నవ్వుతూ.
”ఎంతమాట తల్లీ! నావల్ల ఏర్పడ్డ కలహములన్నీ లోకకల్యాణానికే కదా! ఇక ఈ కలియుగములో నన్నుమించిన వారెందరో తయారయ్యారు! వారందరూ సొంత కల్యాణం కోసమే కులం, మతం, ప్రాంతం, దేశం, జాతి అంటూ కయ్యములు పెట్టుచున్నారు. వారితో పోటీ పడలేకపోతున్నాను తల్లీ!” అంటూ నారదుడు తన బాధను వెళ్లబోసుకున్నాడు.
”నిజమే నారదా నీకు బొత్తిగా పనిలేకుండా పోయింది!” అన్నది లక్ష్మి.

”అవును తల్లీ! అందుకే వార్తలు మాత్రమే అందచేస్తూ అటూ ఇటూ తిరుగుతున్నాను!” అన్నాడు నారదుడు నీరసంగా.
”ఇంతకీ ఇప్పుడేమి వార్త మోసుకుని వచ్చావు నారదా?” అడిగింది లక్ష్మీదేవి.
”గత పక్షం రోజులుగా శ్రీవారి పేరు మారుమోగు పోవుచున్నది. ఆ విషయం శ్రీవారి చెవిలో వేద్దామని ఇటు వచ్చితిని తల్లీ!” అన్నాడు నారదుడు.
”కలియుగములో కూడా శ్రీవారిని తలచుకుంటున్నారా? రాముడిని, కృష్ణుడిని తప్ప నేరుగా శ్రీవారిని ఎవరూ తలుచుకొనే పరిస్థితి లేదు కదా! రామకృష్ణులను కూడా గుళ్లు, గోపురాల కోసమే పట్టించుకుంటున్నారు కదా!” అన్నది లక్ష్మీదేవి.
”చిత్తం! ఇప్పుడు శ్రీవారిని కూడా అందుకే తలుచుకున్నారు తల్లీ!” అన్నాడు నారదుడు.

”ఏమిటీ శ్రీవారికి గుడి కడుతున్నారా? ఎవరు కడుతున్నారు? ఎందుకు కడుతున్నారు? నిస్వార్థంగా మానవులు ఏ పుణ్యకార్యము చేయరు కదా!” అన్నది లక్ష్మీదేవి.
”తల్లీ విషయము మొత్తం వివరిస్తాను! అవధరించండి! ఖజురహోలో శ్రీవారి విగ్రహము తల ఎవరో ఎపుడో విరగ్గొట్టారు! అట్టి తలను తిరిగి శ్రీవారి విగ్రహానికి అతికించే విధంగా మరమ్మతులు చేయమంటూ ఒక న్యాయవాది కోర్టులో కేసు వేయగా, దాన్ని విచారించిన న్యాయమూర్తి ఈ కేసు పురావస్తు శాఖకు సంబం ధించినది, ఇందులో ప్రజల ప్రయోజనం ఏమీ లేదు. ఇది మీ ప్రచారం కోసం వేసిన కేసు అని కొట్టేశారు!” అన్నాడు నారదుడు.

”ఇందులో తప్పేమి ఉంది! భక్తి ఉన్నవారెవరైనా ఆ పనిచేయవచ్చు. కోర్టులో కేసు వేసిన న్యాయవాదే చేయవచ్చు. దానికై కోర్టు తలుపు తట్టవలసిన అవసరమేమున్నది?” అన్నది లక్ష్మీదేవి.
”తల్లీ పూర్తిగా వినండి! ఈ కేసు విచారణ సందర్భంగా న్యాయమూర్తి కూడా అదే వ్యాఖ్యలు చేశారు. మీరు విష్ణుమూర్తి భక్తుడే కదా! మీ భక్తితో విష్ణుమూర్తిని ధ్యానించి, సమస్య పరిష్కారం చేసు కోవచ్చు కదా! అని న్యాయవాదిని ఉద్దేశించి న్యాయమూర్తి అన్నారు! ఆ వ్యాఖ్యలు పెద్దదుమారాన్ని లేపాయి. సనాతన ధర్మాన్ని ఆక్షేపిస్తారా? అని న్యాయమూర్తిపై పత్రికలు, టీవీలలో పెద్దఎత్తున చర్చలు జరుగుతున్నాయి. ఇదిలా ఉండగానే న్యాయస్థానంలో ఉన్న అదే న్యాయమూర్తిపై మరో న్యాయవాది తన పాదరక్షను విసిరాడు. సనాతన ధర్మాన్ని అవమానించి నందుకే ఆ న్యాయమూర్తిపై పాదరక్షను విసి రానని, ఇదే తన నిర్ణయం కాదని, దేవుడు ఆదేశిస్తే, తాను పాటించానని, మరోసారి ఆదేశిస్తే, మరో సారి పాటిస్తానని సదరు న్యాయవాది అన్నాడు” అని వివరించాడు నారదుడు.
”మరి న్యాయమూర్తి ఎలా స్పందించాడు?” ఆసక్తిగా అడిగింది లక్ష్మీదేవి.

”ఇలాంటి ఘటనలకు తాను స్పందించనని, తన ఏకాగ్రతను దెబ్బతీయవని చెబుతూ, కోర్టులో తన విధులను కొనసాగించారు!” అన్నాడు నారదుడు.
”శెహభాష్‌!” అంటూ చప్పట్లు కొట్టింది లక్ష్మీదేవి.
”తల్లి ఏమిటిది?” మీరు ఇలా స్పందిస్తారని నేనూహించ లేదు?” అన్నాడు నారదుడు ఆశ్చర్యంగా.
”న్యాయమూర్తి నిజంగా అభినందించవలసిన పనినే చేశాడు. అలనాడు భృగుమహర్షి అహంకారంతో, శ్రీవారి గుండెల మీద అంటే నా నివాసస్థలాన్ని తన్నినాడు! నాకు ఎంతో ఆగ్రహం కలిగింది! అయినా శ్రీవారు ఎంతో సహనంగా ఉన్నారు. ఈ రెండు సంఘటనలు పోల్చదగినవే కదా! అందుకే చప్పట్లు కొట్టాను!” అన్నది లక్ష్మీదేవి.
”కాని శ్రీవారు స్పందించటం లేదు! వారు మళ్లీ యోగనిద్రలోకి జారుకున్నట్లే ఉన్నది!” అని నారదుడు అంటూండగానే, శివ పార్వతులు, సరస్వతి బ్రహ్మలు ప్రత్యక్షమయ్యారు!
నారదుడు ఆశ్చర్యపోయాడు

”ఏమిటిది? త్రిమూర్తుల సంగమమా? ఏమిటీ విచిత్రము? త్రిమూర్తులు, ఏకంగా జగన్మాతా సమేతులై ఉన్నారు? ఏమిటీ అపూర్వ సంగమం? అన్నాడు నారదుడు మహాశ్చర్యంతో.
”నారదా! సనాతధర్మమంటూ భూలోకంలో జరుగుతున్న నాటకానికి తెరదించదలిచాను! ఈ సకల చరాచర సృష్టి మా ముగ్గురి త్రిమూర్తుల కనుసన్నలలో, ఈ ముగ్గురు జగన్మాతల అండదండలతో నడుచుచున్నది. ఇంతకుముందే నారదుడు చెప్పినట్లు, న్యాయ మూర్తిపై పాదరక్షను విసరమని ఆ న్యాయవాదికి మీలో ఏ ఒక్కరైనా ఆదేశించినారా?” అని ప్రశ్నించాడు విష్ణుమూర్తి.
”లేదుగాక లేదు! ఆ న్యాయవాదికి మేము ఎవ్వరము అలాంటి ఆదేశములు ఇవ్వలేదు! ఇలాంటి అర్భకపు పమలు చేయమని ఆదేశించుటకు మేము ఏ పనీపాటా లేకుండా వృథాగా పడి ఉన్నామా?” ఆగ్రహంగా అన్నారు శివపార్వతులు, సరస్వతీ బ్రహ్మలు.

”చూచితివా నారదా? మా త్రిమూర్తులతో పాటు, ముగ్గురు జగన్మాతలు కూడా పాదరక్షను న్యాయమూర్తిపైకి విసరమని ఆ న్యాయవాదికి ఆదేశించలేదు! అనగా ఆ న్యాయవాది బుద్ధికి తోచిన పనిని చేసి, ఆ నెపమును మాపై నెట్టుచున్నాడు. తన దుర్భద్ధికి సనాతన ధర్మమును కవచముగా వాడుకొనుచున్నాడు. సనాతన ధర్మము అనగా అనాదిగా వస్తున్న ధర్మము అని భావము. మేము సృష్టించిన ఈ విశ్వము ఒక పద్ధతి ప్రకారం నడుచుటకై కృత, త్రేత, ద్వాపర, కలియుగాలను ఏర్పాటుచేసితిమి. ప్రతి యుగమునకు ప్రత్యేక కాలమును, ప్రత్యేక ధర్మాబారాలను ఏర్పాటు గావించితిమి! యుగము మారి పోయిన తర్వాత ధర్మము, ఆచార వ్యవహారములు కూడా మారిపోవుచుండును” అన్నాడు విష్ణుమూర్తి.
”బోధపడేలా చెప్పండి స్వామీ” అడిగాడు నారదుడు.

”కృత యుగములోని ధర్మము, ఆచార వ్యవహారములు కలియుగమునకు వర్తించవు. మనుస్మృతి కూడా కలియుగమునకు వర్తించదు. కలియుగమునకు పరాశర స్మృతి మాత్రమే వర్తించునని వేదాలను విభజించినపుడు నేను వ్యాసుడి అవతారమునందు నిర్దేశించితిని. ఇక ఈ సనాతన ధర్మానికి తావెక్కడిది? మానవులు కలియుగమందు స్వార్థపరులై, సనాతన ధర్మము పేరిట ప్రజలను, ఇక్కట్లకు గురి చేయుచున్నారు! మా సృష్టిలో సనాతన ధర్మమను దురాచారము లేనేలేదు! మా దేవుళ్ల పేరిట, సనాతన ధర్మము పేరిట ప్రజలను ఇక్కట్లకు గురిచేయుటను మేము అంగీకరించము, సహించము కూడా! సనాతన ధర్మమును జ్ఞాననేత్రముగా కొందరు భావిస్తున్నారు! తన పాదములో ఉన్న జ్ఞాన నేత్రమువల్ల భృగు మహర్షికి అహంకారము పెరిగింది. కలియుగములోని సనాతన ధర్మము భృగు మహర్షి జ్ఞాన నేత్రము వంటిడే! దానివల్ల సమాజానికి ఎలాంటి ప్రయోజనము లేదు! జ్ఞాననేత్రం వల్ల వచ్చిన అహంకారంతో భృగువు నా గుండెల మీదనే తన్ని ఫలితాన్ని అనుభవించాడు. కలియుగంలో అదే జరుగబోవుచున్నది” అన్నాడు విష్ణుమూర్తి.
దేవీ దేవతలందరూ సత్యము అన్నట్లు తలలూపారు!

  • ఉషాకిరణ్‌
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -