Sunday, October 12, 2025
E-PAPER
Homeకథరాంగ్‌ నంబర్‌

రాంగ్‌ నంబర్‌

- Advertisement -

రాత్రి ఒంటిగంట సమయం. తీర్థ బాబుకు మెలకువ వచ్చింది. టెలిఫోన్‌ మోగసాగింది. అర్ధరాత్రి టెలిఫోన్‌ మోగడం వల్ల ఇంత భయం ఎందుకేస్తుంది?
”హలో ! వింటున్నారా… హాస్పిటల్‌ నుండి మాట్లాడుతున్నాను . ఇప్పుడిప్పుడే మీ పేషెంట్‌ మరణించాడు. హలో”
”మా పేషెంటా? మా పేషెంట్‌ ఎవరూ ఆస్పత్రిలో లేరు”
”మీ నెంబర్‌ ..!”
”రాంగ్‌ నంబర్‌ , ఫోన్‌ పెట్టెయ్యండి..?”
”ఈ మనుషులు అసలు రాంగ్‌ నంబర్‌కు ఫోన్‌ ఎందుకు చేస్తారు? తీర్ధ్‌ బాబు ఫోన్‌ తీసి కింద పెట్టేసాడు. భయం వేస్తుంది! చాలా భయం వేస్తుంది” గొణుక్కున్నాడు.
”ఎందుకు వేళగాని వేళ ఫోన్లు మోగుతాయి? ఇన్ని రాంగ్‌ నంబర్‌లు ఎందుకొస్తున్నాయి?” – సవిత అడుగుతుంది.
చాలా రోజుల నుండి సవిత, తీర్థ్‌ బాబు రాత్రి పొద్దుపోయే దాకా నిద్రపోవడం లేదు. సరిగ్గా రాత్రి పన్నెడు గంటలకు తీర్థ్‌ బాబు నిద్రమాత్ర ఒకటి వేసుకుంటున్నాడు. మాత్ర వేసుకొని కళ్ళు మూసుకొని ఆందోళనను మనసు నుండి దూరం చేసే ప్రయత్నం చేస్తూ వుంటాడు. కానీ చేయలేకపోతాడు. లక్ష ప్రయత్నాలు చేసినా ఆందోళనను తరిమికొట్టలేకపోతాడు. అతనిలోని చేతనా, అచేతనల మధ్య, ప్రారంభ స్థాయిలోని చేతనా, తీవ్రమైన స్థాయికి చేరిన చేతనల మధ్య ఒక ప్రత్యేకమైన గోడ నిలబడి పోతుంది. ఆ గోడల మీద పోస్టర్లు అతికి వుంటాయి.
దీపాంకర్‌ ఫొటోలు – బాల్యంలో దీపాంకర్‌, అమాయకత్వం ఉట్టిపడే ముఖం, మెట్రిక్‌ పాసైన దీపాంకర్‌, గ్రాడ్యుయేట్‌ దీపాంకర్‌, ఒడ్డుపొడుగు, భావుకత, శాంతిమత్వం కలిగిన ముఖారవిందం.
దీపాంకర్‌, తీర్ద్‌ బాబు ఒక్కగానొక్క కొడుకు. సంతానం.. సంతానం… మనిషి సంతానం కోసం ఇంతగా తపన ఎందుకు చెందుతాడు. సంతానాన్ని ఇంతలా ఎందుకు ప్రేమిస్తాడు. తీర్థ్‌ బాబు ప్రతిరోజూ ఈ ప్రశ్న తను వేసుకుంటాడు. అప్పుడు నిద్రపడుతుంది. గాఢమైన నిద్ర. ఐనా ఆందోళన, సంఘర్షణలో మునిగిన నిద్ర. సవిత ఇంకా నిద్రపోయినట్లు లేదు. అందుకే అడుగుతుంది ‘ఎవరి ఫోన్‌’ అని.
”రాంగ్‌ నంబర్‌ లే!”
”ఎక్కడి నుండి వచ్చింది?”
”హాస్పిటల్‌ నుండి”
”హాస్పిటల్నుండా! వినండి, మన కోసమే వచ్చిన ఫోన్‌ కాదు గదా?”
”పిచ్చిగా మాట్లాడకు సబు, నీకు తెలుసు కదా, దీపు, నీరేన్‌ దగ్గరున్నాడని! అక్కడ నీరేన్‌ను ఢిల్లీలో భర్తీ చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. అన్నీ తెలిసి వుండి కూడా పిచ్చిగా మాట్లాడుతావు”
”నీరేన్‌ దగ్గరే ఉంటే, దీపు మనకు ఉత్తరం ఎందుకు రాయడు? నీరేన్‌ ఉత్తరం ఎందుకు రాయడు? మీరేమనుకుంటున్నారు, నేనేడుస్తాను, గొడవ చేస్తాననా? పరిగెత్తి నీరేన్‌ దగ్గరికెళ్ళిపోతానని అనుకుంటున్నారా?”
”సబు గాభరా పడకు!”
”దీపు, నీరేన్‌ దగ్గర లేడనిపిస్తుంది నాకు! నీరేన్‌ కావాలని మనకు ఏ సమాచారం ఇవ్వడం లేదు”
”శాంతించు సబూ, ఏడవకు, అన్నీ సర్దుకుంటాయి. నీకు తెలుసు గదా దీపు ఇల్లు వదిలి వెళ్ళిపోవడానికి ఏ కారణం లేదు!”
”మరి అతనెందుకు తిరిగి రాడు?”
”సబూ, ఆరోగ్యం బాగాలేక నీ మెదడు సరిగా పని చేయడం లేదు. సమయం బాగా లేదు . మనమున్న ప్రాంతం కూడా మంచిది కాదు. అందుకే అతను రావటం లేదు”
సవిత వెక్కిళ్ళు బెడుతూ ఏడవడం మొదలుపెడుతుంది. ఏడుస్తూ ఏడుస్తూ నిద్రలోకి జారుకుంటుంది. తీర్థ్‌ బాబుకు నిద్ర పట్టడానికి సమయం పడుతుంది. ఏమైంది ఈ దేశానికి. మంచిది. రోగి ఒక వేళ చనిపోతే టూ – త్రి ఎక్స్చేంజి నంబర్‌కు ఫోన్‌ చేస్తే జవాబు వస్తుంది. నాలుగు – ఏడూ నెంబర్‌ కు ఫోన్‌ చేయాలి? రాంగ్‌ నెంబర్‌ అని ఎవరి పేషంట్‌ అతను. వారి మానసిక స్థితి ఎలా వున్నదో?”
లేదా ఏ గొడవ లేదేమో? ఈ రోజుల్లో ఎలా ఉందంటే కురుక్షేత్రంలో అందరూ అర్జునుడిలా ఐపోయారు. మత్యువును అత్యంత వైరాగ్య భావంతో తీసుకుంటున్నారు. బహుశా శవాలు మంచాల పైనే పడివుంటున్నాయేమో! ఖర్చునుండి తప్పించుకోవడానికి బందువులు కూడా తప్పించుకుంటున్నారు. తిరిగి రావడమే లేదు. అవి ఎ.సి. శవాల మార్చురీలోనే పడి వుంటాయి. వాటిని చూడటానికి ఎవ్వరూ రారు.
తీర్థ్‌ బాబుకు భయం వేస్తుంది. ఇలాగే అకారణంగా భయం వేస్తుంది. అతనికనిపిస్తోంది ఈ కలకత్తాలో, ఈ పశ్చిమ బెంగాల్‌లో ఎక్కడైతే ఉంటున్నాడో అది వేరే కలకత్తా, వేరే పశ్చిమ బెంగాల్‌లా భావన కలుగుతుంది. చూస్తే మాత్రం అదే నగరం, అవే విశాలమైన మైదానాలు, భవానీపూర్‌, అల్లీపూర్‌, చఢాక్‌ ఢాంగా రోడ్డు మలుపు, ఆషాడంలో ఎప్పటిలాగే రథాల మేళ, చైత్రంలో కాళీఘాట్‌ సందడి, మాఘమాసం ఉత్సవాలు…!
కాదు, ఇది ఆ నగరం కాదు, ఇదొక తప్పుడు నగరం. రాంగ్‌ సిటీ, పొరబాటున ఏదో రైలెక్కి మరేదో నగరానికి వచ్చాడు తీర్థ్‌ బాబు.
లేకపోతె సవితకు చేసిన జ్ఞానబోధను మరిచి తీర్థ్‌ బాబు ఆలోచించసాగాడు. నిజమే మరి, దీపాంకర్‌ ఉత్తరమెందుకు రాయలేదు, నీరేన్‌, దీపాంకర్‌ సమాచారం ఏదీ ఎందుకు తెలియపర్చటం లేదు.
ఎందుకు, మనిషి ఎందుకు అంతగా సంతానం కోసం అర్రులు చాస్తాడు. ఎందుకు కొడుకును అంతగా ప్రేమిస్తాడు. చివరి క్షణాల్లో తలకొరివి పెడతాడనా? రాంగ్‌ నెంబర్‌ శరీరంలో ప్రాణం వున్నంత వరకే తీర్థ్‌ బాబు సంతానాన్ని ప్రేమిస్తాడు, నువ్వు నా దగ్గర వుండు, నువ్వు నా సమీపంలోనే ఉండు, నా బాధలను పంచుకో, నా సుఖాలను తీసుకో, నా సంపదను తీసుకో, నాతో మమేకం కావడం నేర్చుకో.
”రాంగ్‌ హోప్‌!”
”ఈ నగరంలో ఎక్కడో ఎక్స్చేంజి వుంది. అది ఎక్కడ వుంది. అక్కడ కూర్చొని ఎవరో తీర్థ్‌ బాబుతో చెబుతున్నారు – రాంగ్‌ నెంబర్‌, రాంగ్‌ సిటీ, రాంగ్‌ హోప్‌” అని .
ఎవరతను? ఆ అదశ్య ఆపరేటర్‌ ఎక్కడున్నాడు? ఆ ఆపరేటర్‌ కనబడడేమి? ఇలా ఆలోచిస్తూ ఆలోచిస్తూ ఒక్కసారిగా శిలలా నిద్రలో మునిగిపోతాడు. ఇలాగే గడిచి పోతుంది. పగలు రాత్రి, సోమవారం నుండి ఆదివారం వరకు, ఉదయం నుండి సాయంత్రం వరకు. తీర్థ్‌ బాబుకు రాత్రులంటేనే భయం వేస్తుంది. ఎందుకంటే నిద్రలో గోడలే వరసలు కట్టి నిలబడినట్లు దర్శనమిస్తాయి .
గోడ మీద దీపాంకర్‌ చిత్రపటం అంకితమవుతుంది. నిద్రలోనే తీర్థ్‌ బాబు ఆలోచిస్తూ ఉంటాడు – అతనేమైనా మనోజ్‌ దగ్గరికెళ్ళాడా? మనోజ్‌ అతని మిత్రుడు. అతనొక మానసిక వైద్య నిపుణుడు కూడా! నిశ్చయంగా తీర్థ్‌ బాబు రోగపీడితుడయ్యాడు.
”నువ్వు అనారోగ్యంతో బాధపడ్తున్నావు తీర్థ్‌?” మనోజ్‌ తన అభిప్రాయం తెలిపాడు. అతను పరీక్షిస్తున్నాడు. తీర్థ్‌ బాబు మొహం పాలిపోయి వుంది, చూపు సన్నగిల్లింది, మాటిమాటికి నుదుటి మీద చెమటను తుడుచుకోసాగాడు …
”ఏం రోగం వుంది?”
”నరాల బలహీనత!”
”నా నరాలు బాగానే వున్నాయి, మనోజ్‌”
”మీ ఆలోచనలు విచిత్రంగా వున్నాయి”
”విచిత్రంగానా?”
”మీరేమన్నారో, వినండి”
మనోజ్‌ టేప్‌ రికార్డర్‌ ఆన్‌ చేసాడు. మనోజ్‌ తన పేషంట్ల మాటలను రికార్డు చేసి పెట్టుకుంటాడు. ఆ తరువాత వాటిని పరిశీలిస్తాడు. తన అభిప్రాయాన్ని తెలుపుతాడు. తీర్థ్‌ బాబు టేప్‌ రికార్డర్‌ను చూస్తూ మనసులోనే డబ్బు లెక్కలు కట్టుకుంటున్నాడు. అంతలోనే ఒక్కసారిగా అలసిపోయినట్లున్న ఒక మంద్ర స్వరం అతనికి వినబడుతుంది.
”ఈ ఇల్లు నాది కాదనిపిస్తుంది. తలుపు తట్టినా ఎవ్వరూ తీయరు, ఎందుకంటే నేను రాంగ్‌ అడ్రెస్‌కు వచ్చాను. దారెంట నడుస్తూ వున్నప్పుడు నాకనిపిస్తుంది కలకత్తా ఇప్పుడు కలకత్తాలా లేదు. ఇది కలకత్తా కాదు. బయటవున్న ఇండ్లు, దర్వాజలు, విశాలమైన మైదానాలు మాన్యుమెంట్‌ లు అన్ని కూడా ఎవరి చేతిలోనే అప్పజెప్పి కలకత్తా ఎక్కడికో పారిపోయింది. నాకనిపిస్తుంది – ఇట్‌ ఈజ్‌ ఏ రాంగ్‌ సిటీ. నమ్మకం కలగాల్సిన అవసరమే లేదు. ఇది కలకత్తా అని చెప్పడానికి నేను ఒక రోజు కేవడ్‌ తల్లా వెళ్లాను. గోడల మీద రాతలు చూసి నేను రావలసిన చోటుకు రాలేదనిపించింది. ఆ రోజు నాకొక కల వచ్చింది”
మనోజ్‌ టేప్‌ రికార్డర్‌ ఆపేసాడు. తీర్థ్‌ బాబు వైపు చూసి, ”ఏం చూసావు కలలో తీర్థ్‌”’
”చెప్పలేను”
”ఎలాంటి కలగన్నావు”
”నన్నేమి అడక్కు మనోజ్‌, ఈ కల నాకు తరుచుగా వస్తుంటుంది”
”అందుకే తెలుసుకోవడం నాకవసరం”
”లేదు మనోజ్‌”
”నువ్వు అనారోగ్యంతో వున్నావు. సహజమే నువ్వు రోగివి కావడం సహజమే”
”ఎందుకు, నేను రోగం బారిన పడటం ఎందుకు సహజం?”
”నీ కొడుకు …”
”నా కొడుకు … ఏంటి ?”
”ఇంట్లో లేడు కదా !”
”మనోజ్‌, నాకు తెలియదు నీకెవరు చెప్పారో, నా కొడుకు దీపాంకర్‌ తన కజిన్‌తో పాటు లక్నోలో వున్నాడు. అక్కడ నుండి ఢిల్లీ వెళ్తాడు చదువు కోసం”
”ఓ గాడ్‌”
ఒక దీర్ఘ శ్వాస తీసుకొని మనోజ్‌ చాలా బాధతో చెప్తాడు – ”తీర్థ్‌కు ఏమైంది. మా స్నేహితులందరిలో తీర్థ్‌ బాబు చాలా సౌమ్యంగా వుండే వ్యక్తి. అందరికన్నా మంచివాడు”
”ఓ గాడ్‌”
మనోజ్‌ ఒక కాగితంపై మందు పేరు రాస్తాడు. తిరిగి ఆ కాగితం చింపి పారేస్తాడు. ఒక మందు సీసా తీర్థ్‌ బాబుకు ఇస్తూ ”దీన్ని రాత్రి తీసుకోవాలి, మంచి నిద్ర వస్తుంది”
”మంచిది, ఇవ్వు”
తీర్థ్‌ బాబు మందు సీసా తీసుకొని బయటికి వస్తాడు. మనోజ్‌ తలుపు వరకు వచ్చి ”నీ దగ్గరికి బోస్‌ మళ్ళీ రాలేదు కదా!”
”లేదు, ఎందుకడుగుతున్నావ్‌?”
”నేనే అతన్ని వద్దన్నాను!”
”నువ్వేమనుకున్నావ్‌, అతనొస్తే మాత్రం నేనింట్లోకి రానిచ్చేవాడినా? అనవసరంగా వచ్చి సవితతో పిచ్చి పిచ్చిగా మాట్లాడి చిరాకెత్తిస్తాడు”
తీర్థ్‌ బాబు బయటికొచ్చాడు. ఈ సమయం సాయంత్రం అవుతుందా? తెల్లవారుతుందా? రోడ్డు మీద మనుషులు గుంపులు గుంపులుగా పోతున్నారు. ఇక్కడి రోడ్లు ఒక్కసారిగా నిర్మానుష్యమయ్యాయి.
రద్దీ లేని రోడ్డు… మేఘాలు కమ్ముకున్నాయి. వర్షం, తూఫాను, జయసింగ్‌ తన కరవాలాన్ని గర్వంగా పట్టుకొని వున్నాడు. – రవీంద్రనాథ్‌ ఒక చోట చేసిన ఈ వర్ణన తీర్థ్‌ బాబును బాగా ఆకర్షించింది .
దీపాంకర్‌ పుస్తకంలో ఒక పాఠం వుంది – ”రాజర్షి”
తీర్థ్‌ బాబుకు తన కళ్ల నుండి నీరు టపటపా కారుతున్న భావన కలిగింది.
ఈ తరం పిల్లలు చాలా తీవ్ర స్వభావంతో వున్నారు. విచ్చలవిడితనం ఎక్కువైపోయింది. ఏ మాత్రం బెరుకు లేకుండా తల్లిదండ్రులను హత్య చేస్తున్నారు. తీర్థ్‌ బాబు చాలా జాగ్రత్తగా మందు సీసాను అదేదో ఒలంపిక్‌ జ్యోతిలా చేతిలో పెట్టుకొని పోతున్నాడు.
ఈ రోజు రాత్రి తీర్థ్‌ బాబు మళ్ళీ నిద్రలో అదే కలగన్నాడు. అతను చౌరంగీ రోడ్డు మీద లక్షలాది ప్రజలు నిలబడి వున్నట్లు చూసాడు. రోడ్డుకిరువైపులా నియాన్‌ లైట్లు వెలుగుతున్నాయి. రోడ్డు మధ్యలో రక్తం ధారలుగా పరుచుకొని వుంది. అక్కడ నిలబడి వున్న ఒక ప్రౌఢ మహిళ గుండెలు బాదుకుంటూ వుంది. ”ప్రవీర్‌ … అరే ప్రవీర్‌, ప్రవీర్‌” అంటూ మహిళ ఏడవసాగింది. చెదిరిపోయివున్న కేశాలు ఆమె నోటికి అడ్డం పడుతున్నాయి. ఆ మహిళను చూడగానే తీర్థ్‌ బాబుకు అర్థమైంది అది పురాణంలో వర్ణించిన ఒక ఘటన అని.
”భీషణమైన దూర దూర నిర్జన ప్రదేశాల్లో
మరుభూమిలో, విలాపాల స్మశానంలో –
ఇక్కడ ఈ స్థానం నీది కాదు
దుర్గమమైన అడవుల్లో, మంచుతో కప్పబడిన దారుల్లో
పర్వత శిఖరాలపై పయనించు
పాపభూయిష్టమైన రాజ్యాన్ని వదులు
నీ భర్త పుత్ర హంతకుడు, శత్రువుతో సహవాసం చేసేవాడు
పుత్రశోకతప్తురాలా నడు …”
ఆ స్త్రీ విలాపంతో ఆకాశం గుండెలు పగిలిపోతున్నాయి. ఇదే సమయం – తెర దించండి, గంట మోగించండి… ఎవరు ఈ మాటలు వల్లిస్తూ అరిచేది, ఎవరంటున్నారు ఇది మహిష్మతిపురం కాదని, వెళ్లిపోండి.
అదే క్షణంలో తీర్థ్‌ బాబు చెప్పదల్చుకున్నాడు – ”షో ఇస్‌ ఇన్‌ ది రాంగ్‌ సిటీ” కానీ అదే సమయంలో గంట మోగుతుంది – ఘణ్‌ ఘణ్‌ ఘణ్‌ ఘణ్‌… గంట మోగుతుంది, ఫోన్‌ మోగుతుంది .
తీర్థ్‌ బాబు లేచి కూర్చున్నాడు. మనిషి టెలిఫోన్‌ ఎందుకు పెట్టుకుంటాడు? అద్దె కట్టడానికి ప్రాణం పోతుంది.
తీర్థ్‌ బాబు రిసీవర్‌ ఎత్తాడు.
”ఫోర్‌ సెవెన్‌ నైన్‌…” సరిగ్గా ఇదే నెంబర్‌ తీర్థ్‌ బాబు టెలిఫోన్‌ మీద రాసివుంది. తీర్థ్‌ బాబు ”నో” అన్నాడు.
”ఇది తీర్థంకర్‌ చటర్జీ గారిల్లు కాదా?”
”నో”
”తీర్థ్‌ బాబు నేను బోస్‌ను ఆ రోజు నేనన్నాను గదా! రైల్వే లైన్‌కు కాస్త దూరంలో వున్న ఇంట్లో దీపాంకర్‌ శవం… గాయాలతో చనిపోయాడు. కాని మీరు రానే లేదు. బాడీ హస్‌ బీన్‌ క్రిమేటెడ్‌, హలో వింటున్నారా?”
”నో”
”ఇది తీర్థంకర్‌ చటర్జీ ఇల్లు కాదా?”
”కాదు”
”ఇది ఫోర్‌ సెవెన్‌… నైన్‌ కాదా?”
”కాదు, కాదు … రాంగ్‌ నెంబర్‌”
తీర్థ్‌ బాబు ఫోన్‌ కింద పెట్టేసాడు. మళ్లీ ఏమనుకున్నాడో రిసీవర్‌ ఎత్తి పెట్టేసాడు. తర్వాత వెళ్లి బెడ్‌ మీద పడుకున్నాడు. మళ్లీ కలగనాలి. ఎలాగైనా సరే ఆ కలను మళ్ళీ ఒక సారి చూడాలి. కలను దర్శించిన తరువాతనే తీర్థ్‌ బాబు తెలుసుకోగలుగుతాడు. ఏ విధంగా ఉన్మాది మహిళ రాంగ్‌ సిటీ నుండి పరుగెత్తుకెళ్లింది. కల మినహాయించి తీర్థ్‌ బాబు దగ్గర ఇంకేమి లేదు. మేల్కొని కలకత్తా వీధుల్లో తిరుగాడినా తప్పించుకోడానికి తీర్థ్‌ బాబుకు ఒక దారి కూడా కానరాలేదు. ఇప్పుడు జనం వెనక వెనక వెళ్ళాలి. ప్రవీర్‌ మరణం తర్వాత ప్రవీర్‌ తండ్రిని తీసుకొని అందరూ విజయోత్సవంలో మునిగిపోయారో? అప్పుడే జనాలందరూ పరుగెత్తుకుపోయారు.
తీర్థ్‌ బాబుకు నిద్ర ముంచేసింది!
బెంగాలీ కథ : : మహాశ్వేతా దేవి
తెలుగు అనువాదం : డా. రూప్‌ కుమార్‌ డబ్బీకార్‌

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -